Advertisement

Advertisement


Home > Politics - Gossip

గుండెపోటుతో జర్నలిస్టు సురేష్ హఠాన్మరణం

గుండెపోటుతో జర్నలిస్టు సురేష్ హఠాన్మరణం

సీనియర్ పాత్రికేయుడు, సుదీర్ఘ కాలం క్రియాశీల పాత్రికేయ రంగంలో సేవలందించిన కురసాల సురేష్ బాబు బుధవారం రాత్రి 11 గంటల సమయంలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. సురేష్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి, స్వతహాగా పాత్రికేయుడు అయిన కురసాల కన్నబాబుకు స్వయానా తమ్ముడు. సినీదర్శకుడు కల్యాణ్ కృష్ణ.. సురేష్ కు స్వయాన తమ్ముడు. 48 ఏళ్ల కురసాల సురేష్ బాబుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

కురసాల సురేష్ ఈనాడులో గ్రామీణ విలేకరిగా తన పాత్రికేయ ప్రస్థానం ప్రారంభించి.. తర్వాత.. స్టాఫ్ రిపోర్టర్ గా ఎదిగారు. మారేడుమిల్లిలో విద్యాభ్యాసం సాగించిన సురేష్.. అక్కడ కంట్రిబ్యూటరుగానే మొదట జర్నలిజంలోకి ప్రవేశించారు. గిరిజనులు, దుర్భరంగా ఉన్న వారి స్థితిగతులు గురించి అత్యద్భుతమైన మానవీయ కథనాలు రాయడం ద్వారా.. గ్రామీణ విలేకరిగా ఉన్న రోజుల్లోనే మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

సుమారు ఒకటిన్నర రోజుల పాటు కాలినడకన కొండలు అడవుల్లో వెళ్లి.. మారుమూల గిరిజనుల నివాస ప్రాంతమైన ‘గుడిసె’ అనే పేరుగల కుగ్రామం గురించి.. వెలుగులోకి తెచ్చాడు సురేష్. అప్పట్లో అది సంచలనం అయింది. అప్పటిదాకా అలాంటి పల్లె గురించి వినిఉండని అధికారులు అక్కడకు క్యూ కట్టారు. ఆ గిరిజనుల గురించి పట్టించుకున్నారు.

స్టాఫ్ రిపోర్టర్ అయిన తర్వాత.. విశాఖపట్టణంలోనే కురసాల సురేష్ చాలాకాలం పాటు పాత్రికేయ వృత్తిలో ఉన్నారు. తర్వాత.. విరమించుకుని నిర్మాణ రంగంలోకి వెళ్లారు. పాత్రికేయ వృత్తి పట్ల చిత్తశుద్ధిగల వ్యక్తిగా సురేష్ కు పేరుంది. ఆయన హఠాన్మరణం పట్ల మిత్రులు, సహచర పాత్రికేయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కురసాల సురేష్ మృతిపట్ల ఆయన కుటుంబసభ్యులు, తండ్రి సత్యనారాయణ, అన్నయ్య కన్నబాబు లకు పలువురు సానుభూతి తెలియజేశారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?