మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మళ్ళీ హడావిడి షురూ చేశారు. కాపు రిజర్వేషన్ల వ్యవహారంపై చంద్రబాబు సర్కార్ తీరుని తూర్పారబట్టిన ముద్రగడ, ఆ తప్పు కొత్త ప్రభుత్వం చేయకూడదంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి లేఖాస్త్రం సంధించారు. కేంద్రం ఎన్నికలకు ముందు ప్రకటించిన ఉన్నత వర్గాల్లోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లలోంచి 5 శాతం కాపులకు ఇస్తున్నట్లు చంద్రబాబు, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఊరుకున్నారనీ.. అది అమల్లోకి రాలేదనీ, వైసీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందని తాను ఆశిస్తున్నాననీ ముద్రగడ, వైఎస్ జగన్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు.
నిజానికి, ముద్రగడను రాజకీయంగా వాడుకుని వదిలేశారు చంద్రబాబు. తనకు అవసరం వచ్చినప్పుడల్లా ముద్రగడను తెరపైకి తీసుకురావడం, కాపు ఉద్యమం పేరుతో అలజడి సృష్టించడం, చివరికి ముద్రగడను అవమానించడం చంద్రబాబుకి అలవాటుగా మారిపోయింది అప్పట్లో. ఆ దెబ్బ, ఇటీవలి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చాలా గట్టిగానే తగిలింది. ఇక, ముద్రగడ తాను జగన్‌కి రాసిన లేఖాస్త్రాన్ని బట్టి చూస్తే, ఆయన బీజేపీ వైపు అడుగులేస్తున్నారా.? అన్న అనుమానాలు కలగక మానవు.
మరోపక్క, ముద్రగడ మళ్ళీ పబ్లిసిటీ స్టంట్లు మొదలు పెట్టారంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలు అభిప్రాయపడ్తున్నారు. బడ్జెట్ సమావేశాల ముందర ముద్రగడ పద్మనాభం అత్యంత వ్యూహాత్మకంగా వైఎస్ జగన్‌కి లేఖ రాశారనీ, ఈ లేఖ వెనుక 'రాజకీయ కుట్ర'ని కొట్టి పారేయలేం.. అన్నది పలువురు రాజకీయ విశ్లేషకుల వాదన. కాపు రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోనిదంటూ వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా 'వాస్తవాన్ని' చెబితే, దాన్ని జీర్ణించుకోలేకపోయారు ముద్రగడ.
ప్రస్తుతానికి 'సాఫ్ట్'గా లేఖ రాసిన ముద్రగడ, మళ్ళీ ఆంధ్రప్రదేశ్‌లో కాపు సామాజిక వర్గాన్ని గందరగోళంలోకి నెట్టి, రాష్ట్రంలో రాజకీయ అలజడి సృష్టించేందుకు ప్లాన్ చేశారా.? అంటే, కాదని మాత్రం చెప్పలేం.