‘‘ఇల్లరికంలో ఉంది మజా.. అది అనుభవించితే తెలియునులే..’’ అంటూ సినీగీతం మనకు ఒక కొత్త అనుభూతిని గొప్పగా పరిచయం చేస్తుంది. ఇల్లరికం వెళ్లడాన్ని కొంచెం తక్కువతనంగా భావించేవారు కొందరుంటారు.. అదే సమయంలో, ఇల్లరికంలోని మజాను ఆస్వాదించేవాళ్లు కూడా ఉంటారు. ఇప్పుడు నారా లోకేష్ కూడా.. ఇల్లరికం ఉండాలని కోరుకుంటున్నారా? అప్పుడప్పుడూ అత్తవారింటికి వెళ్లి రావడం మాత్రమే కాకుండా.. శాశ్వతంగా అత్తవారింటిలోనే ఉండిపోవాలనుకుంటున్నారా? అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందుకు ఏర్పాట్లు చేయవలసిందే.
నారా లోకేష్ ఇల్లరికం వెళ్లదలచుకుంటే.. బాలకృష్ణ అందుకు ఏర్పాట్లు చేయాలి గానీ.. జగన్ చేయడం ఏమిటా అని విస్తుపోతున్నారా? అయితే ఈ సంగతి తెలుసుకోవాల్సిందే.
నారా లోకేష్ తాజాగా ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడారు. తనకు చేతనైనంత వరకు అధికార పార్టీని తిట్టిపోశారు. తమ కార్యకర్తల్ని వేధిస్తున్నారని, భయపడేది లేదని.. స్టాక్ డైలాగులు కూడా కొన్ని అప్పజెప్పారు. ఈ ప్రాసెస్ లో భాగంగానే.. కొన్ని కొత్త విషయాలు కూడా చెప్పారు.
తన మీద 15 కేసులు పెట్టారని, ఏడుసార్లు జైలుకు తీసుకెళ్లారని లోకేశ్ అన్నారు. గతంలో ఎప్పుడూ పోలీసు స్టేషన్ గడప తొక్కని తనకు, ఇప్పుడు పోలీసు స్టేషన్ అత్తారిల్లులా మారిపోయిందని ఆయన సెటైరు కూడా వేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం సాగినంత కాలమూ.. నాలుగ్గోడల మధ్య కూచుని పార్టీ కార్యకలాపాలు వ్యూహాలు అంటూ గడిపిన ఈ లోకేష్ కు అప్పట్లో పోలీసుస్టేషనుకో, జైలుకో వెళ్లే అవసరం ఎందుకొస్తుంది? ఆ తర్వాత వాళ్ల నాన్నే అధికారంలోకి వచ్చాక.. వెళ్లడం ఎందుకు జరుగుతుంది? కాకపోతే, ఆ తర్వాత మాత్రం ఎందుకు వెళ్లాల్సి వస్తోంది..? ఇది కూడా ఆయన తర్కించుకుంటే బాగుంటుంది.
తెలుగుదేశం ఏలుబడి సాగిన రోజుల్లో ప్రజల్లోంచి గెలిచే దమ్ములేక దొడ్డిదారిలో మంత్రి పదవిని దక్కించుకుని.. ఎడాపెడా దోచుకున్న ఘనత నారా లోకేష్ సొంతం. పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగినట్టుగా.. తండ్రి జమానా సాగిన రోజుల్లో తాను ఎన్ని రకాలుగా అవినీతికి పాల్పడి ఎన్ని వందల కోట్లు దోచుకున్నాడో.. ఎవ్వరికీ తెలియదు లెమ్మని బహుశా లోకేష్ అనుకుంటుండవచ్చు. కానీ.. పాపాలన్నీ చిట్టాల్లో చాలా భద్రంగానే ఉంటాయి. 15 కేసులు పెట్టారని ఏడుసార్లు పోలీసు స్టేషనుకు వెళ్లానని అంటున్న లోకేష్ అక్కడికే అది అత్తారిల్లు అని మురిసిపోతున్నారు.
నిజానికి ఆయన అవినీతికి సంబంధించిన అసలుకేసులను ప్రభుత్వం బయటకు తీస్తే గనుక.. ఆయనకు ఇల్లరికం తప్పదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. లోకేష్ అవినీతి చిట్టాలు వెలికి వస్తే.. ఆయనకు సుదీర్ఘకాలపు కారాగారవాసం తప్పదని పలువురు విశ్లేషిస్తున్నారు.
ఇంకో కొసమెరుపు కూడా ఉంది… లోకేష్ ఇంకో అద్భుతమైన వాక్యం కూడా చెప్పారు. వైఎస్ రాజారెడ్డికే భయపడలేదు.. జగన్ కు భయపడతానా? అన్నారు. వైఎస్ రాజారెడ్డి చనిపోయే నాటికి చడ్డీలేసుకుని తిరుగుతున్న ఈ పదిహేనేళ్ల బుడతడు.. ఆయనను చూసి భయపడాలో వద్దో తెలుసుకునేంత వయసుకైనా వచ్చాడా? అనేది పలువురి సందేహం. రాజారెడ్డి మరణించినది 1998లో. 1983లో పుట్టిన లోకేష్ కు అప్పటికి వయసు 15! తన వయసెంత, తాహతు ఎంత అనేవి గుర్తు పెట్టుకోకుండా.. ‘‘రాజారెడ్డికే భయపడలేదు’’ తరహా ఓవరాక్షన్ డైలాగులు లోకేష్ కు ఎందుకు? అనే చర్చ పలువురిలో నడుస్తోంది.