టీడీపీ లేదా చంద్రబాబు అంటే వాడుకుని వదిలేయడంలో పేటెంట్ కలిగి ఉన్నారనే ప్రచారం ఏనాటి నుంచో జరుగుతోంది. ఇందుకు అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి. తరచూ వినిపించే పేరు సినీ నటి జయప్రద. పార్టీ కోసం ఆమె ఎంతో చేస్తే, జయప్రదకు టీడీపీ వల్ల ఒరిగింది గుండు సున్న అని టీడీపీ వాళ్లే చెబుతారు. దీంతో ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఎన్నెన్నో డక్కీమొక్కీలు తిని ఆమె ఉత్తరప్రదేశ్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.
ఉత్తరప్రదేశ్‌లో ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ రాజకీయ పరిస్థితి అంత బాగా లేదు. దీంతో తిరిగి ఆమె తెలుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఆ మధ్య విమర్శలు కూడా చేశారు. తన మాతృపార్టీ టీడీపీపై విమర్శలు చేయలేదు కానీ, అలాగని ప్రశంసలు కురిపించలేదు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బీజేపీ ఓ రేంజ్‌లో వెలిగిపోతోంది. దీంతో ఆమె ఆ పార్టీలో చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది.
మరోవైపు టీడీపీలో మరో మహిళా నేతకు జయప్రద అనుభవం తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. జయప్రద అంత గ్లామర్ కాకపోయినా, ఓ మోస్తరు అందగత్తె ఆమె. వైసీపీ నేతలపై అవాకులు చెవాకులు పేలుతుంటారు. ఇంతకూ ఆ తెలుగుదేశం మహిళా నేత ఎవరూ పరిచయం చేయనవసరం లేని పేరు… ఆమే వంగలపూడి అనిత. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు.
టీచింగ్ ప్రొఫెషన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. పాయకరావుపేట నుంచి 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒక దఫా ఎమ్మెల్యేగా ఆమె 20 ఏళ్లకు సరిపడే వ్యతిరేకతను సంపాదించుకున్నారు. దీంతో 2019లో ఆమెకు పాయకరావుపేట నుంచి కాకుండా మరోచోట నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. సీటు మారినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. రాజకీయాల పుణ్యమా అని అందరి ఆస్తులు రెట్టింపు అవుతుండడం చూస్తున్నాం. అదేంటో గానీ, అనిత అప్పులపాలవుతున్నట్టు తరచూ వార్తలొస్తున్నాయి. అప్పులిచ్చిన వాళ్లు కోర్టుకెళ్లడం, ఈమె వాయిదాల నిమిత్తం న్యాయస్థానాల చుట్టూ తిరగడం గురించి అందరికీ తెలిసిందే.
ఈ నేపథ్యంలో అనితపై ప్రత్యర్థులు సానుభూతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సొంత పార్టీ వాళ్ల నుంచి విసుర్లు. వ్రతం చెడినా ప్రయోజనానికి నోచుకోని మహిళా నాయకురాలిగా అనిత రికార్డుకెక్కుతారని టీడీపీ శ్రేణులు వ్యంగ్యంగా అంటున్నాయి. స్థాయికి మించి అనిత ఎందుకు మాట్లాడుతున్నారో జనానికి తెలిసొచ్చిందనే వాళ్లు లేకపోలేదు. జగన్, ఆయన కుటుంబ సభ్యులపై తరచూ అనిత విమర్శలు చేస్తున్నా, ఆమెకు ఎలాంటి ప్రయోజనం కలగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అనిత నోటి దురుసుతో ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. కానీ ఆమెకు ఒరిగిందేమీ లేదని అనిత సన్నిహితులు చెబుతున్నారు. ఇటు ఆర్థికంగా, అటు రాజకీయంగా నష్టపోతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక కష్టాలను పార్టీ పట్టించుకోకపోగా, పాయకరావుపేట ఇన్‌చార్జ్‌గా ప్రకటించాలని కోరుతున్నా టీడీపీ ఖాతరు చేయడం లేదని సన్నిహితుల వద్ద అనిత వాపోతున్నారని తెలిసింది. అందుకే ఆమె టీడీపీలో జయప్రద-2 అయ్యారని నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసరడం.