పార్టీ స్టేటూ మారిస్తే ఫేటు మారుతుందా?

నటి దివ్యవాణి తెలుగుదేశానికి తిలోదకాలు ఇచ్చేసి చాలాకాలం అయింది. తెలుగుదేశం పార్టీ మీద రకరకాలుగా ఫైర్ అయి.. చివరికి ఆ పార్టీని ఆమె విడిచి పెట్టింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు…

నటి దివ్యవాణి తెలుగుదేశానికి తిలోదకాలు ఇచ్చేసి చాలాకాలం అయింది. తెలుగుదేశం పార్టీ మీద రకరకాలుగా ఫైర్ అయి.. చివరికి ఆ పార్టీని ఆమె విడిచి పెట్టింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు ఆమె తెలంగాణలో కీలక నాయకుల్లో ఒకరైన ఈటల రాజేందర్‌తో ఆయన ఇంటిలో సమావేశమై.. పార్టీలో చేరడానికి గల అవకావాలను, చేరితే దక్కగల అవకాశాలను గురించి చర్చించినట్లుగా వార్తలు వచ్చాయి. 

దివ్యవాణి మొన్న మొన్నటి దాకా అయినదానికీ కానిదానికీ జగన్ సర్కారు మీద నోరేసుకుని పడిపోయిన తెలుగుదేశం మహిళా నాయకురాళ్లలో ఒకరు. విషయం ఉన్నా లేకపోయినా ఆ విషయం మీద తనకు అవగాహన, జ్ఞానం ఉన్నా లేకపోయినా.. రెచ్చిపోయి మాట్లాడేయడంలో ఆమె సిద్ధహస్తురాలు. జగన్ ను ఎంతగా తిడితే.. పార్టీ తనను అంతగా అందలం ఎక్కిస్తుందనే భ్రమల్లో బతుకుతూ ఉండే అనేకానేకమంది తెలుగుదేశం నాయకులు, నాయకురాళ్లలాగానే దివ్యవాణి కూడా వ్యవహరించారు. అయితే పార్టీ మాత్రం ఆమెను కరివేపాకు లాగానే వాడుకుంది. ఈ ఏడాది మహానాడు జరిగిన నాటినుంచి ఆమె పార్టీ మీద గుస్సా అవుతున్నారు. 

మహానాడులో మాట్లాడడానికి తనకు సరైన అవకాశం ఇవ్వలేదంటూ.. ఆమె పార్టీ మీద ఫైర్ అయ్యారు. దానికి ఫాలో అప్ గా.. అటు చంద్రబాబు మీద, ఇటు లోకేష్ మీద కూడా ఫైర్ అయ్యారు. ఆ తర్వాత.. ఎవరు పిలిచి బుజ్జగించారో.. ఎవరు పిలిచి తలంటుపోశారో తెలియదు గానీ.. నా సోషల్ మీడియా అకౌంట్ ను హ్యాక్ చేసి తప్పుడు పోస్టులు పెట్టారని ఒక అబద్ధం బయటకు వదిలి.. పెట్టిన పోస్టులను డిలిట్ కూడా చేశారు. ఆ తర్వాత చంద్రబాబుతో భేటీ అయితే.. తన అలకకు పరిహారంగా పెద్ద పదవులు ప్రాధాన్యం లభిస్తుందని ఆమె తలపోశారు గానీ.. తండ్రీ కొడుకులు ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో విసిగిపోయి.. చివరి తిట్లు కూడా తిట్టేసి తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టారు. 

అయితే.. 2019 ఎన్నికలకు ముందే.. తెలుగుదేశంలో చేరి.. జగన్ ను ఇన్నాళ్లూ తిట్టడానికి ఆ పార్టీకి బాగా ఉపయోగపడిన దివ్యవాణి.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల మీదకు ఎందుకు ఇంట్రెస్టు చూపిస్తోందన్నది ఒక చర్చ. ఆమె ఏపీ బీజేపీలో చేరాలనుకుంటే.. అది వేరే పద్ధతి. కానీ.. ఇన్నాళ్లూ జగన్ ను తిట్టిన తిట్లకు ఆ రాష్ట్రంలో ఎక్కడ పోటీచేసినా.. తనను దిక్కూదివాణం లేకుండా ఓడిస్తారని భయపడ్డదేమో తెలియదు గానీ.. వచ్చి తెలంగాణలో బిజెపి పార్టీ జెండా పట్టుకునేందుకు సిద్ధం అవుతోంది. అయినా.. అటు పార్టీని, ఇటు స్టేటును కూడా మార్చినంత మాత్రాన.. దివ్యవాణి ఫేటు మారుతుందా..? తలరాత మారుతుందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇక్కడ తెలంగాణ బిజెపికి నోరేసుకుని పడిపోయే వాళ్లకి కొదవేమీ లేదు. ఆడగొంతుక కావాలని అనుకున్నా సరే.. రాములమ్మ, లేడీ అమితాబ్, ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఉండనే ఉంది. కానీ.. పార్టీ ఒక రకంగా ఆమెనే పక్కన పెట్టేసి.. తనంత తాను మరో తరహా రాజకీయం చేసుకుంటూ పోతోంది. అలాంటి నేపథ్యంలో చేరడానికి కమలం పార్టీలో చేరవచ్చు గానీ.. దివ్యవాణికి తెలంగాణ బిజెపి ఎంత ప్రాధాన్యం ఇస్తుంది? ఎంతగా నెత్తిన పెట్టుకుంటుంది అన్నది మాత్రం అనుమానమే!