మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిని ఏఐసీసీ ప్రకటించింది. సీనియర్ రాజకీయనేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తనయ పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వత్వాన్ని ఖరారు చేశారు. ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ రాకుండానే టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి.
మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బీజేపీ తరపున బరిలో దిగనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో ఇంకా తేలలేదు. కాంగ్రెస్ అభ్యర్థిపై స్పష్టత వచ్చింది. కొంత కాలంగా స్రవంతి తనకే టికెట్ వస్తుందని చెబుతున్నారు. ఆమె ప్రచారం చేసుకున్నట్టే కాంగ్రెస్ అధిష్టానం కూడా స్రవంతి వైపే మొగ్గు చూపింది. ఇటీవల స్రవంతి ఫోన్ కాల్ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.
తనను కాదని మరొకరికి టికెట్ ఎలా ఇస్తారని కాంగ్రెస్ కార్యకర్తను ఫోన్ సంభాషణలో ప్రశ్నించడం ఆ పార్టీలో తీవ్ర దుమారం చెలరేగింది. మునుగోడులో బీసీ ఓటర్లు ఎక్కువ ఉన్నారని, వారి నుంచి అభ్యర్థిని ఖరారు చేయవచ్చనే ప్రచారం జరిగింది. అలాంటి వాటికి ఫుల్‌స్టాప్ పెడుతూ పాల్వాయి స్రవంతే తమ అభ్యర్థిగా కాంగ్రెస్ తేల్చి చెప్పింది.
స్రవంతి కుటుంబ నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకుని టికెట్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముడికి మద్దతు ఇవ్వాలంటూ గ్రామ, మండలస్థాయి కాంగ్రెస్ నాయకులకు ఫోన్‌లు చేస్తుండడం వివాదానికి దారి తీసింది. కాంగ్రెస్‌లోనూ వుంటూ, పార్టీకి వెన్నుపోటు పొడిచేలా ఎలా ప్రవర్తిస్తారనే ప్రశ్న ఉత్పన్నమైంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వెంకటరెడ్డిపై చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు భయపడుతోందనే ప్రశ్న వెల్లువెత్తుతోంది.