కేసీఆర్ మరోసారి మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా.? రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీని ఓడించాలని చూస్తున్న రాజకీయ ప్రత్యర్థుల్ని డిఫెన్సులో పడేయడానికి అదే మంచి మార్గం అనుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు అంత తేలిగ్గా జవాబు చెప్పడం కష్టం. అయితే.. కేసీఆర్ మధ్యంతర ఎన్నికల గురించి ఆలోచిస్తున్నారనే వార్తలు బాగానే వస్తున్నాయి.
అభిజ్ఞ వర్గాల ద్వారా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. ఇందుకు ఒక సహేతుకమైన కారణం కూడా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లోనే తెలంగాణలో అధికారం దక్కించుకోవాలని ఉబలాటపడుతున్న బిజెపికి అందుకు తగినంత బలపడేందుకు టైమ్ ఇవ్వకుండా అడ్డుకోవడం ఒకటి అని అంటున్నారు.
ఇంటెలిజెన్స్ బ్యూరో వారికి పరిశీలనను బట్టి.. తెలంగాణలో ప్రస్తుతం ఎన్నికలు జరిగితే.. బిజెపి 26–27 సీట్లు గెలుచుకోవచ్చుననేది ఒక అధ్యయనంగా ప్రచారంలో ఉంది. తాము అంతకంటె చాలా ఎక్కువ బలపడినట్లు బిజెపి ఊహించుకున్నప్పటికీ కూడా.. ఆ సీట్ల సంఖ్య 30–35 వరకు వెళ్లవచ్చు. ఆపైన ఏమైనా సీట్లు కావాలంటే.. అందుకు తగినట్టుగా వారు ఇప్పుడు కష్టపడాలి. ఎన్నికలు వచ్చేలోగా అంత బలమూ వారికి పెరగాలి. అందుకు సుమారుగా 15 నెలల సమయం ఉంది. ఇప్పుడున్న దూకుడును ఇలాగే కొనసాగిస్తూ పోతే.. ఆ వ్యవధిలో చాలా వరకు బలం పెంచుకోవచ్చు.
సరిగ్గా ఈ అంచనాలతోనే కేసీఆర్ మధ్యంతరానికి వెళ్లాలని యోచిస్తున్నట్లు సమాచారం. అలా ప్రిపేర్ అయ్యే టైం బిజెపికి ఇవ్వకుండా మధ్యంతరానికి వెళితే ఎడ్వాంటేజీ తనకే ఉంటుందని కేసీఆర్ అనుకుంటున్నారు. కేవలం ప్రత్యర్థులకే టైం లేకుండా చేయడానికే ఆయన మధ్యంతర భారాన్ని పెడుతున్నారని అర్థమవుతోంది. గతంలో కేవలం సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందే మధ్యంతర ఎన్నికలు తెలంగాణలో జరిగాయి.
ఇంకో సహేతుకమైన కారణం కూడా ఉంది. 2024 ఎంపీ ఎన్నికల సమయానికి జాతీయ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉండాలనేది కేసీఆర్ కోరిక. అలాంటప్పుడు. 2023 డిసెంబరులో తెలంగాణ ఎన్నికలు ఉంటే.. అప్పటిదాకా ఆయనకు వీటితోనే సరిపోతుంది.
ఇవి ముగిసిన తర్వాత.. జాతీయ రాజకీయాల మీద ఫుల్ ఫోకస్ పెట్టడానికి కేవలం నాలుగు నెలలే టైం ఉంటుంది. ఆ టైం చాలదు. అలాంటప్పుడు.. సొంతంగా జాతీయ పార్టీ పెట్టినా, ఇతర పార్టీల కూటమిలో కీలకంగా చక్రం తిప్పాలని కోరుకున్నా.. ఇంకాస్త ఎక్కువ వ్యవధి కావాలి. అందుకే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ఇంకాస్త ముందుగానే ముగిస్తే.. హాయిగా జాతీయ రాజకీయాల్లో మోడీ వ్యతిరేక ఎజెండాతో దూసుకుపోవచ్చుననేది ఆయన వ్యూహం అవుతుంది.
ఈ కారణాల చేత కేసీఆర్ మధ్యంతరానికి వెళ్తారనే మాట నమ్మశక్యంగానే ఉన్నది గానీ.. ఎప్పుడు వెళ్తారనేదే వేచిచూడాలి.