ఆయన పేరు గాంధీ! దొరికింది మాత్రం అక్రమాస్తులతో. పైగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా పేరు. ఆపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లో పని చేశాడు! ఈడీ అధికారులు అంటే.. అక్రమార్కుల పని పట్టే వాళ్లు అని సామాన్య జనాలు ఫీలవుతూ ఉంటారు. అయితే అదే శాఖలో కొన్ని సంవత్సరాల పాటు పని చేసి, కీలక కేసుల్లో విచారణ చేపట్టిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న బొల్లినేని శ్రీనివాస గాంధీ ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులతో పట్టుబడటం సంచలనంగా ఉంది.
డాక్యుమెంట్స్ ప్రకారం రెండు మూడు కోట్ల స్థాయి అక్రమాస్తులతో ఆయన పట్టుబట్టాడు. అయితే మార్కెట్ వ్యాల్యూ ప్రకారం వాటి విలువ రెండు వందల కోట్ల రూపాయలకు పైనే అని తెలుస్తోంది.
సుజనా చౌదరిపై ఈడీ నమోదు చేసిన కేసులను విచారించిన వాళ్లలో ఈ బొల్లినేని గాంధీ ముందున్నారని తెలుస్తోంది. సుజనా చౌదరి కేసుల్లో మనీ లాండరింగ్ తదితర కేసుల్లో ఆధారాలు సైతం దొరికినా చూసీచూడనట్టుగా వదిలేశాడని తెలుస్తోంది. అందుకు సంబంధించి ఆర్థిక శాఖకు ఫిర్యాదులు కూడా అందాయని సమాచారం. ఈ నేపథ్యంలో ఇతడిపై సీబీఐ రైడ్స్ జరిగాయని సమాచారం.
చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడట ఈ గాంధీ. అందుకే సుజానా చౌదరికి కూడా అలా సాయం చేశాడని అంటున్నారు. కేవలం కొన్ని వేల రూపాయలు మాత్రమే జీతం అందుకునే ఈయన డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కూతురుకు పేమెంట్ ఎంబీబీఎస్ సీటును కొన్నారట. ఇక ఏపీ రాజధాని ప్రాంతంలో భూములు, హైదరాబాద్ తో సహా వివిధ చోట్ల స్థలాలకు లోటు లేదని తెలుస్తోంది. అందరి బాగోతాలను బయటపెడతారనే ఈడీ అధికారి ఒకరి బాగోతం ఇలా బయటపడింది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నమోదు అయిన ఈడీ అభియోగాలపై విచారణ జరిపిన వారిలో కూడా బొల్లినేని గాంధీ ఉన్నారు. చంద్రబాబుతో సాన్నిహిత్యం వల్ల జగన్ పై కేసుల్లో ఈయన చూపిన అత్యుత్సాహం చర్చనీయాంశంగా నిలిచింది. ఇప్పుడు అక్రమాస్తులతో సదరు బొల్లినేని పట్టుబడటం గమనార్హం.