జాతీయ పార్టీ దిశ‌గా కేసీఆర్ అడుగులు

జాతీయ పార్టీ ఏర్పాటు దిశ‌గా తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు ముందుకేస్తున్నారు. ఇటీవ‌ల నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌లో జాతీయ రాజ‌కీయాల వైపు వెళ్లాలా? లేదా? అంటూ ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ ప్ర‌శ్నించిన సంగ‌తి…

జాతీయ పార్టీ ఏర్పాటు దిశ‌గా తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగులు ముందుకేస్తున్నారు. ఇటీవ‌ల నిజామాబాద్ బ‌హిరంగ స‌భ‌లో జాతీయ రాజ‌కీయాల వైపు వెళ్లాలా? లేదా? అంటూ ప్ర‌జ‌ల‌ను కేసీఆర్ ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. మీ అంద‌రి ఆశీస్సులు వుంటే త్వ‌ర‌లో జాతీయ రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. కేసీఆర్ అన్న‌ట్టుగా జాతీయ పార్టీ ఏర్పాటుకు క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేశారు.

ఈ నేప‌థ్యంలో ఆదివారం క‌ర్నాట‌క మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి హైద‌రాబాద్‌కు రావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. కేసీఆర్‌ను ఆయ‌న క‌ల‌వ‌నున్నారు. జాతీయ రాజ‌కీయ పార్టీపై కేసీఆర్‌తో చ‌ర్చించ‌నున్నారు. కేంద్రంలో బీజేపీని గ‌ద్దె దించ‌డం ఒక్క‌టే దేశ శ్రేయ‌స్సుకు మార్గ‌మ‌ని కేసీఆర్ బ‌లంగా విశ్వ‌సిస్తున్నారు.

మోదీ ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్పుడు కేసీఆర్ స‌న్నిహితంగా మెలుగుతూ వ‌చ్చారు. ఎప్పుడైతే తెలంగాణ‌లో కాంగ్రెస్ బ‌ల‌హీనప‌డి, బీజేపీ బ‌లోపేతం అవుతున్న‌దో అప్ప‌టి నుంచి కేసీఆర్‌కు దిక్కు తోచ‌డం లేదు. త‌న అధికారానికి బీజేపీ రూపంలో ప్ర‌మాదం పొంచి వుంద‌ని గ్ర‌హించిన‌ప్ప‌టి నుంచి కేసీఆర్‌కు భ‌యం ప‌ట్టుకుంది. కాంగ్రెస్ కంటే బీజేపీనే ఎక్కువ ప్ర‌మాద‌కారి అని ఆయ‌న గుర్తించారు. దీంతో బీజేపీ ముక్త భార‌త్ నినాదాన్ని ఆయ‌న ఎత్తుకున్నారు.

బీజేపీని అధికారం నుంచి గ‌ద్దె దించే శ‌స్త్ర చికిత్స చేయ‌గ‌లిగిన ఏకైక నాయ‌కుడు కేసీఆర్ మాత్ర‌మే అని టీఆర్ఎస్ నాయ‌కులు చెబుతున్నారు. బీజేపీతో తాడోపేడో తేల్చుకునే ప‌రిస్థితి తెలంగాణ‌లో ఏర్ప‌డింది. దీంతో జాతీయ‌స్థాయిలోనే మోదీతో అమీతుమీ తేల్చుకోడానికి కేసీఆర్ సిద్ధ‌మ‌య్యారు. ఇందుకు జాతీయ పార్టీ ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. జాతీయ స్థాయిలో మోదీ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టే స్థాయికి కేసీఆర్ ఎదిగితే మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. అందుకు విరుద్ధంగా త‌న అధికారాన్నే పోగొట్టుకుంటే మాత్రం మ‌రో చంద్ర‌బాబునాయుడిలా మిగిలిపోతారు.

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో మోదీకి వ్య‌తిరేకంగా కాంగ్రెస్ కూట‌మితో చంద్ర‌బాబు జ‌త క‌ట్టి వేసిన నాట‌కాల గురించి అంద‌రికీ తెలుసు. ఎప్పుడైతే ఏపీలో దారుణంగా దెబ్బ‌తిన్నారో అప్ప‌టి నుంచి కిక్కుర‌మ‌న‌డం లేదు. అవ‌కాశం వ‌స్తే మోదీతో క‌ర‌చాల‌నం చేయ‌డానికి త‌హ‌త‌హ‌లాడే ప‌రిస్థితికి వ‌చ్చారు. ఏది ఏమైనా కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటు పెద్ద చ‌ర్చ‌కే దారి తీసింది.