తెలుగు సినిమా నిర్మాతల మండలి ఓ వైవిధ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సభ్యుల్లో ఎవరైనా తమ సభ్యత్వాన్ని వదలుకుంటే లక్ష రూపాయలు, రెండు లక్షల రూపాయలు ఇవ్వడానికి ఆఫర్ చేసింది. శాశ్వత సభ్యులు అయితే రెండు లక్షలు, ఆర్టినరీ సభ్యులు అయితే లక్ష రూపాయలు ఇస్తారు. అక్కడితో కౌన్సిల్ లో వారి సభ్యత్వం రద్దయిపోతుంది.
నిర్మాతల మండలిలో చాలా మంది సభ్యులు వున్నారు. వీరిలో చాలా మంది ఏనాడో సినిమాల నిర్మాణం ఆపేసారు. చాలా మంది కష్టాల్లో వున్నవారు కూడా వున్నారు. చాలా మంది కేవలం కౌన్సిల్ ఇచ్చే మెడికల్ ఇన్యూరెన్స్ మీద ఆధారపడిన వారు కూడా వున్నారు.
అయితే కౌన్సిల్ జనరల్ బాడీ అయితే మాత్రం అందరూ హాజరవుతారు. యాక్టివ్ గా వున్న నిర్మాతలకు అడ్డం పడుతుంటారు అనే విమర్శ వుంది. వందల కోట్ల రేంజ్ లో సినిమాలు తీసే దిల్ రాజు, అస్సలు ఏనాడో సినిమాలు ఆపేసిన నిర్మాత అక్కడ ఒక్కటే. అందుకే ప్రస్తుతం యాక్టివ్ గా సినిమాలు తీసే వారు ఎవ్వరూ కౌన్సిల్ కు పెద్దగా రారు. కౌన్సిల్ లో కూడా సదా కొద్ది మంది మాత్రమే అలా ఆఫీస్ బేరర్ లుగా కొనసాగుతూ వుంటారు. అందుకే దాదాపు రెండు డజన్లకు పైగా నిర్మాతలు వేరుగా యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని పెట్టుకున్నారు.
ఇటీవల మళ్లీ ఛాంబర్, కౌన్సిల్ లకు కాస్త కదలిక వచ్చింది. గిల్డ్ అనేది అధెంటిక్ బాడీ కాకపోవడంతో, కౌన్సిల్, చాంబర్ ల ద్వారానే అన్నీ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో కౌన్సిల్ ను ప్రక్షాళన చేయాలన్న ఆలోచన చేసారు. పురానా జమానా కాలంలో ‘నా భాగస్వామి’ అనే పదం వాడి చాలా మందిని కౌన్సిల్ లో సభ్యులుగా చేర్చేసారని, పిల్లలను, బంధువులను కూడా చేర్చేసి ఓట్లు పెంచుకుని అధికానం చెలాయిస్తూ వస్తున్నారని విమర్శలు వున్నాయి.
ఓ పెద్దాయిన తనకు పరిచయం వున్నవారినీ, బంధువులను, పక్కింటి వారినీ ఇలా ఎవరిని పడితే వారిని భాగస్వాములు అనే పేరుతో అప్పట్లో సభ్యులను చేసేసారనే విమర్శ వుంది. అప్పట్లో పది వేలు, మహా అయితే యాభై వేలు సభ్యత్వంగా కట్టిన వారు వున్నారు.
ఇప్పుడు కాస్త భారీ మొత్తం ఆఫర్ చేస్తే ఇలా పాత తరం జనాలు, కౌన్సిల్ తో అవసరం లేని వారు, డబ్బులు అవసరం వున్నవారు బయటకు వెళ్లిపోతారనే ఆలోచన చేసారని తెలుస్తోంది. అప్పుడు కాస్త లోడ్ తగ్గుతుంది. జనరల్ బాడీలు సరైన దశ దిశతో నడుస్తాయి అని భావిస్తున్నారు. అందుకే సభ్యత్వం బై బ్యాక్ ఆఫర్ ను ప్రకటించారని తెలుస్తోంది.
మరి ఈ లక్ష, రెండు లక్షల మొత్తాలు అవసరం పడి ఎంత మంది సభ్యత్వం వదులుకుంటారో చూడాలి.