ఆయన ప్రయాణం సుదీర్ఘమైనది. తన ఊళ్ళో జనసంఘ్ పార్టీ పోస్టర్లకు గోడలకు అంటించడంతో మొదలైంది రాజకీయం. ఆ తరువాత ఆ పార్టీ పెద్దలు వస్తున్నారు అంటూ నెల్లూరు వీధులలో మైకు పట్టుకుని ప్రచారం చేశారు. ఆ తరువాత రోజులలో రాజ్యసభ అధ్యక్ష హోదాలో అక్కడ మైకు నుంచి ఏకంగా ప్రధాని మంత్రులు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఆయనే ముప్పవరపు వెంకయ్యనాయుడు.
ఆయనకు విశాఖ ఇష్టం. ఉప రాష్ట్రపతిగా అయిదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడు విశాఖలో తాజాగా ఆత్మీయ సమావేశంలో పాలుపంచుకున్నారు. తన గతాన్ని ఆయన ఒక్కసారిగా నెమరువేసుకున్నారు. తన కష్టానికి దక్కిన ఫలితమే పదవులు అంటూ భావోద్వేగం అయ్యారు. తనకు ఈ హోదాలు చాలు అని కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి చెందారు.
తాను నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టకుండా ఉండడం వల్లనే ఇన్ని మెట్లు ఎక్కానని చెప్పుకొచ్చారు. వాజ్ పేయ్ మన ఊరు వస్తున్నారు అని ఒకనాడు మైకులో ప్రచారం చేసిన తాను అదే వాజ్ పేయ్ ప్రధానిగా ఉండగా బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన పక్కన కూర్చోవడం అంటే తన రాజకీయ ప్రస్థానంలో అద్భుతం అదే కదా అని వివరించారు.
ఈ ఆత్మీయ సమావేశానికి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి నాయకులు రావడం జరిగింది. తెలుగుదేశం, వైసీపీ, బీజేపీ తో పాటు పలువురు ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులు కూడా వచ్చి వెంకయ్యనాయుడు ఏపీకి, ప్రత్యేకించి విశాఖకు చేసిన సేవలను కొనియాడారు. ఆయన ఢిల్లీలో ఉంటే చాలు పని అవుతుంది అన్న కొండంత నిబ్బరమే వెంకయ్యనాయుడు అని వక్తలు పేర్కొన్నారు.