సెట్స్ పై అందర్నీ అనుమానంగా చూడాల్సి వస్తోందని బాధపడుతోంది హీరోయిన్ రకుల్. తన చుట్టూ ఉన్న వ్యక్తులపై డౌట్ పడడం చాలా ఇబ్బందికరంగా ఉందని చెబుతోంది. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో అది తప్పడం లేదంటోంది. ఇంతకీ రకుల్ చెబుతోంది దేని గురించో తెలుసా? కరోనా గురించి.
“కెమెరా ముందు ఉండాల్సిన మేం మాస్కులు పెట్టుకోలేం. అది మా మేకప్, హెయిర్ కు ఇబ్బందికరంగా మారుతుంది. దీంతో సెట్ లో చుట్టుపక్కల జనాలు మాస్కులు పెట్టుకున్నారా లేదా అని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి వస్తోంది. ఎవరైనా మాస్క్ పెట్టుకోకుండా తిరిగితే వాళ్ల వైపు అనుమానంగా చూడాల్సి వస్తోంది.”
ప్రస్తుతం సెట్స్ లో తనను ఇబ్బందిపెడుతున్న అంశం ఇదొక్కటే అంటోంది రకుల్. దేశవ్యాప్తంగా కరోనా రెండో దశ మొదలైన నేపథ్యంలో.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని రకుల్ చెబుతోంది. ఈ ఏడాది దేశవ్యాప్తంగా థియేటర్ వ్యవస్థ పూర్తిస్థాయిలో గాడిన పడుతుందనే నమ్మకాన్ని వ్యక్తంచేసింది.
కరోనా బారిన పడిన ప్రముఖుల్లో రకుల్ కూడా ఉంది. గతేడాది డిసెంబర్ లో ఆమెకు కరోనా సోకింది. తల్లిదండ్రులకు దూరంగా క్వారంటైన్ లో ఉంటూ కరోనాతో బాధపడ్డానని, తనలా మరొకరు వైరస్ బారిన పడకూడదని కోరుకుంటోంది రకుల్.