నారా చంద్రబాబునాయుడు తర్వాత టీడీపీకి లోకేశ్ మాత్రమే దిక్కు. టీడీపీని లోకేశ్ కాపాడుకుంటారా? లేదా? అనేది ఆయన నాయకత్వ సమర్థతపై ఆధారపడి వుంటుంది. ఇది కాలం తేల్చాల్సిన అంశం. నాయకుడిగా తనను తాను నిరూపించుకోవాలని లోకేశ్ తపన పడుతున్నారు. మాస్ లీడర్ అనిపించుకోవాలనే ఉబలాటంలో లక్ష్యం పక్కకు పోయి, పూర్తి విరుద్ధమైన పేరు తెచ్చుకుంటున్నారనేది నిజం.
తండ్రి నుంచి లోకేశ్ ఏం నేర్చుకున్నాడో తెలియదు. కానీ ఆయన భాష పూర్తిగా పక్కదారి పట్టింది. ప్రత్యర్థులపై విమర్శలకు బదులు దూషణలకు దిగుతూ… లోకేశ్ తనను తాను దిగజార్చుకుంటున్నారు. ఉదాహరణకు ఇటీవల ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి… వెధవ అంటూ తిట్టారు. రెండురోజుల క్రితం కావలి పర్యటనలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఇతర వైసీపీ ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి 'ఫేక్ నా కొడుకులు” అని తిట్ల దండకానికి దిగారు.
ఈ నేలబారు భాష లోకేశ్ ఎక్కడ నేర్చుకున్నారో? అనే చర్చకు తెరలేచింది. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ప్రత్యర్థులపై ఇలాంటి అభ్యంతరకర భాష వాడలేదు. ఘాటు విమర్శలే తప్ప, చాలా వరకూ చంద్రబాబు భాష హద్దులు దాటదు. తండ్రి నుంచి భాషా సంస్కారాన్ని అలవరుచుకోలేదు. ప్రత్యర్థులపై మనం వాడే భాషను బట్టే, అక్కడి నుంచి అదే రకమైన గౌరవం వస్తుంది.
తమను ఫేక్ నా కొడుకులని లోకేశ్ దూషణపై మంత్రి కాకాణి అదే రేంజ్‌లో స్పందించారు. వాడెవడు లోకేశ్ అని కాకాణి ప్రశ్నించారు. ఫేక్ నా కొడుకులెవరో లోకానికి తెలుసని మాట్లాడారు. వాడు, నా కొడుకులు లాంటి అభ్యంతకర వ్యాఖ్యలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎప్పుడూ ప్రయోగించలేదు. ప్రత్యర్థులపై పరుష వ్యాఖ్యలు చేశారే తప్ప, ఏనాడు బూతులు మాట్లాడిన సందర్భం లేదు.
నాయకుడిగా ఎదగాలనుకునే వాళ్లు ముఖ్యంగా నోటిని అదుపులో వుంచుకోవాల్సి వుంటుంది. తానొక తిట్టు తిట్టి, ప్రత్యర్థులతో పది మాటలు అనిపించుకోవాలని లోకేశ్ ఉత్సాహ పడుతున్నట్టుగా ఆయన వైఖరి కనిపిస్తోంది. లోకేశ్ మాస్ లీడర్ కాబోయి… తానే మాస్ అవుతున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం లోకేశ్‌కు వ్యక్తిగతంగా, అలాగే పార్టీ పరంగా పెద్ద దెబ్బే అని హెచ్చరించక తప్పదు.
లోకేశ్‌కు సరిగా తెలుగు రాదనే మాట ఎప్పటి నుంచో వింటున్నాం. ట్యూషన్లు పెట్టించుకుని భాషను మెరుగుపరచుకున్నారని విన్నాం. కొంపదీసి తాను మాట్లాడే బూతులే అసలుసిసలైన తెలుగు భాష అని ఆయన భావిస్తున్నారా? కాస్త చెక్ చేసుకుంటే ఆయనకే మంచిది.