ప్రపంచకప్ కు మధ్యలో తెరిపినిచ్చిన ఇంగ్లండ్ వరుణుడు కీలకమైన మ్యాచ్ లకు మాత్రం గట్టిగానే తగులుకున్నాడు. ఉరుమూమెరుపు లేకుండా సెమిఫైనల్ మ్యాచ్ మీద వరుణుడి అటాక్ సాగింది. న్యూజిలాండ్ బ్యాటింగ్ మరి కాసేపట్లో ముగుస్తుందనంగా వర్షం మొదలుకావడం, ఎంతకూ ఆగకపోవడం, ఆగినా గ్రౌండ్ పూర్తిగా చిత్తడిగా మారిపోవడంతో మ్యాచ్ కొనసాగించలేదు అంపైర్లు.
ఇక వరుణుడి అటాక్ నేపథ్యంలో ఐసీసీ రూల్స్ ప్రకారం సెమిఫైనల్ మ్యాచ్ నేడు కొనసాగనుంది! నిన్న ఎక్కడ ఆగిందో అక్కడ నుంచి మ్యాచ్ కొనసాగబోతూ ఉండటం గమనార్హం. న్యూజిలాండ్ 46.1 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. బ్యాలెన్స్ 3.5 ఓవర్లను ఆడటానికి ఆ జట్టు బుధవారం బరిలోకి దిగనుంది.
రిజర్వ్ డే అంటే మ్యాచ్ మొదటి నుంచి ప్రారంభం కావడం కాకుండా.. మ్యాచ్ రెండో రోజు యథాతథ స్థితి నుంచి కొనసాగడం ఆసక్తిదాయకంగా ఉంది. ఇక ఇప్పటి వరకూ న్యూజిలాండ్ చేసింది భారీ స్కోర్ ఏమీ కాదు. అయితే ఈ రోజు కూడా వర్షం పొంచి ఉండవచ్చు. అలాగే డక్ వర్త్ లూయిస్ తో మ్యాచ్ ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. గెలుపు ఓటములను ఆట కాకుండా, వరుణుడే డిసైడ్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది!