cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: రాహుల్‌ బుద్ధావతారం - 2/2

ఎమ్బీయస్‌: రాహుల్‌ బుద్ధావతారం - 2/2

ఒక్క ఓటమి చవి చూడగానే రాహుల్‌ యుద్ధభూమి విడిచి పారిపోతున్నాడని ఎద్దేవా చేయడం సరి కాదు. అతను కొంతకాలం ప్రయత్నించి చూశాడు పాపం. అతని హయాంలో 41 అసెంబ్లీ ఎన్నికలు జరగగా 33 సార్లు పార్టీ ఓడిపోయింది. 15కు పైగా రాష్ట్రాల్లో అధికారానికి దూరంగా నిలిచింది. అప్పుడప్పుడు జ్వరం వస్తే అదే పోతుందిలే అని ఉపేక్షిస్తాం, మాటిమాటికీ వస్తే మందు మారుస్తాం, అవసరమైతే డాక్టర్ని మారుస్తాం. అలాగే అప్పుడప్పుడు అపజయం కలిగితే యిది ఆటలో భాగమేలే అనుకుని సర్దుకోవచ్చు, కానీ ఓటమి యింట తిష్ట వేస్తే సర్జరీ చేయాల్సిందే అనే రాహుల్‌ చక్కగా అర్థం చేసుకున్నాడు. 

అది యిప్పుడే ఎందుకు తెలిసింది, ముందే ఎందుకు తెలియలేదు అనే ప్రశ్నకు జవాబు చెప్పలేరు. అర్జునుడికి కురుక్షేత్రంలోనే విషాదయోగం ఎందుకు కలిగింది? అంతకుముందు ఉత్తర గోగ్రహణం టైములో కూడా భీష్మ, ద్రోణ, దుర్యోధనాదులతో పోరాడి ఉన్నాడుగా. యుద్ధానికి సన్నద్ధమైనప్పుడు, కృష్ణుడి సాయం కోసం వెళ్లినపుడు తన బంధువులతోనే యుద్ధం అని తెలియదా? కురుక్షేత్రంలో 18 అక్షౌహిణుల సైన్యాన్ని ఒక్కసారి చూడగానే, దిగులు వేసి ఉంటుంది. అలాగే గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలలో గణనీయమైన సంఖ్యలో సీట్లు రావడంతో రాహుల్‌కు ఆత్మవిశ్వాసం పెరిగింది. 3 రాష్ట్రాలలో గెలుపుతో మరింత పెరిగింది. 

దాంతో అతను యీ పార్లమెంటు ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అతని సహచరులు అతన్ని అలా ఊరించి, ఉబ్బేశారు. ఈ సారి కాంగ్రెసుకు 150 రావచ్చన్నారు, అధమపక్షం 100 అన్నారు. చివరకు దానిలో సగం 52 వచ్చాయి. ఫలితాలు చూడగానే అతని బుర్ర తిరిగింది, బల్బు వెలిగింది. ప్రస్తుత నాయకత్వం ఛాయల్లో పార్టీ బాగుపడడం కల్ల అని గ్రహించి, ఆ విషయాన్ని ధైర్యంగా ఒప్పుకుని తప్పుకోవాలని చూస్తున్నాడు. కాంగ్రెసు పార్టీకి తను అండర్‌టేకర్‌ అవదలచుకోలేదు. వేరెవరైనా తన కంటె బాగా చేస్తారేమో చూద్దామనుకున్నాడు. తప్పేమీ కాదు, సినిమారంగంలో యాక్టరు అవుదామని వచ్చి, కాలేక, డైరక్టరు అయినవాళ్లు చాలామంది ఉన్నారు. అలాగే రాహుల్‌ తెర ముందు నుంచి తప్పుకుని, తెర వెనుక సారథిగా ఉందామనుకోవచ్చు. 

ప్రస్తుత పరిస్థితులే కొనసాగితే యీ ముసలి కాంగ్రెసు శవయాత్రకే సిద్ధమవుతోందని అతనికి తెలిసి వచ్చింది. వర్కింగ్‌ కమిటీలోని 55 మంది సభ్యుల్లో 14 మంది మాత్రమే 60 ఏళ్ల కంటె తక్కువ వయసున్నవారు. తక్కిన 44 మందిలో 70 ఏళ్లు దాటినవారు 19 మంది. తాత్కాలిక అధ్యక్షుడిగా ఆలోచిస్తున్న మోతీలాల్‌ ఓరా వయసు 90. అయితేగియితే అధ్యక్షులుగా ఆలోచిస్తున్న షిండే వయసు 77, ఖర్గే వయసు 76, గహలోత్‌ వయసు 68 వీళ్లందరూ అనేక పదవులు యిప్పటికే అనుభవించి, ఉత్సాహం చచ్చినవారు. చచ్చేలోగా తమ పిల్లల్ని గెలిపించుకుందామని చూడడం తప్ప వేరే ధ్యేయం లేనివారు. అటు చూస్తే మోదీ గాంధీల పేరు చెప్పి కాంగ్రెసుకు గోరీ కట్టేస్తున్నాడు.

కాంగ్రెసు అంటే గాంధీ కుటుంబమే అనే ప్రథ రావడం వలన ఆ కుటుంబం వారి తప్పులన్నిటికి కాంగ్రెసు శిక్ష అనుభవిస్తోంది. ఇలా పార్టీని, ప్రభుత్వాన్ని గుప్పిట్లో తీసుకోవడం ఇందిరా గాంధీతో ప్రారంభమైంది. చాలా తంటాలు పడి, యితర నాయకులందరినీ పక్కకు నెట్టేసి, 1969లో ఆమె పార్టీని చేజిక్కించుకుంది. ఆ పై రాష్ట్రాలలో బలమైన నాయకులు లేకుండా చేసింది. ఇది అంతకుముందు జరగలేదు. ఇందిర తర్వాత రాజీవ్‌ వచ్చాడు. అఖండమైన మెజారిటీతో ఆరంభమై అప్రతిష్ఠ పాలై, ఐదేళ్లలో అధికారం పోగొట్టుకున్నాడు. అతని మరణం తర్వాత పివి, సీతారాం కేసరి పార్టీ అధ్యక్షులయ్యారు. 

అప్పుడు కొంతమంది నాయకులు తమ ప్రయోజనాల కోసం రాజకీయాలంటే సుతరామూ యిష్టం లేని సోనియా (ఆమె తన భర్తను రాజకీయాల్లోకి వెళ్లవద్దని పట్టుబట్టింది, భర్త మరణం తర్వాత పార్టీ జోలికి వెళ్లలేదు) చెంత చేరి, ఆమెకు నూరిపోసి, రాజకీయాల్లోకి లాక్కుని వచ్చారు. ఏ మాట కా మాట చెప్పాలంటే సోనియా నిజమైన ఫైటర్‌. పూర్వానుభవం లేకపోయినా, కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చింది. ఇందిర తరహాలో కాంగ్రెసు ముఖ్యమంత్రులను తరచుగా మార్చేయలేదు. కానీ క్రమేపీ నియంత అయిపోయింది. పార్టీ మొత్తం ఆమె నుసన్నల్లో నడిచింది. ఆమె నంది అంటే నంది, పంది అంటే పంది. చాలా ఏళ్లగా పార్టీలో సంస్థాగతమైన ఎన్నికలు లేవు. 

అందువలన ఏ నాయకుడికి ఎందరు కార్యకర్తల బలం ఉందో ఎవరూ చెప్పలేరు. సోనియా ఎవర్ని నిర్ణయిస్తే అతడే మొనగాడు. అక్కడ తప్పులు జరిగాయి. ఆ తప్పులు ఎత్తి చూపడానికి పార్టీ కమిటీలో ఎవరికీ దమ్ము లేదు. ఎందుకంటే అందరూ భజనపరులే. వీళ్లు ఆమెకు దడి కట్టేసి, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియకుండా చేశారు. (చెప్పుడు మాటలు విని తెలుగు రాష్ట్రాలను ఎలా పోగొట్టుకుందో ప్రత్యక్షంగా చూశాం) రాష్ట్రాల్లో అసంతృప్త నాయకులు తమ గోడు వినిపించడానికి వచ్చినపుడు తల్లీ, కొడుకూ దర్శనమిచ్చేవారు కాదు. వాళ్లంతా బిజెపిలో చేరిపోయారు. యుపిఏ 2 అవినీతిలో కూరుకుపోయిందని లోకమంతా కోడై కూస్తున్నా సోనియా పట్టించుకోలేదు. తన జోరు తగ్గించలేదు. ఫలితం - పార్టీ పాతాళంలో పడింది. కాంగ్రెసు మాట ఎత్తితేనే యువత మండిపడుతోంది. 

సోనియా చేసిన అతి పెద్ద పొరబాటు - పార్టీని తన వారసుడికి కట్టబెట్టాలనుకోవడం. రాహుల్‌కి ఆ శక్తి, ఆసక్తి ఉందా లేదా అని పట్టించుకోలేదు. నా తర్వాత నువ్వు అయితీరాలంతే అంది. గతంలో అత్తగారు ఇందిరా గాంధీ చేసింది కదా, నా వలన కాదా అనుకుంది. సోనియా ఎప్పటికీ ఇందిర కానేరదు. ఇందిర అంటే యిప్పటికీ సామాన్యప్రజల్లో ఆరాధన మిగిలివుంది. సోనియాను ఆరాధించడం కాదు కదా, అభిమానించేవాళ్లుకూడా ఎవరూ లేరు. ఆమె సరైన వ్యక్తులను ఎంచుకున్న సందర్భాల్లో రాజకీయపు టెత్తులతో పాలించగలిగిందంతే. ప్రజల్లో ఆమెకు గొప్ప యిమేజి ఏమీ లేదు. 

ఇందిర తన చిన్న కొడుకు సంజయ్‌ గాంధీకి రాజకీయాల్లో గల ఆసక్తిని గమనించి, ప్రోత్సహించింది. మొదట్లో అతను రాజకీయాల్లోకి వద్దామనుకోలేదు. మారుతి ప్రాజెక్టు సవ్యంగా నడిచి వుంటే వచ్చేవాడు కూడా కాదు. అలహాబాద్‌ తీర్పు తర్వాత ఇందిర కష్టాల్లో పడినప్పుడు అతను ముందుకు వచ్చాడు. ఎమర్జన్సీ సమయంలో విపరీతాధికారం చలాయించి, ఆమెకు కష్టాలు, ఓటమి తెచ్చిపెట్టాడు. ఆమె ఓడిన సమయంలో అండగా నిలిచి, పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చిన ఘనత కూడా అతనిదే.

ఈ మొత్తం సమయంలో ఇందిర పెద్దకొడుకు రాజీవ్‌ జోలికి వెళ్లలేదు. అతనికి యిష్టం లేదు, పోనీలే అనుకుంది. సంజయ్‌ అకాలమరణం తర్వాత మాత్రమే రాజీవ్‌ తన వారసుడు కావాలని పట్టుబట్టింది. అతనూ మొదట్లో కాస్త తటపటాయించినా, తర్వాత రంగంలోకి పూర్తి స్థాయిలో దిగాడు. రాజకీయాలతో పాటు అనేక విషయాలపై పరిజ్ఞానం సంపాదించుకున్నాడు. తల్లి హత్య తర్వాత ప్రధాని పదవి పొంది, చాలా మంచి పనులు చేశాడు. బోఫోర్స్‌ వివాదం వచ్చి ఉండకపోతే, అతను నమ్మినవాళ్లే ఎదురు తిరిగి వుండకపోతే మళ్లీ నెగ్గేవాడు కూడా. 

రాహుల్‌కి తండ్రి పోలిక రాలేదు. అతనికి పాలిటిక్స్‌ బోరయినా, తల్లి పోరు భరించలేక రంగంలో ఉన్నాడనిపిస్తుంది. మాటిమాటికి మాయమై పోతూ ఉంటాడు. విదేశాలకు పారిపోతూంటాడు, అక్కడ ఏం చేస్తాడో ఎవరికీ తెలియదు. ఏ విషయమూ సరిగ్గా నేర్చుకోడు. దేని గురించి ధారాళంగా మాట్లాడలేడు. రాష్ట్రాలలో పార్టీ స్థితిగతుల గురించి సరిగ్గా వాకబు చేయడు. కష్టపడి చేసినా ప్రయోజనం లేదని, తన మాట ఎవరూ వినరని అతనికి తెలుసు. అందువలన కొందరు వందిమాగధులను చుట్టూ చేర్చుకుని కాలక్షేపం చేస్తాడంతే. యుపిఏ హయాంలో మంత్రిపదవి చేపట్టి పాలనానుభవం సంపాదించే ఓపిక కూడా లేదతనికి. అతని హయాంలో కాంగ్రెసు ఏవైనా విజయాలు సాధిస్తే అది స్థానిక నాయకుల సామర్థ్యమే కానీ యితని ప్రతాపం కాదు.

అతనెంత బద్ధకస్తుడో అమేఠీ ఫలితం చాటి చెప్పింది. స్థానిక కాంగ్రెసు కార్యకర్తలు సరిగ్గా పనిచేయకపోవడం వలననే రాహుల్‌ అమేఠీలో ఓడిపోయాడని ప్రియాంకా అనడం వాళ్లకు మండించింది. బిజెపిలోకి దూకేద్దామా అనుకుంటున్నారట. ఆ ఫలితాన్ని విశ్లేషిస్తున్న టీవీ వ్యాఖ్యాతలు చెప్పారు - 'మేం అక్కడకు వెళ్లి చూశాం, పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. రాహుల్‌ ఎన్నడూ అక్కడికి వెళ్లలేదట' అని. తన నియోజకవర్గమే బాగు చేసుకోలేనివాడు, దేశాన్ని ఏం ఉద్ధరిస్తాడు? అతను పార్లమెంటుకి కూడా సరిగ్గా రాడు. ఇప్పటిదాకా అతను అద్భుతంగా మాట్లాడిన సందర్భం ఏదీ లేదు. అప్పుడప్పుడు జనాల్లోకి వెళ్లడం, ఎన్నికల సమయంలో గుళ్లకు వెళ్లడం తప్ప చేసినదేదీ కనబడదు. వాయనాడులో గెలిచాడంటే ఆ గెలుపు అతనిది కాదు. కాంగ్రెసు కేరళ యూనిట్‌ది! 

ఓటమి తర్వాత చిదంబరం, గెహలోత్‌, కమలనాథ్‌, హూడా వంటి సీనియర్‌ నాయకుల ప్రవర్తన గురించి గోలుగోలుమన్నాడు కానీ ఎన్నికలకు ముందే వాళ్లకు యిలాటి వేషాలు కుదరవని గట్టిగా చెప్పలేకపోయాడా? బ్లాక్‌మెయిల్‌కు లొంగడం దేనికి? ఎందుకంటే తనకూ రాజకీయ వారసత్వం తప్ప వేరే అర్హత లేదు కాబట్టి! యువతరమే కాదు, సగటు భారతీయుడు దృఢమైన నాయకుణ్ని ఆరాధిస్తున్నాడు. మోదీ సూపర్‌మాన్‌లా కనబడుతున్నాడు. అతని ప్రత్యర్థిగా నిలిచిన రాహుల్‌ బలహీనుడిగా, తల్లిచాటు బిడ్డగా, తన పార్టీనే అదిలించలేని అసమర్థుడిగా కనబడుతున్నాడు. 

మోదీని కౌగలించుకుని వచ్చి కన్ను గీటడం అతనిలో కుర్రతనాన్ని బయటపెట్టింది. బిజెపి వాళ్లు రాహుల్‌ను నీ గోత్రమేమిటి అని అడిగారనుకోండి, యితను వాళ్ల ఉచ్చులో పడి, మాతామహుడి గోత్రం చెప్పి దొరికిపోవడం దేనికి? అతను జంధ్యం వేసుకునే బ్రాహ్మడని అనుచరుడు అంటే ఖండించకుండా మౌనంగా ఉండడం దేనికి? కాంగ్రెసు నాయకులందరికీ అతనిలోని యీ లోపాలు తెలుసు. ఈ ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలున్న మహారాష్ట్ర, హరియాణా, ఝార్‌ఖండ్‌లలో అతన్ని ముందు పెట్టుకుని వెళితే ఓట్లు రాలవని తెలుసు. కానీ ఆ మాట సోనియాకు చెప్పే ధైర్యం లేదు. ఎందుకంటే గత పాతికేళ్లగా వారిలో అధిష్టానం పట్ల భయం పట్టుకుంది. 

మామూలుగా కాంగ్రెసులో స్వేచ్ఛ ఉంటూ వచ్చింది. ఎవరికి ఏం తోస్తే అది మాట్లాడవచ్చు. నెహ్రూ హయాంలో కూడా నెహ్రూని బహిరంగంగా తిట్టిపోసే అనేకమంది కాంగ్రెసు నాయకులుండేవారు. ఇప్పటికీ కాంగ్రెసు నాయకులు క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తారు. కానీ వీరిలో ఎవరూ అధిష్టానాన్ని పల్లెత్తి మాటనరు. అందుకే సోనియా బతికున్నంతకాలం రాహుల్‌ను కీర్తిస్తూనే ఉంటారు. అతను ప్రధాని మెటీరియల్‌ అని ప్రకటనలు యిస్తూంటారు. ఇప్పుడు కూడా అతను యింటికి పోతాను మొర్రో అంటూంటే, 'సింహం ముందుకు దూకేముందు రెండడగులు వెనక్కి వేస్తుంది, అలాగే రాహుల్‌ కూడా బలం పుంజుకుని మళ్లీ వచ్చేస్తాడు' అంటున్నారు. రాహుల్‌ వ్యక్తిగా మంచివాడయితే అయ్యాడు కానీ రాజకీయాల వరకు చేతకాని పెయ్యమ్మ అని గట్టిగా అనే దమ్ము ఎవరికీ లేదు.

ఈ పరిస్థితిని మోదీ పూర్తిగా ఎక్స్‌ప్లాయిట్‌ చేసుకున్నాడు. మోదీ రాహుల్‌ను మొదట్లో షాజాదా (యువరాజు) అనేవాడు, మొన్న నామ్‌దార్‌ (పేరు చెప్పుకుని చలామణీ అయ్యేవాడు) అనేశాడు. దానికి వ్యతిరేకంగా తను కామ్‌దార్‌ (పని చేసేవాడు) అని చెప్పుకున్నాడు. తన వంశం పేరు చెప్పుకునే రాహుల్‌ ప్రస్తుత స్థానాన్ని చేరాడని, తనైతే స్వయంకృషితో ఎదిగానని చెప్పుకున్నాడు. ఎవరు కావాలో ఎంచుకోండి అని ప్రజల్నే అడిగాడు. మోదీ చెప్పినదానిలో అవాస్తవమేమీ లేదు కాబట్టి జనాలు మోదీనే ఎంచుకున్నారు.  మోదీ రాహుల్‌ పరువు తీసేస్తూ, అతనికి కాంగ్రెసుకు ముడిపెట్టి దాని గుడ్డలూ ఊడదీశాడు. తను 'ఇండియా ఫస్ట్‌' అంటూంటే కాంగ్రెసు ఫ్యామిలీ ఫస్ట్‌ అంటోంద'ని ప్రచారం చేశాడు. అది జనాలకు బాగా ఎక్కింది. దాంతో యిటీవల గెలిచిన రాష్ట్రాలలో కూడా కాంగ్రెసు ఓడిపోయింది. 

రాహుల్‌ దీన్ని పూర్తిగా అర్థం చేసుకుని తప్పుకుందా మనుకుంటున్నాడు. ఏదో ఒక స్థాయిలో ప్రతిపక్షంగా కాంగ్రెసు నిలవకపోతే ఆరెస్సెస్‌ భావజాలం దేశాన్ని ముంచేస్తుందనే అవగాహనా అతనికి ఉంది. కాంగ్రెసు నిలవాలంటే తనూ, తన కుటుంబం తప్పుకోవాలి. ఈ విషయంలో సోనియాకు కలగని వివేకం, రాహుల్‌కు కలిగింది. అతను పదవి వదులుకుని, వేరే యువనాయకుణ్ని అధ్యక్షుడిగా తెస్తాడని ఆశిద్దాం.

గాంధీ ఫ్యామిలీ నిజంగా తప్పుకుంటే నష్టం కలిగేది కాంగ్రెసుకి కాదు, బిజెపికే. ఎందుకంటే మోదీ అధికారంలోకి వస్తూనే ఆ ఫ్యామిలీ పనే పట్టాడు. వాళ్లపై కేసుల విషయంలో వేగం పెంచాడు. రేపు రాహుల్‌ స్థానంలో ఏ సచిన్‌ పైలటో, జ్యోతిరాదిత్య సింధియాయో అయితే, బిజెపికి అస్త్రాలు కరువౌతాయి. అప్పుడు కాంగ్రెసు విధానాలను దుయ్యబడతారు. అది ఫర్వాలేదు. ఈ రోజుల్లో భారత్‌లో ఎన్నికలను అమెరికా తరహాలో వ్యక్తుల మధ్య పోరాటంగా మార్చేశారు. ఇప్పుడది తగ్గుతుంది. ప్రజాస్వామ్యంలో అధికార పక్షమూ బలంగా ఉండాలి, యించుమించుగా ప్రతిపక్షమూ బలంగా ఉండాలి. లేకపోతే నియంతృత్వం దాపురిస్తుంది. (సమాప్తం)
- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జులై 2019)
mbsprasad@gmail.com

ఎమ్బీయస్‌: రాహుల్‌ బుద్ధావతారం - 1/2

 


×