రాజకీయ పార్టీలో ఏ నాయకుడి లేదా నాయకురాలి వైభవం, ప్రాధాన్యం ఎంతకాలం ఉంటాయో, కొనసాగుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఒక పార్టీలో కీలక నేతలుగా చెలామణి అయినవారు ఏదో ఆశించో లేదా ఇతర కారణాలవల్ల వేరే పార్టీలోకి వెళితే అంతే కీలకంగా ఉంటారని చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి అనుభవమే బీజేపీ ఏపీ నాయకురాలు, టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరికి ఎదురైంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్సార్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరిన పురందేశ్వరి యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా అధికారం చెలాయించారు.
కాంగ్రెస్ పార్టీ ఆమెను బాగా ఆదరించింది. కానీ అదంతా మర్చిపోయిన పురందేశ్వరి రాష్ట్ర విభజన తరువాత బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఆ పార్టీలో అంత బాగాలేదని టాక్ వస్తోంది. బీజేపిలో చేరినప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా లేని పురందేశ్వరి.. ఒకానొక దశలో ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపించింది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు – పురందేశ్వరిల వారసుడు దగ్గుబాటి హితేష్‌ని రాజకీయాల్లోకి దింపేందుకు ప్లాన్ జరుగుతున్నట్టుగానూ ఓ ప్రచారం జరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీలో చేరి, తాను గతంలో అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుండే వైసీపీ తరపున హితేష్‌కి టికెట్ ఇప్పిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ మంతనాలు జరిగినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది.
ఒకవేళ హితేష్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగితే.. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలో పురందేశ్వరి ఉన్నారనేది ఆమె సన్నిహితులు చెప్పే మాట. ఇక అసలు విషయానికి వస్తే …పురందేశ్వరికి ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఇచ్చిన పదవులను బీజేపి తిరిగి తీసుకుంటోంది. బీజేపిలో చేరికలపై ఆసక్తి చూపించకపోగా.. టీడీపీకి దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తున్న పురందేశ్వరి విషయంలో ఇకనైనా జాగ్రత్త పడకపోతే లాభం లేదని బీజేపి అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. అందుకే గత నెలలో ఒరిస్సాలో బీజేపి ఇంచార్జ్ పోస్ట్ నుంచి తప్పించి సహ ఇంచార్జ్‌గా కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా ఛత్తీస్‌ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి కూడా పురందేశ్వరిని తప్పిస్తూ బీజేపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఇక మిగిలిందల్లా.. చేరికల కమిటీ బాధ్యతల నుంచి తప్పించడమేనని.. ఇక రేపోమాపో ఆ పని కూడా జరిగిపోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపిలో చేరికలపై పురందేశ్వరి ఆసక్తి చూపించకపోవడం బీజేపి ఆగ్రహానికి ఓ కారణమైతే.. ఇటీవల కాలంలో ఆమె టీడీపీ పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నారని, ఆమె ఆ పార్టీకి దగ్గరవుతున్నారా అనే అనుమానాలు బీజేపికి కలుగుతున్నాయంట. తన తండ్రి స్థాపించిన టీడీపీ వైపు ఆమె ఆకర్షితులవుతున్నట్టు గ్రహించిన బీజేపి హై కమాండ్.. ఆమెపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి పెట్టినట్టు టాక్. బీజేపీలో చేరికల కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉన్న పురందేశ్వరి ఆ స్థానానికి, ఆ పదవికి న్యాయం చేయడం లేదని బీజేపి భావిస్తోందట.
టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రాంతాల వారీగా వివిధ బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు బీజేపిలో చేరేలా పురందేశ్వరి వ్యవహరిస్తారని భావించినప్పటికీ.. ఆమె ఆ దిశగా ఏ కోశానా ప్రయత్నాలు చేయడం లేదని స్వయంగా బీజేపి అధిష్టానమే అర్థం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. చేరికల కమిటీ మీటింగ్స్ పెట్టి పార్టీని పునరుత్తేజపర్చాలని స్వయంగా అమిత్ షా వంటి సీనియర్ నాయకులే చెప్పినా.. ఆమెలో చలనం లేదనేది పురందేశ్వరి మీదున్న ప్రధానమైన అభియోగం. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో ఆమెకు ఉన్న సంబంధాలు భవిష్యత్తులో తమ పార్టీకి కలిసొస్తాయని అప్పట్లో బీజేపి భావించిందంటారు. ముఖ్యంగా టీడీపీకి చెందిన కీలక నేతలను, ఇతర రంగాల ప్రముఖులను బీజేపిలో చేర్పించడంలో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషిస్తారని బీజేపి భావించినట్టు సమాచారం.
అందుకే ఆమె రాజంపేట లోక్ సభ స్థానం ఓడినప్పటికీ.. ఆ ఒక్క టికెట్‌తో మాత్రమే సరిపెట్టకుండా పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అన్నింటికి మించి బీజేపీలో చేరికల కమిటీకి చైర్‌పర్సన్‌గా నియమించిన బీజేపి అధిష్టానం.. ఆమె నుంచి ఎంతో ఆశించిందని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. కాంగ్రెస్ పార్టీ నుండి రెండుసార్లు లోక్ సభకు ఎన్నికై రెండుసార్లు కేంద్ర సహాయ మంత్రిగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరికి కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి.
మరోవైపు తన తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ నేతలతోనూ ఆమెకు అంతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కూతురిగా ఆమె ఎక్కడికెళ్లినా అక్కడ ఆమెకు సముచిత స్థానం, గౌరవం దక్కేవి. అయితే, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోయి ఆ పార్టీ నేతలు దిక్కులు చూస్తున్న సమయంలోనే ఆమె కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపిలో చేరారు. బీజేపీ తన ప్రాధాన్యం తగ్గిస్తూ వస్తున్న క్రమంలో పురందేశ్వరి ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరమైన ప్రశ్న.