దివంగత ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతికి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన అల్లుడు చంద్రబాబునాయుడి అక్రమాస్తులపై లక్ష్మీపార్వతి అలుపెరగని న్యాయ పోరాటం చేస్తోంది. బాబును బోనులో ఇరికించాలని అనుకుని అమాయకంగా డబ్బు, సమయాన్ని వృథా చేసుకున్నారు. తాజాగా సర్వోన్నత న్యాయస్థానంలో ఆమెకు ప్రతికూల తీర్పు వెలువడింది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడి అక్రమాస్తులను నిగ్గు తేల్చాలని ఏకంగా ఆమె సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేసింది. కింది కోర్టుల్లో ఫలితాలను చూసైనా ఆమె తన పోరాటాన్ని విరమించుకోకపోవడం గమనార్హం. ఆమెలో ఏదో అత్యాశ ఉన్నట్టు కనిపించింది. దీంతో ఒకదాని తర్వాత మరొక వ్యవస్థను ఆశ్రయిస్తూ వెళ్లారు.
బాబు ఆస్తులపై విచారణలో భాగంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక ప్రశ్నలు సంధించింది. చంద్రబాబు ఆస్తులు తెలుసుకోడానికి మీరెవరిని కోర్టు ప్రశ్నించింది. చంద్రబాబు అక్రమాస్తుల కేసును హైకోర్టు అన్ని రకాలుగా విచారించి కొట్టి వేసిందని సుప్రీంకోర్టు గుర్తు చేయడం విశేషం.
ఒకరి ఆస్తుల గురించి మరొకరికి ఎందుకు తెలియాలని కోర్టు నిలదీసింది. లక్ష్మీపార్వతి లేవనెత్తిన అంశాలకు విలువ లేదంటూ ఆమె పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో చంద్రబాబు ఆస్తుల విషయమై లక్ష్మీపార్వతి పోరాటం ముగిసినట్టైంది.