అమరావతి రైతుల పేరుతో ఎల్లో బ్యాచ్ చేపట్టే రెండో విడత పాదయాత్రకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. కానీ మొదటి విడతలో సాగినట్టు పాదయాత్ర ప్రశాంతంగా సాగే వాతావరణం కనిపించడం లేదు. ఇందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ తాజా హెచ్చరికలే నిదర్శనం.
ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
“అమరావతి నుంచి అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తామని రైతులు అంటున్నారు. విశాఖకు రాజధాని వద్దని చేస్తున్న పాదయాత్ర ఇది. ఇది విశాఖకు రాజధాని వద్దని దండయాత్ర చేయడమే. ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తే.. ప్రజలు చూస్తూ ఊరుకోరు. పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుంది. ఇందుకు చంద్రబాబే బాధ్యత వహించాల్సి వుంటుంది” అని మంత్రి గుడివాడ ఘాటుగా హెచ్చరించారు.
ఇటీవల ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న విద్వేషపూరిత రాజకీయాలను చూస్తే… తాజాగా ఈ పాదయాత్ర సజావుగా సాగుతుందని అనుకోలేం. అమరావతిలో ప్రారంభం మాత్రమే బాగుండొచ్చు. రెండు నెలల పాటు సాగే పాదయాత్ర టీడీపీ అనుకున్నంత ఈజీగా ఉండకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎందుకంటే రాజధాని పేరుతో పదేపదే కవ్వింపు చర్యలకు టీడీపీ పాల్పడుతోంది. రాజధాని రైతుల ముసుగులో టీడీపీ శ్రేణులు, రియల్టర్లు ఎక్కువగా ఉన్నారనేది బహిరంగ రహస్యమే. హైకోర్టుకెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకుంటారనేది అందరూ ఊహించిందే. కానీ ఇతర ప్రాంతాలను రెచ్చగొట్టేలా పాదయాత్ర చేయాలని ఆలోచించమే ఘర్షణకు దారి తీయొచ్చనే ప్రచారం జరుగుతోంది.
పరిపాలన రాజధానిగా ఎంపిక చేసిన ప్రాంతానికి, అక్కడ రాజధాని వద్దని వెళ్లడం అంటే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడం కాకుండా మరేంటని ఉత్తరాంధ్ర సమాజం ప్రశ్నిస్తోంది. మరోవైపు విశాఖలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటు చేస్తామని మంత్రి గుడివాడ అమర్నాథ్ గట్టి చెప్పడం విశేషం.
అంతేకాదు, రాజధాని బిల్లు అసెంబ్లీలో పెట్టగానే సీఎం జగన్ విశాఖ వస్తారని ఆయన చెప్పడం వెనుక ప్రభుత్వ పెద్దల ఆలోచనలు ఉండవని అనుకోలేం. అలాగే పాదయాత్రతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, దానికి చంద్రబాబు బాధ్యత వహించాలనే హెచ్చరిక వెనుక లోతైన అర్థం వుందనే చర్చ జరుగుతోంది.