రమ్యకృష్ణ అంటే ఎవర్గ్రీన్ గ్లామర్ హీరోయిన్ అంటే అతిశయోక్తి కాదు. వయస్సు పెరుగుతున్నా వన్నె తగ్గని ఆకర్షణ ఆమె సొంతం. టాలీవుడ్ టాప్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగారామె. అంతే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా కూడా ఆమె రాణించి… ఔరా అనిపించుకున్నారు. బాహుబలిలో రమ్యకృష్ణ ఇరగదీశారనే చెప్పాలి. ఆ సినిమా తర్వాత ఆమెకు అనేక ఆఫర్లు వచ్చాయి. క్వీన్ పేరుతో తెరకెక్కిన వెబ్ సిరీస్ తెలుగులోకి అనువాదమైంది. రెండురోజుల్లో జీ తెలుగు చానల్లో సీరియల్‌గా ప్రసారం కానుంది. ఒక వెబ్‌సిరీస్ తెలుగు టీవీ చానెల్లో ప్రసారం కానుండటం రమ్యకృష్ణతోనే మొదలు అని చెప్పడం కాసింత గర్వకారణమే. ఈ సందర్భంగా రమ్యకృష్ణ అభిప్రాయాలేంటో తెలుసుకుందాం.
లాక్డౌన్ తర్వాత ఏమవుతుందో..? తనకు డ్రీమ్ రోల్ అంటూ ఏవీ ఉండవని రమ్యకృష్ణ తెలిపారు. తనకే అవకాశాలు వచ్చినా కోరుకున్నవే అన్నట్టు ఉంటాయని, అందువల్ల అవే తన డ్రీమ్ రోల్స్ అనుకోవచ్చన్నారు. తన జీవితంలో లాక్డౌన్ ఓ గొప్ప అనుభవాన్ని మిగిల్చిందన్నారు. లాక్డౌన్ జీవితం ఎంతో హాయిగా ఉందన్నారు. ఇలాంటి టైమ్ జీవితంలో మరెప్పుడూ దొరకదన్నారు.
ఫ్యామిలీతో గడిపే సమయం దొరకడం ఆనందాన్ని ఇస్తున్నా…మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుం డటం, మన దేశంలో వలస కూలీలు, ఆహారం లేని నిరుపేదల దుస్థితి చూస్తుంటే మాత్రం తీవ్ర వేదన కలుగుతోందన్నారు.
తాను నటించిన తొలి వెబ్‌సిరీస్ క్వీన్ అని, దీని డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్‌కు చాలా టాలెంట్ ఉందన్నారు. ఆయన స్ట్రాంగ్ స్క్రిప్తో వస్తారని, బాగా తీస్తారని రమ్యకృష్ణ ప్రశంసలు కురిపించారు. అలాంటి గొప్ప డైరెక్షన్లో వచ్చిన అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే చేసినట్టు రమ్మ తెలిపారు. ఈ వెబ్ సిరీస్‌లో నా పాత్ర జయలలితను పోలినట్టు ఉందని చెబుతున్నారన్నారు. అయితే ఎవరేమనుకున్నా తానేమీ చేయలేనన్నారు.
అనితా శివకుమారన్ రాసిన క్వీన్ నవల ఆధారంగా తీసిన చిత్రమిది అన్నారు. జీ తెలుగు చానెల్లో వచ్చే సోమవారం నుంచి సీరియల్‌గా అందిస్తుండటం తనకు మరింత ఆనందంగా ఉందన్నారు. క్వీన్ సినిమా చేయడం ద్వారా రాజకీయ ఆకాంక్షలు, ఆలోచనలు ఏమీ రాలేదు… వస్తాయా? అంటే భవిష్యత్‌లో ఏమవుతుందీ చెప్పలేం కదా అని రమ్యకృష్ణ తెలిపారు. రానున్న రోజుల్లో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనను రమ్యకృష్ణ కొట్టి పారేయలేదు. దీన్నిబట్టి భవిష్యత్‌లో రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి, ఆకాంక్షను పరోక్షంగా ఆమె వెల్లడించినట్టైంది.