ఇటీవల కేబినెట్ భేటీలో ముగ్గురు మంత్రులపై సీఎం జగన్ సీరియస్ అయ్యినట్టు వార్తలొచ్చాయి. పద్ధతి మార్చుకోవాలని, లేదంటే పక్కన పెట్టి, కొత్త వారిని తీసుకుంటానని హెచ్చరించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వ పెద్దల వాదన మరోలా వుంది. ముగ్గురు కాదు ఐదుగురు మంత్రులపై సీఎం ఆగ్రహంగా ఉన్నట్టు చెబుతున్నారు.
వారిలో ఇద్దరు మంత్రులు రెండో దఫా మంత్రి పదవులు దక్కించుకున్న వారున్నారు. ఇద్దరు మహిళా మంత్రులు, ముగ్గురు పురుష మంత్రుల పదవులపై కత్తి వేలాడుతున్నట్టు సమాచారం.
సీఎం జగన్, ఆయన కుటుంబ సభ్యులు, అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నా, తమకేమీ సంబంధం లేనట్టు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో టీడీపీలో ఉన్న ఆ మంత్రులు … ప్రస్తుతం టీడీపీతో లోపాయికారిగా మంచి సంబంధాలు నెరుపుతున్నట్టు సీఎం జగన్ దృష్టికి వెళ్లినట్టు సమాచారం.
ఇటీవల ఓ నియోజకవర్గ టీడీపీ నాయకుడి కూతురి పెళ్లికి, సదరు మంత్రి మరిది వెళ్లడమే కాకుండా ఏకంగా ఐదు లక్షల రూపాయల విలువైన బంగారు కానుక సమర్పించినట్టు సీఎం దృష్టికి వెళ్లింది. అంతేకాదు, ఆ నియోజకవర్గ నాయకులు ఎంతసేపూ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తున్నారే తప్ప, మంత్రిపై ఒక్క విమర్శ కూడా చేయలేదని అంటున్నారు.
మరో మహిళా మంత్రికి కీలక పదవి ఇచ్చినా, ఎప్పుడూ ప్రభుత్వం, పార్టీ కోసం గళమెత్తిన పాపాన పోలేదు. ప్రస్తుతం పదవీ గండ ఉన్న మంత్రుల్లో పల్నాడు, రాయలసీమ, కోస్తాలో ఇద్దరితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన వారున్నారని అధికార పార్టీ పెద్దలు చెబుతున్నారు.
సీఎం జగన్ హెచ్చరికల నేపథ్యంలో సదరు మంత్రులు ప్రతిపక్షాలపై మొక్కుబడిగా విమర్శలు గుప్పించడం గమనార్హం. మొత్తానికి రెండు మూడు నెలల్లో మళ్లీ కేబినెట్‌లో మార్పుచేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.