బాలాపూర్ గణేష్ లడ్డు రికార్డు ధర పలికింది. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అధ్వర్యంలో జరిగిన వేలం పాటలో రూ. 24లక్షల 60వేలతో లడ్డును దక్కుంచుకున్నారు వంగేటి లక్ష్యా రెడ్డి. గత ఏడాది కంటే ఈ ఏడాది 5.70లక్షలు అధిక ధర పలికింది.
తెలుగు రాష్ట్రాల్లో గణపతి ఉత్సవాలు అంటే ముందుగా రంగారెడ్డి జిల్లా, మహేశ్వరం లోని బాలాపూర్ గుర్తుకు వస్తుంది. అక్కడ ప్రతి ఏడాది వినాయక చవితికి వినాయకుడి లడ్డును వేలం వేస్తారు. వేలం పాట పడి లడ్డును దక్కించుకోవాడనికి తెలుగు రాష్ట్రాల నుండి ఎంతో మంది పోటీపడుతుంటారు.
బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి అనేది 1980లో ఏర్పాటు చేశారు. తొలిసారి 1994లో బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రతి ఏడాది వందలూ.. వేలూ దాటి లక్షలు పలుకుతుంది. ప్రతి సంవత్సరం పాత రికార్డులను తిరగరాస్తూ వస్తుంది. కరోనా కారణంగా 2020 సంవత్సరంలో మాత్రం లడ్డూ వేలాన్ని రద్దు చేశారు.
బాలాపూర్ లడ్డుతో అన్ని విధాలా అదృష్టం కలిసివస్తుందని భక్తులు నమ్ముతారు. అందుకోసమే లడ్డు దక్కించుకోవడానికి చాల మంది పోటీ పడతారు. గణేష్ లడ్డు వేలంపాట ద్వారా వచ్చిన డబ్బు బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆ ప్రాంత అభివృధికి, సేవా కార్యక్రమాలకు ఖర్చు పెడతారు.