తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక పుణ్యమా అని టీడీపీ అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. టీడీపీ రాష్ట్ర అగ్రనేతల ఎదుట సత్యవేడు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పరస్పరం కొట్టు కోవడం ఒక్కటే తక్కువైంది. దీంతో సమావేశానికి హాజరైన అగ్రనేతలు షాక్‌కు గురయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక ఫలితం ఎలా ఉండనుందో ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చినట్టైంది.
చిత్తూరు జిల్లా సత్యవేడులో టీడీపీ అగ్రనేతలకు చేదు అనుభవం ఎదురైంది. సత్యవేడులో టీడీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీడీపీ అగ్రనేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రి అమరనాథరెడ్డి, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పార్లమెంట్ పరిధిలోని టీడీపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు.
సత్యవేడు మాజీ ఎమ్మెల్యే హెచ్ హేమలత, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేడీ రాజశేఖర్ వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో ఇరు వర్గాలు పరస్పరం కొట్టు కుంటాయేమోనన్న ఆందోళన నేతల్లో కలిగింది. సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎవరో తేల్చి చెప్పాలని హేమలత వర్గీయులు పట్టుబట్టారు. జేడీ రాజశేఖర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సమావేశంలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రసంగిస్తుండగా సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేడీ రాజశేఖర్‌ను తొలగించాలని కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో నాయకులు కంగుతిన్నారు. ఉప ఎన్నిక అనంతరం ప్రత్యేక సమావేశాలు నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని నేతలు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అనంతరం జేడీ రాజశేఖర్ ప్రసంగం మొదలు పెట్టగానే …గొడవ తారాస్థాయికి చేరింది.
టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ ప్రసంగానికి కొందరు అడ్డుపడ్డారు. మరోవైపు జేడీకి మద్దతుగా మరికొందరు నినాదాలు చేశారు, అసలు సమావేశంలో ఏం జరుగుతున్నదో అర్థం కాని గందరగోళ పరిస్థితి. హేమలత, జేడీ వర్గీయులు విడిపోయి పరస్పరం వాదనకు దిగారు. కొట్టుకునే పరిస్థితి తలెత్తడంతో , శాంతింపజేసేందుకు నాయకులు శ్రమించాల్సి వచ్చింది. బుద్దా వెంకన్న సర్ది చెప్పడానికి ప్రయత్నించినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో రాజశేఖర్ తన ప్రసంగాన్ని నిలిపివేయాల్సి వచ్చింది.
అనంతరం పార్లమెంట్ అభ్యర్థి పనబాక లక్ష్మి ప్రసంగిస్తుండగా మళ్లీ గందరగోళం. కొందరు నినాదాలు చేసుకుంటూ సమావేశ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లారు. పార్టీలో ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా తయారైందని, తమనెవరూ పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పనబాక ప్రసంగాన్ని ఆపి వేయాల్సి వచ్చింది. మాజీ మంత్రి అమరనాథరెడ్డి కలుగజేసుకుని సముదాయించేందుకు ప్రయత్నించినా ఎవరూ వినిపించుకోలేదు. సమస్య తమ దృష్టికి వచ్చిందని, అందరం కూచుని పరిష్కరించుకుందామని ఆయన నచ్చ చెప్పారు.
ఏది ఏమైతేనేం తిరుపతి పార్లమెంట్ పరిధిలో క్షేత్రస్థాయిలో తమ పార్టీ దుస్థితి ఏంటో టీడీపీ అగ్రనేతలకు సత్యవేడు కార్యకర్తలు ప్రత్యక్ష అనుభవంలోకి తెచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో టీడీపీలో ఏదో రకమైన సమస్య ఆ పార్టీ నేతలకు ముచ్చెమటలు పట్టిస్తోంది.