సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణకు బిగ్‌బాస్ హోస్ట్, హీరో నాగార్జున గట్టి కౌంటర్ ఇచ్చారు. వీకెండ్లో భాగంగా నాగార్జున ప్రతి శని, ఆదివారాల్లో కంటెస్టెంట్లతో మాట్లాడే సంగతి తెలిసిందే. పనిలో పనిగా ఎలిమినేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయడం వీకెండ్స్ ఆనవాయితీ. తాజాగా స్టార్‌మా వీకెండ్ షోకు సంబంధించి ప్రోమో విడుదల చేసింది.
ఇందులో సీపీఐ నాయకుడు నారాయణకు నాగార్జున పేరు పెట్టి మరీ కౌంటర్ ఇవ్వడాన్ని గమనించొచ్చు. గత కొంత కాలంగా బిగ్‌బాస్ రియాల్టీ షోపై నారాయణ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ హౌస్ ఓ బ్రోతల్ హౌస్ అని ఘాటు విమర్శలు చేశారు. అలాగే కాసులకు కక్కుర్తి పడేవాళ్లున్నంతకాలం ఇలాంటి షోలు ఉంటాయన్నారు.
బిగ్‌బాస్ షోతో ఏం సందేశం ఇస్తున్నారో ప్రేక్షకులు ప్రశ్నించాలని కోరారు. బిగ్‌బాస్ షోను బూతుల స్వర్గంగా మారుస్తారా? అదొక అనైతిక షో అని నారాయణ విరుచుకుపడ్డారు. అందులోకి వింత జంతువులు వెళ్లాయన్నారు.
హీరో నాగార్జునపై కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. నాగార్జున డబ్బు కోసం కక్కుర్తి పడి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో నారాయణకు కౌంటర్ అన్నట్టు ఫస్ట్ వీక్‌లో నాగార్జున దీటైన కౌంటర్ ఇచ్చారు. ఇందుకు పదో కంటెస్టెంట్స్‌గా వెళ్లిన రియల్ కపుల్ రోహిత్- మెరీనా జంటను ఉపయోగించుకున్నారు. తనకు హగ్ ఇవ్వడం లేదని, చనువుగా ఉండడం లేదని అప్పుడప్పుడు హౌస్‌లో రోహిత్‌పై మెరీనా అలకబూనుతుండడాన్ని తీసుకుని నాగార్జున సందర్భోచితంగా నారాయణకు సమాధానం ఇచ్చారు.
రోహిత్ ప్లీజ్ పట్టించుకోమ్మా అని నాగార్జున అభ్యర్థిస్తున్నట్టు అభినయించారు. పట్టించుకుంటాను సార్ కానీ అని రోహిత్ ఏదో చెప్పబోయాడు. సిగ్గు ఎక్కువ సార్ అని మెరీనా అంటుంది. నాగార్జున స్పందిస్తూ …”అందరున్నారని ఇబ్బంది పడకూడదు. నీకు లైసెన్స్ వుంది” అని నాగార్జున కవ్విస్తాడు. మెరీనా కోసం అందరి ముందు ఒక టైట్ హగ్ ఇవ్వాలని నాగార్జున సూచిస్తాడు. నాగార్జున సూచనతో వాళ్లిద్దరూ కౌగిళ్లలో మునిగిపోతారు.
ఆ జంటను చూస్తూ… “నారాయణ నారాయణ వాళ్లిద్దరూ మ్యారీడ్” అంటూ నాగార్జున సెటైర్స్ విసురుతారు. నారాయణకు సినిమా భాషలోనే నాగార్జున కౌంటర్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.