వన్ సైడ్ లవ్ అంటూ పవన్ కల్యాణ్ కు సుదీర్ఘ కాలంగా కన్నుగీటి పడేసిన చంద్రబాబునాయుడు.. ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడీని కూడా వాటేసుకోవడానికి ప్రయత్నిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
ఢిల్లీలో సమావేశానికి తనను ఆహ్వానిస్తే మోడీ తనను పక్కకు తీసుకెళ్లి చెవిలో గుసగుసలు మాట్లాడారంటూ చంద్రబాబునాయుడు ప్రచారం చేసుకున్నారు. తెలంగాణలో పదిశాతం ఓటు బ్యాంకు ఉన్న తమ పార్టీతో జట్టు కట్టి బిజెపి ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నట్టు కూడా పుకార్లు పుట్టించారు. ప్రచారం చేయించుకున్నారు.
మళ్లీ మోడీ పల్లకీ మోస్తారా అని అడిగితే.. సూటిగా జవాబివ్వకుండా.. నేను ఏం పనిచేసినా రాష్ట్రప్రయోజనాలకోసమే చేస్తానంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. తాజాగా, 2019 ఎన్నికలకు ముందు మోడీని బూతులు తిట్టిన నోటితోనే.. ఇప్పుడు భజన చేస్తున్నారు.
అమరావతి రాజధానికి నరేంద్రమోడీ అండగా ఉంటారట. పార్లమెంటు అండగా ఉంటుందట. అలా అని ఆయన చెప్పడం చూస్తోంటే.. ముసలితనం బాగా ఎక్కువైపోయి.. చంద్రబాబుకు మైండ్ పనిచేయడం మానేసిందా అనే అనుమానం కలుగుతుంది.
ఇంతకూ అమరావతి రాజధానికి పార్లమెంటు అండగా ఉంటుందనే అభిప్రాయం చంద్రబాబుకు కలగడానికి, ఆయన ఆ విషయం విజయవాడలో ఒక సభలో వెల్లడించడానికి అసలు మూలకారణం ఏమిటో తెలిస్తే నివ్వెరపోతాం. అమరావతి శంకుస్థాపన సభ నిర్వహించినప్పుడు.. మోడీ తన ప్రసంగంలో అమరావతి కోసం యమున జలాల్ని తెచ్చానని, దేశంకోసం చట్టాలు చేసే పార్లమెంటు ఆవరణ నుంచి పవిత్రమన మట్టిని తెచ్చానని అన్నారట. అలా అన్నందువల్ల.. అమరావతి రాజధాని అనే ఆలోచనకు పార్లమెంటు ఎప్పటికీ అండగా ఉంటుందని చంద్రబాబునాయుడు భాష్యం చెబుతున్నారు.
చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసినప్పుడు. మోడీ గుప్పెడు మట్టి తెచ్చి కానుకగా ఇచ్చిన మాట వాస్తవమే కావచ్చు. కానీ.. శంకుస్థాపనతో చేతులు దులిపేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రెవేటుగా ప్రారంభించుకున్న చంద్రబాబు.. మిగిలిన పాలన కాలంలో ఒక్క భవనం కూడా పూర్తి చేయకుండా.. ఆ మట్టి కాస్త ధూళిగా మారి ఎగిరిపోయేలా పాపం మూటకట్టుకున్నారు. అమరావతి గురించి మాట్లాడే నైతిక హక్కును కోల్పోయారు.
ఇవాళ చాలా నాటకీయంగా అమరావతికి పార్లమెంటు అండ అంటున్న చంద్రబాబు.. అదే పార్లమెంటులో.. రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టం, అక్కడి ప్రభుత్వాలే నిర్ణయిస్తాయి అని సాక్షాత్తూ కేంద్రప్రభుత్వం పలుసందర్భాల్లో తెగేసి చెప్పిన వైనం ఎలా మరచిపోతారు? అందుకే మరచిపోవడం కాదిది.. మైండ్ చెడడం అని బాబు మాటలు చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.