అమరావతిలోనే రాజధాని కొనసాగించాలని చేపట్టిన పోరాటం వెయ్యి రోజులకు చేరువైంది. దీన్ని పురస్కరించుకుని రెండో దఫా పాదయాత్రకు అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. అమరావతి నుంచి అరసవెల్లి వరకూ తలపెట్టిన పాదయాత్ర ఈ నెల 12న ప్రారంభం కానుంది. ఈ పోరాటంలో గతంలో అత్యంత కీలక పాత్ర పోషించిన రాయపాటి శైలజ ఆచూకీ లేకపోవడం చర్చనీయాంశమైంది.
తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అయిన రాయపాటి శైలజ రాజకీయాలపై ఇష్టాన్ని పెంచుకున్నారు. అసెంబ్లీకి ఎన్నిక కావాలనేది ఆమె ఆశ, ఆశయం. ఉన్నత విద్యావంతురాలు, చెప్పుకో తగ్గ ఆర్థిక స్తోమత కలిగిన ఆమె రాజకీయాల్లో పోటీ చేయడానికి అన్ని రకాలుగా అర్హురాలే. కానీ చంద్రబాబు మాత్రం ఆమెను కరివేపాకులా వాడుకోవడమే తప్ప, రాజకీయ ఆశయాన్ని నెరవేర్చడంలో మాత్రం మొండిచేయి చూపారనే విమర్శ వుంది.
అందుకే తన రాజకీయ లక్ష్యాలకు ఉపయోగపడని అమరావతి ఉద్యమంలో తానెందుకు క్రియాశీలక పాత్ర పోషించాలనే ఆవేదనతో ఆమె మౌనాన్ని ఆశ్రయించినట్టు సమాచారం. మరోవైపు ఉద్యమం పేరుతో శివారెడ్డి, శైలజ, తిరుపతిరావు తదితరులు భారీ మొత్తంలో వసూళ్లు చేసి, లెక్కలు చెప్పడం లేదని, సొంత ప్రయోజనాలకు వాడుకున్నారనే విమర్శలు టీడీపీ శ్రేణులతో పాటు రాజధాని ప్రాంత రైతులు ఆరోపిస్తున్నారు. తన అనుకున్న వాళ్లే, ఆరోపణలు చేయడంపై ఆమె మనస్తాపం చెందినట్టు తెలిసింది.
మరీ ముఖ్యంగా ఆమె 2014 నుంచి గుంటూరు-2 అసెంబ్లీ టికెట్‌ను ఆశిస్తున్నారు. అప్పట్లో ఇదే టికెట్‌ను పెట్రోల్ బంకు నాని, మద్దాలి గిరిధర్‌రావు ఆశించారు. కుల సమీకరణల దృష్ట్యా మద్దాలిపై టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ఆ తర్వాత కాలంలో గిరి వైసీపీ అనుబంధ సభ్యుడిగా మారారు. ఇప్పుడైనా తనకు టికెట్ ఇవ్వాలని చంద్రబాబును శైలజ గట్టిగా కోరినట్టు సమాచారం.
ఇందుకు చంద్రబాబు ససేమిరా అన్నట్టు తెలిసింది. దీంతో ఆమె రాజకీయాలు, అమరావతి పోరాటం నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారనే చర్చ జరుగుతోంది. ఉన్నత విద్యావంతురాలు, సంస్కారవంతంగా నడుచుకునే శైలజ ఉద్యమానికి, రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం మాత్రం సమాజానికి లోటని చెప్పొచ్చు.