తెలుగువాళ్లం బుద్ధావతారం అని మంచి సందర్భంలో అనం. కానీ ఇక్కడ ఆ అర్థంలో వాడటం లేదు, వాడి ఉంటే 'ఓ బుద్ధావతారం' అనేవాణ్ని. మానవజీవితంలో వ్యర్థత్వాన్ని గ్రహించిన బుద్ధుడు సర్వం త్యజించి వెళ్లిపోయినవాడు బుద్ధుడు. బుద్ధుడి కొడుకు పేరు పెట్టుకున్న రాహుల్ తన అధ్యక్షగిరీలోని వ్యర్థత్వాన్ని గుర్తించి ఆ అవతారం ఎత్తాడని నా భావం. వదిలేస్తానని ప్రకటించి చాలా రోజులైనా, యిప్పటిదాకా నాకు నమ్మకం చిక్కలేదు – యిలాటి డ్రామాలు చాలా చూశాం కనుక. రాహుల్ రాజీనామా తర్వాత టపటపా చాలామంది రాజీనామాలు చేసేయడాలు, కొంతమంది ఆత్మత్యాగం చేసుకుంటామనడాలు, మీరు తప్ప పరులెవ్వరికీ ఆ తాహతు లేదని మొత్తుకోవడాలూ.. యివన్నీ పార్టీలో పట్టు కోసం రాహుల్ లేదా సోనియా ఆడిస్తున్న నాటకమనే భావన కలిగించాయి. కానీ చూడబోతే యిన్నాళ్లయినా రాహుల్ తన పట్టు వీడలేదు. తాత్కాలిక అధ్యక్షుడిగా కొన్ని పేర్లు, అధ్యక్షుడిగా యిద్దరు యువనాయకుల పేర్లు వినవస్తున్నాయి.
నిజంగా యిదంతా జరుగుతుందానన్న సందేహం యింకా పీడిస్తూనే ఉంది. ఎందుకంటే ఇందిర హయాం నుంచి కాంగ్రెసు రాజకీయాలు అలా ఏడ్చాయి మరి. ఇంత పెద్ద పార్టీలో మరో మొనగాడు లేడన్న అభిప్రాయాన్ని వ్యాప్తి చేస్తూ పార్టీ ఆ వంశం చుట్టూనే తిరుగుతూ వచ్చింది. మధ్యలో పివి వచ్చి తన ముద్ర కొట్టేసరికి, ఆయన వ్యతిరేకులు సోనియాను లాక్కుని వచ్చి మళ్లీ వంశపాలన స్థాపించేశారు. ఇప్పుడు రాహుల్ నిఝంగా అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే మాత్రం ఫిరోజ్-ఇందిరా గాంధీ వంశంలో పార్టీ పదవికి రాజీనామా చేసి, కాంగ్రెసు చరిత్రను మరో మలుపు తిప్పిన మొదటి గాంధీ రాహులే అవుతాడు. రాహుల్ తప్పుకోగానే ప్రియాంకను తీసుకురావాలని కొందరు అంటారు కానీ ఆమె ఎన్నికల వేళ మెరిసే తార మాత్రమే. పైగా పూర్తి స్థాయి రాజకీయాలు చేసే ఓపిక ఉన్నట్లు తోచదు. నిజంగా కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చి, ఆమె ప్రధాని పదవి చేపడితే బేనజీర్ భుట్టో గతి పడుతుందనే భయమూ ఉంది. వాద్రా జర్దారీకి ఏమీ తీసిపోడు. అందుకే సోనియా ప్రియాంకాను పెద్దగా పుష్ చేయటం లేదు. అలా అని సోనియానే మళ్లీ పగ్గాలు చేపడదామని చూస్తుందనుకుంటే ఆమె అనారోగ్యం ఒక ప్రతిబంధకం.
ఏదైనా ఒక పార్టీలో అంతర్గతంగా మార్పులు వస్తే యింత చర్చ జరగదు. కానీ కాంగ్రెసులో మార్పు దేశప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూసే అంశం. 'కాంగ్రెసు కింకా ఎందుకు కాయకల్ప చికిత్స, దాని పేరు చెపితేనే అంతులేని జుగుప్స' అని శ్రీశ్రీ 1960లలోనే అన్నా, ఏదో ఒక రూపంలో కాంగ్రెసు బతికే ఉంటోంది. కొంతకాలం అధికారంలో ఉండగానే అవలక్షణాలు అలవర్చుకోవడం, ప్రజలు బుద్ధి చెప్పడం, మళ్లీ వాటిని సవరించుకుని వచ్చి, ప్రజాభిమానం సంపాదించి అధికారం చేపట్టడం – యిది యిన్నేళ్లగా జరుగుతూనే వస్తోంది. అంటే కాంగ్రెసు పున: పున: పునీతమౌతోంది అని నా ఉద్దేశం కాదు. దానికి ప్రత్యామ్నాయంగా ముందుకు వచ్చిన పార్టీల వైఫల్యమే కాంగ్రెసుకు శ్రీరామరక్ష అవుతోంది.
కాంగ్రెసులో వంశపారంపర్య పాలనను పడతిట్టి అధికారం సంపాదించుకున్న ప్రాంతీయ పార్టీలన్నీ అదే బాట పట్టాయి. మొన్ననే స్టాలిన్ కొడుక్కి, కుమారస్వామి కొడుక్కి పదవులు కట్టబెట్టారు. తనకు ఏ సంబంధం లేని కాన్షీరామ్ చేత వారసురాలిగా నియమించబడిన మాయావతి యిప్పుడు తన సోదరుడి కుటుంబాన్ని ప్రమోట్ చేస్తోంది. మమత కూడా తన మేనల్లుణ్ని పైకి తీసుకొస్తోందని అంటున్నారు. ఇక డిఎంకె, జెడిఎస్, టిడిపి, తెరాస, ఎస్పీ, ఆర్జెడి, అకాలీదళ్, శివసేన, హరియాణాలోని ఐఎన్ఎల్డిలలో వారసత్వాల గురించి అందరికీ తెలుసు. కాంగ్రెసు పార్టీలో హై కమాండ్ అన్ని నిర్ణయాలు తన చేతిలోనే పెట్టుకుంటాయని విమర్శించిన ప్రాంతీయపార్టీలన్నీ రాష్ట్రస్థాయిలో అదే పని చేస్తున్నాయి. ఏ పార్టీ సంస్థాగతమైన ఎన్నికలు నిర్వహించటం లేదు. అన్నీ నామినేటెడ్ పోస్టులే. అధికార వికేంద్రీకరణ అడిగినవారిని పార్టీలోంచి తన్నితగిలేస్తారు.
ఈ పార్టీలు కానీ, వీటి కూటమి కానీ కాంగ్రెసును రాష్ట్రాలలో, కేంద్రంలో కొన్నిసార్లు ఓడించి అధికారంలోకి వచ్చాయి. కానీ వాటి పాలన అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రజలు మళ్లీ పాపాలభైరవి కాంగ్రెసుకే ఓటేశారు. ఎందుకు? కాంగ్రెసు ఒక సముద్రం లాటిది. అన్ని రకాల నదులు వచ్చి దానిలో కలిశాయి. కాంగ్రెసు ద్వారా పోరాడిన స్వాతంత్య్రయోధులు స్వతంత్ర భారతదేశం ఎలా ఉంటుంది అంటే తలొకరు తలొకలా చెప్పారు. కమ్యూనిజం, (కమ్యూనిస్టులు కూడా కాంగ్రెసు ద్వారా వచ్చినవారే) సోషలిజం (సోషలిస్టులూ కాంగ్రెసు నుంచి వచ్చినవారే), కాపిటలిజం, మత ఛాందసత్వం, సెక్యులరిజం, ఉదారవాదం, నైతికత, అవినీతి – అన్ని రకాల యిజాలు నమ్ముకున్నవారూ కాంగ్రెసులోనే చేరారు, నాయకులయ్యారు. తాము అనుకున్న త్రోవలో కాంగ్రెసు నడవలేదని అనుకున్నవారు బయటకు నడిచారు, మళ్లీ వెనక్కి వచ్చారు. వెళ్లినపుడు వాళ్ల పార్టీకి కాంగ్రెసు అనే తోక తగిలించుకున్నారు,
ఎందుకంటే ప్రజలు రాజకీయ పార్టీ అంటే కాంగ్రెసు అనే భావనకు అలవాటు పడిపోయారు. తాము ఎంత మంచివారైనా సరే విడిగా వస్తే ఏమీ చేయలేకపోతున్నామనీ, అందువలన కాంగ్రెసులోనే ఉంటూ దాన్ని తమ విధానం వైపు మలచుకోవాలని చూశారు. కాంగ్రెసు నాయకుల సామర్థ్యాన్ని మోదీ కూడా శంకించరు. అందుకే తన పార్టీలోకి ఫిరాయింప చేసుకుంటున్నవారిలో అత్యధికులు కాంగ్రెసు వారే. కాంగ్రెసులో సమర్థులు, అసమర్థులు, నీతిపరులు, అవినీతిపరులు – అందరూ ఉన్నారు. ఒక్కొక్కప్పుడు ఒక్కోరిది ఒక్కో చోట పైచేయి అయింది. మొత్తం మీద ఫర్వాలేదనుకునే స్థాయిలో నడిచింది. అందుకే యింతకాలం మనగలిగింది.
ఇప్పటికీ అనేక చోట్ల దానికి 20-30% స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. ఎందుకంటే కాంగ్రెసు అంటే ప్రత్యేకంగా ఎవరికీ మేలు చేయదు, అలా అని ఎవరికీ కీడూ చేయదు అనే భావన మైనారిటీల్లో, అణగారిన వర్గాల్లో ఉంది. కాంగ్రెసు ముస్లిములను బుజ్జగిస్తూ రాజకీయాలు చేసింది, వారిని నెత్తిన పెట్టుకుంది అనేది అబద్ధం. అదే నిజమైతే ముస్లిముల స్థితి యింత ఘోరంగా ఉండదు. అన్ని పరామీటర్లలో వాళ్లు యింకా వెనకబడే ఉన్నారు. షెడ్యూల్ కులాల వారిని దత్తపుత్రుళ్లలా చూసుకుంది అంటారు కానీ ఆ కేటగిరీలో రిజర్వేషన్లను దశాబ్దాలపాటు భర్తీ చేయలేదు. ఇవన్నీ చూసే అగ్రవర్ణాల వారు కాంగ్రెసును ఆదరిస్తూ వచ్చారు. అగ్రవర్ణాల వారి మొదటి ప్రాధాన్యత జనసంఘ్, బిజెపియే కానీ అది అన్ని చోట్లా లేదు, గత దశాబ్దం దాకా!
జాతీయ స్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఎందరో కాంగ్రెసు నాయకులు బాగా పాలించినవారున్నారు, అధ్వాన్నంగా పాలించినవారూ ఉన్నారు. అధ్వాన్నంగా పాలించిన చోట కాంగ్రెసు ఓటమి చవి చూసింది. మళ్లీ సర్దుకుని, మరో నాయకుణ్ని ముందుకు పెట్టుకుని గెలిచింది. 70 ఏళ్లలో కాంగ్రెసు ఏమీ చేయలేదు అనడం సర్వాబద్ధం. 1947 నాటి భారత దేశపు గణాంకాలతో నేటి గణాంకాలు పోల్చి చూస్తే ఎన్ని రంగాల్లో ఎంత ప్రగతి జరిగిందో కళ్లకు కట్టినట్లు తెలుస్తుంది. కాంగ్రెసు కాకుండా మరో పార్టీ పాలించి వుంటే యింతకంటె ఎక్కువగా జరిగేది అనేది ఊహకు మాత్రమే అందే విషయం. ఎక్కువగా జరిగేదో, తక్కువగా జరిగేదో ఎవరు చూడవచ్చారు? దేశం పాకిస్తాన్లా, శ్రీలంకలా, బర్మాలా తయారయ్యేదేమో, చెప్పలేం కదా!
కాంగ్రెసు కంటె పొడిచేస్తాం అంటూ బయలుదేరిన కొత్త పార్టీలు ఏమీ ఊడబొడవలేదని కూడా ప్రజలు గమనించారు. కుక్కమూతి పిందెల కాంగ్రెసు అంటూ ఇందిరా గాంధీ వారసత్వపు రాజకీయాలపై విరుచుకు పడిన ఎన్టీయార్ అధికారంలోకి వచ్చిన నెల తిరక్కుండానే యిద్దరు అల్లుళ్లను పక్కన పెట్టుకుని పాలించారు. అందునా కాంగ్రెసు నాయకుడైన చిన్నల్లుడికి ఎక్కువ ప్రాధాన్యత యిచ్చారు. ఆరేళ్ల తర్వాత కాంగ్రెసు చేతిలో ఓడిపోయారు. అంతెందుకు, నాలో 70% రక్తం కాంగ్రెసుదే అని తొలిరోజుల్లో చెప్పుకున్న బాబు, ఆ తర్వాత కాంగ్రెసు వ్యతిరేక కూటములు తెగకట్టి, చివరకు మొన్న కాంగ్రెసుతో పొత్తు పెట్టుకున్నారు కదా. కాంగ్రెసులో సరుకు లేకపోతే వాళ్ల జోలికి వెళ్లేవారా?
రాజీవ్‌ను ఎదిరించి, బయటకు వచ్చి, కొత్త పార్టీలు పెట్టి, ప్రభుత్వాలు ఏర్పరచిన విపి సింగ్, చంద్రశేఖర్ పూర్తికాలం పాలించలేక పోయారే! మరి బొటాబొటీ మెజారిటీతో ఐదేళ్లు పాలించి దేశాన్ని ఒక సవ్యమైన మార్గానికి తెచ్చినది కాంగ్రెసు ప్రధాని పివియే కదా! ఆయన తర్వాత వచ్చిన దేవెగౌడ, గుజ్రాల్ అందరూ ప్రధానులుగా అర్ధాయుష్కులేగా! వాజపేయి రెండు సార్లు గద్దె దిగి, మూడోసారి 1999లో మెజారిటీతో గెలిచి, స్థిరమైన పాలన యివ్వగలిగారు. అదీ ఐదేళ్లే. తర్వాత కాంగ్రెసు పదేళ్లపాటు పాలించింది. కాంగ్రెసేతర ప్రభుత్వాలు మనజాలక పోవడానికి కారణం కాంగ్రెసు పన్నిన కుయుక్తులే అన్న మాట నిజమే. అదే సమయంలో కుయుక్తులు పన్ని చిన్నా, చితకా పార్టీలను బుట్టలో వేసుకునే ప్రజ్ఞ, అధికార పార్టీలో చీలికలు తెచ్చే నేర్పు దానికి ఉందని ఒప్పుకోవాలి.
ఇవి గుర్తించకుండా కాంగ్రెస్ ముక్త్ భారత్ సాధిస్తాం అనుకోవడం పొరబాటు. అలా అనుకున్న కొన్నాళ్లకే 3 రాష్ట్రాలలో కాంగ్రెసు అధికారంలోకి వచ్చింది. తరతరాలుగా కాంగ్రెసు ఎన్నో విభాగాల ద్వారా పని చేస్తూ వచ్చింది. విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘాలు, రైతు సంఘాలు, సహకార సంఘాలు… యిలా కాంగ్రెసు వటవృక్షపు వేర్లు భరతభూమిలో లోతుగా చొచ్చుకుపోయి ఉన్నాయి. ఎందుకంటే కాంగ్రెసంటే సోనియా, రాహుల్, వాధ్రా మాత్రమే కాదు. నెహ్రూ వ్యతిరేకులు సైతం మన్నించే పటేల్, బోస్, లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీలాల్ నందా, మొరార్జీ, కామరాజ్, చరణ్ సింగ్, పివి.. అందరూ కాంగ్రెసు వారే.
అందరికీ తెలుస్తుందని జాతీయస్థాయి నాయకుల పేర్లు కొన్ని రాశాను. రాష్ట్రాల వారీగా చూసుకుంటూ వస్తే అద్భుతంగా పాలించిన కాంగ్రెసు నాయకులు ఎందరో కనబడతారు. వీరందరికీ అభిమానులు, అనుచరులు ఊరూరా ఉన్నారు. అందుకనే కాంగ్రెసుకు స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. తెలంగాణలో కాస్తో కూస్తో ఉంది కానీ ఆంధ్రలో ఎ్కడుంది అని ఎవరైనా అడగవచ్చు. వైసిపి ఓటు బ్యాంకు కాంగ్రెసుదేగా! అలాగే తృణమూల్ ఓటు బ్యాంకు కాంగ్రెసుదేగా! అధిష్టానం మొండివైఖరి వలన వీళ్లు విడిగా వచ్చి సొంత కుంపటి పెట్టారు.
కాంగ్రెసుకి యింత బలం ఉంటే మరి సంక్షోభం ఎందుకు అని అడగవచ్చు. సంక్షోభం నాయకత్వానిది. నాయకత్వం బాగుపడితే, మారితే కాంగ్రెసుకు మళ్లీ అవకాశాలు వస్తాయి. టిడిపి సంగతి చూడండి. ఈ రోజు 23 సీట్లు మాత్రమే రావచ్చు. కానీ నాయకత్వం మారితే మళ్లీ పుంజుకుంటుంది. ఎందుకంటే ఊరూరా దాని అభిమానులున్నారు. పార్టీలో నాయకత్వ లోపం గురించి స్వానుభవంతో సరిగ్గా అంచనా వేసినవాడు రాహుల్. అతను పార్టీ అధ్యక్షుడుగా 2017 డిసెంబరు నుండే కావచ్చు. కానీ అంతకు ముందు ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నాడు. 2014 ఓటమి తర్వాత రాహుల్ 400 మంది కాంగ్రెసు నాయకులను కలిసి, ఓటమిపై వారేమనుకుంటున్నారో వివరంగా అడిగి, నోట్సు రాసుకున్నాడు. దాని ప్రకారం పార్టీని ఎలా ప్రక్షాళన చేయాలో ఒక ప్రణాళిక రూపొందించాడు.
కానీ అతని తల్లి, పార్టీలో సీనియర్ నాయకులు 'ఇప్పుడే అవన్నీ చేపడితే పార్టీ నాశనమై పోతుంది. కొన్నాళ్లు పోనీ' అంటూ అతని ఉబలాటాన్ని చల్లార్చేశారు. మూడేళ్ల తర్వాత పార్టీ అధ్యక్షుడైనపుడు పార్టీలో సీనియర్లతో సఖ్యత ఏర్పరచుకున్నాడు కానీ, వాళ్లచేత మార్పులకు అంగీకరింప చేయలేకపోయాడు. ఏదైనా అందామంటే తను గ్రాస్ రూట్స్ నుంచి వచ్చిన నాయకుడు కాదాయె! అతని మాట ఎక్కడా చెల్లుబాటు కాలేదు. యువతరాన్ని తెద్దామని ఎంతో ప్రయత్నించాడు. ఆ గ్రూపూ, సీనియర్ల గ్రూపూ ఒకరిపై మరొకరు చాడీలు చెప్పుకోసాగారు. తాజా ఓటమి తర్వాత రాహుల్‌కు ఆప్తుడు, పార్టీ డేటా ఎనలటిక్స్ అధినేత ప్రవీణ్ చక్రవర్తిపై వృద్ధనాయకత్వం దుష్ప్రచారం మొదలు పెట్టింది. అతను బిజెపి కోవర్టు అనీ, కావాలని రాహుల్‌ను తప్పుదారి పట్టించాడని అనసాగారు.
మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో గెలుపు తర్వాత ముఖ్యమంత్రులుగా రాహుల్ యువనాయకులను ప్రతిపాదిస్తే సోనియా వీటో చేసి వృద్ధనాయకులనే నియమించింది. పోనీ వాళ్లేమైనా ఉద్ధరించారా అంటే పార్లమెంటు ఎన్నికలలో ఆ రెండు రాష్ట్రాలలో కాంగ్రెసు మట్టి కరిచింది. 'పేరుకు అధ్యక్షపదవి కట్టబెట్టారు కానీ తన మాట వినరు, తనకు యిష్టమైన రీతిలో పార్టీ నడపనీయరు, ఓడిపోతే మాత్రం దాన్ని తన తలకు చుడతారు' అనే భావన రాహుల్‌ను తినేసింది. పార్టీ సీనియర్లు తమ వారసుల గురించి ఎలా పట్టుబట్టారో సమావేశంలో కడుపు చించుకున్నది అందుకే!
(సశేషం) – ఎమ్బీయస్ ప్రసాద్ (జులై 2019)
[email protected]