Advertisement

Advertisement


Home > Movies - Reviews

Oke Oka Jeevitham Review: మూవీ రివ్యూ: ఒకే ఒక జీవితం

Oke Oka Jeevitham Review: మూవీ రివ్యూ: ఒకే ఒక జీవితం

టైటిల్: ఒకే ఒక జీవితం
రేటింగ్: 2.75/5
తారాగణం: శర్వానంద్, రితు వర్మ, అమల అక్కినేని, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు
కెమెరా: సుజిత్ సారంగ్
ఎడిటింగ్: శ్రీజిత్ సారంగ్
సంగీతం: జేక్స్ బెజోయ్
నిర్మాత: ఎస్.ఆర్ ప్రభు, ఎస్. ఆర్ ప్రకాష్ బాబు 
దర్శకత్వం: శ్రీ కార్తిక్ 
విడుదల తేదీ: 9 సెప్టెంబర్ 2022

టైం మెషీన్ అనగానే తెలుగువారికి గుర్తొచ్చే మొదటి సినిమా "ఆదిత్య 369". ఆ తర్వాత ఆ దిశగా చిత్రాలేవీ పెద్దగా రాకపోవడం ఆశ్చర్యమే. చాలా కాలం తర్వాత టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ మధ్యన "బింబిసార" వచ్చింది. అందులో టైం మెషీన్ ప్లేసులో మాయాదర్పణం పెట్టారు. అలాగే టైం మెషీన్ కాకుండా ఒక ఫోన్ సాయంతో రెండు కాలాల మధ్యన మనుషుల్ని కలిపే కథతో రెండేళ్ళ క్రితం "ప్లే బ్యాక్" అని ఒక సినిమా వచ్చింది. 

ఇప్పుడు తాజాగా "ఒకే ఒక జీవితం" తెలుగు తెరమీద మరొక టైం ట్రావెల్ కథ. సైన్స్ కి, విధికి మధ్యన జరిగే పోరులో చివరికి ఏది గెలుస్తుందో చెప్పే కథ ఇది. 

తల్లి యాక్సిడెంటులో చనిపోయి 20 ఏళ్లైనా ఇంకా బాధ నుంచి బయటకు రాని కొడుకు ఆది. అతనికి ఇద్దరు స్నేహితులు. ఇదిలా ఉంటే కాలంలో ప్రయాణం చేయించే యంత్రాన్ని కనిపెడతాడొక సైంటిస్ట్. ఆ మెషీన్ ద్వారా ఆదిని గతంలోకి పంపి తన తల్లిని మరొక సారి చూసే అవకాశాన్ని కల్పిస్తానంటాడు సైంటిస్ట్. అలాగే ఆమెను యాక్సిడెంటు నుంచి కాపాడుకోవచ్చని చెప్తాడు. అయితే బదులుగా ఆ కాలానికి వెళ్లినప్పుడు తనకొక సాయం కూడా చేసిపెట్టమంటాడు. 

ఆది తల్లిని యాక్సిడెంట్ బారిన పడకుండా కాపాడుకుంటాడా? ఇంతకీ సైంటిస్ట్ చేసిపెట్టమన్న సాయం ఏమిటి? వీటి చుట్టూ తిరిగే కథని దర్శకుడు తనకు చేతనైనట్టు తెరకెక్కించాడు. 

ఇలాంటి పాయింట్ పట్టుకోవడం కష్టం కాదు. ఎందుకంటే ఓటీటీల్లో బోలెడన్ని దొరికేస్తున్నాయి. ఈ ఐడియా ఒరిజినల్ కాదు. జెర్మన్ వెబ్ సిరీస్ "డార్క్" లో టైం మెషీన్ ఎలా ఉంటుందో ఇదీ ఇంచుమించు అదే తరహాలో ఉంటుంది...ఒక బ్రీఫ్ కేస్ టైపులో. దానిని ఓపెన్ చేసి కింద పెట్టి దాని పక్కన నిలబడితే కోరుకున్న కాలానికి వెళ్ళడమనేది "డార్క్" సిరీస్ మూడో సీజన్లో ఉన్నదే. అలాగే వేరే టైం లైన్ నుంచి మరొక టైం కి వెళ్లిన కొడుకు అప్పటి తల్లిని కలవడనేది కూడా అదే సీజన్లో ఉంది. 

అలా స్ఫూర్తినిచ్చే ఎలిమెంట్స్ ని తీసుకుని ఒరిజినల్ కథనైతే చక్కగా రాసుకోవడం జరిగింది. అయితే స్క్రీన్ ప్లే నడపడంలోనూ, ఉత్కంఠని నిలబెట్టడంలోనూ, కామెడీని పండించడంలోనూ వెనకబడింది. అంటే ఈ అంశాల్లో పాస్ మార్కులు పడతాయి తప్ప ఫస్ట్ క్లాస్ మార్కులు పడవు. మరింత కసరత్తు చేసుంటే ఆ స్థాయికి వెళ్లగలిగే స్కోప్ ఉన్న కథ ఇది. 

చిన్నప్పటి వెన్నెల కిషోర్ నటన బాగుంది. ఆ విషయంలో క్యాస్టింగ్ డిపార్ట్మెంటుని మెచ్చుకోవాలి. మిగిలిన ఇద్దరు బాలనటులూ కూడా తమ తమ పాత్రలకు తగ్గట్టుగా చాలా ఈజ్ తో నటించారు. సినిమా పూర్తయ్యక కూడా వాళ్లే గుర్తొస్తారు. 

వెన్నెల కిషోర్ ట్రాక్ బాగానే రాసారు కానీ, ప్రియదర్శిది ఇంకా బలంగా ఉంటే బాగుండేది. అయితే ఉన్నంతలో వాళ్ల పద్ధతిలో వాళ్లు చేసారు. 

శర్వానంద్ ట్యాలెంట్ గురించి చెప్పక్కర్లేదు. వైవిధ్యాన్ని అద్భుతంగా పండించగలడు. చాలా ఏళ్ల క్రితం మదర్ సెంటిమెంటుతో "అమ్మ చెప్పింది" లో అద్భుతంగా నటించాడు. మళ్లీ ఇది అతని కెరీర్లో మరొక మదర్ సెంటిమెంట్ కథ.

అయితే సినిమా మొదలైన గంట వరకు శర్వా నుంచి అసలు ఎక్స్ప్రెషన్సే పలకవు. డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టరైజేషన్ వల్ల శర్వా తన ట్యాలెంట్ ని ప్రదర్శించే వీలు లేకుండా పోయింది ఆ గంట సేపూ! బలమైన నటుడిని పెట్టుకుని అతనికి ఇంట్రోవెర్ట్ క్యారెక్టరైజేషన్ ఇస్తే ఎలా! అయితే సెకందాఫులో కాస్త పర్వాలేదనిపించాడు.

అమల అక్కినేని చాలా కాలం తర్వాత తెర మీద కనిపించడం ఒక తరం ప్రేక్షకులకి అండర్లైన్ చేసుకునే అంశం. సహజమైన నటనతో చక్కగా నటించారామె. ఆమె ఒప్పుకోవాలే కానీ తల్లి పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగించేయొచ్చు. 

సైంటిస్ట్ పాత్రలో నాజర్, హీరోయిన్ గా రితు తమ పరిధుల్లో నటించారు. సెకండాఫులో రితు ముగ్గురు పిల్లల్ని మొదటి సారి చూసినప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్. ఈ కథలోని పాత్రలనుంచి  ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసేది అదే. 

అక్కడక్కడ చిన్న చిన్న మెరుపులున్నా డయలాగ్స్ మాత్రం యావరేజ్ గా ఉన్నాయి. 

ఇందులో హీరో మ్యూజిక్ టీచరయ్యుండి సరైన పాటలు లేకపోవడం ఒక మైనస్. బ్యాక్ గ్రౌంద్ స్కోర్ బిలో యావరేజ్. ఇలాంటి సినిమాలకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆయువుపట్టు. యావరేజ్ కథనాన్ని కూడా ఎమోషనల్ గా చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లగలిగేది అదే. కానీ సంగీత దర్శకుడు అవకాశాన్ని పూర్తిగా వాడుకోలేదు. దర్శకుడు కూడా అవసరమైంది రాబట్టలేదు. 

దర్శకత్వపరంగా ప్రధమార్థంలో చాలా మైనస్సులున్నాయి. 1998 కాలాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తూ "ఆకాశవాణి..." అంటూ రేడియో వినిపించడం, లంగా ఒణీలేసుకున్న అమ్మాయిల్ని, లాగుడు రిక్షాని చూపించడం దర్శకుడి టైం సెన్స్ ని ప్రశ్నిస్తాయి. అదంతా 1978 నాటి యాంబియన్స్ తప్ప 1998 కాదు! 

ఎడిటింగ్ ఓకే. అయితే కొన్ని చోట్ల యూట్యూబులో దొరికే 1990 ల నాటి హైద్రాబాదు షాట్స్ ని వాడారు. అవి పిక్సెల్ ఔట్ అయిపోయి బిగ్ స్క్రీన్ మీద ఇబ్బందిగా కనపడి నాన్ సింక్ కొట్టాయి. 

ఎన్ని మైనస్సులున్నా, ప్రధమార్థం ఎంత నీరసం తెప్పించినా ఇంటర్వల్ ట్విస్ట్ బాగుండడం, చివరాఖరి 40 నిమిషాలు ఉత్కంఠగా సాగడంతో సినిమా నిలబడింది. 

సాధ్యం కాదని తెలిసినా చనిపోయిన కుటుంబ సభ్యుల్ని ఒక్కసారి కలిసే చాన్సుంటే బాగుంటుందని ఇంచుమించు అందరి మనసులకి అనిపిస్తుంది. ఫలానా రోజు ఆ ప్రయాణం చేయకపోతే బతికే వీలుండేది కదా, ఆ రోజు నేను పక్కనుంటే ప్రమాదం జరిగేది కాదు కదా అని కుమిలిపోవడం కూడా సహజమే. అటువంటి ఎమోషన్ మీద ప్లే చేసిన డ్రామాయే ఈ "ఒకే ఒక జీవితం". 

విధినుంచి తల్లిని కాపాడుకోవాలనే కొడుకు తపన కూడా 1990ల నాటి "యమలీల"లో చూసిందే. అయితే ఇందులో హ్యాండిల్ చేసిన తీరు చాలా మెచ్యూర్డ్ గా ఉంది. 

కథని సైన్స్ ఫిక్షన్ గా ఎలా నడిపినా చివరికి ఒక మెచ్యూర్డ్, ప్రాక్టికల్ క్లైమాక్స్ ఇవ్వడం బాగుంది. సెంటిమెంట్ పండింది. భారీ అంచనాలు పెట్టేసుకోకుండా చూస్తే కొత్తగా అనిపించి నచ్చుతుంది. ఇదొక వెరైటీ కథ!

బాటం లైన్: ఒకసారి కచ్చితంగా చూడొచ్చు

నేను రెడ్డి అని ఎందుకు పెట్టుకున్నానంటే...

జ‌గ‌న్ ను చూసి నేను మారను