దేశంలో కరోనా రోజువారీ నంబర్లు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే రీతిలో నమోదవుతూ ఉండటం గమనార్హం. ఇంత వరకూ ఇండియాలో కరోనా వ్యాప్తి కాస్త అటు ఇటుగా అన్ని రాష్ట్రాల్లోనూ ఒకేలా సాగింది. తొలి వేవ్, రెండో వేవ్ వ్యాప్తి.. ని గమనిస్తే, రోజుల తేడాతో దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఒకే పరిస్థితి ఏర్పడింది. అయితే రెండో వేవ్ తగ్గుదల విషయంలో మాత్రం ఒక రాష్ట్రంతో సంబంధం లేని రీతిలో మరో రాష్ట్రంలో కేసుల నంబర్లు నమోదవుతున్నాయి.
రెండో వేవ్ కేసుల తగ్గుదల పూర్తి స్థాయిలో ఇప్పటి వరకూ సంభవించలేదు. నలభై వేల స్థాయికి చేరిన రోజువారీ కేసుల సంఖ్య దాదాపు అదే స్థాయిలో కొనసాగుతూ వస్తోంది. జూలై నెలంతా కేసుల సంఖ్య దాదాపు స్టడీగా కొనసాగుతూ వస్తోంది. జూన్ నెలాఖరుకే కరోనా సెకెండ్ వేవ్ పూర్తిగా తగ్గుముఖం పడుతుందన్న అంచనాలు నిజం కాలేదు. జూలై నెలాఖరు వస్తున్నా.. ఇంకా రోజువారీగా నలభై వేల స్థాయిలో కేసులు నమోదవుతూ ఉన్నాయి.
అయితే సెకెండ్ వేవ్ విషయంలో కొన్ని రాష్ట్రాల్లో అంచనాలు నిజం అయ్యాయి. వాటిల్లో జూన్ నెలాఖరుకే కేసుల సంఖ్య చాలా వరకూ తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం అక్కడ రోజువారీ కేసుల సంఖ్య చాలా చాలా తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. దేశంలో భారీ జనాభా కలిగిన రాష్ట్రాల్లోనే కేసుల సంఖ్య బాగా తగ్గడం గమనార్హం.
యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కేసుల సంఖ్య డబుల్ డిజిట్ రేంజ్ కు చేరింది. అలాగే గుజరాత్, పంజాబ్, హర్యానా, బిహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు కేసుల సంఖ్య చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ లేదు. పలు రాష్ట్రాల్లో గత వారంలో కరోనా కారణ మరణాలు జీరోగా నమోదయ్యాయి. ఇది చాలా సానుకూలాంశం.
కరోనా సెకెండ్ వేవ్ అక్కడ పూర్తిగా తగ్గిపోయినట్టే. ఆ రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టడం ఊరటను ఇచ్చే అంశమే కానీ, కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ కొద్దో గొప్పో కేసులు నమోదవుతూ ఉండటం, మరి కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య తగ్గడం పోయి, పెరుగుతూ ఉండటం మాత్రం ఆందోళనకరమైన అంశం.
ఇలా కేసుల సంఖ్య బాగా పెరుగుతున్న రాష్ట్రంగా నిలుస్తోంది కేరళ. అక్కడ రోజువారీ కేసుల సంఖ్య గత వారంలో బాగా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు దేశం మొత్తం మీద నమోదవుతున్న కేసుల్లో 30 శాతానికి మించి కేరళ వాటా ఉంది! గత వారంలో కేరళలో 15 వేలు, 17 వేలకు మించిన స్థాయిలో కూడా కేసులు నమోదయ్యాయి.
దేశం మొత్తం మీద నలభై వేల స్థాయిలో కేసులు నమోదైతే వాటిల్లో కేరళ వాటా ఆ స్థాయిలో ఉంది. కేరళ తర్వాత ప్రస్తుతం ఎక్కువ కేసులను కొనసాగిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ పది వేల స్థాయిలో సగటున రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతూ ఉండటం గమనార్హం. కేరళలో 1.30 లక్షలకు పైగా యాక్టివ్ కరోనా కేసులున్నాయి. మహారాష్ట్రలో ఈ నంబర్ అటు ఇటుగా లక్ష వరకూ ఉంది.
ఇక మధ్యస్థాయిలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు కొన్ని ఉన్నాయి. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, ఒడిశా, అస్సోం, మణిపూర్ వంటి రాష్ట్రాల్లో వెయ్యి నుంచి మూడు వేల లోపు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత వారంలో ఈ రాష్ట్రాల్లో యాక్టివ్ కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ.. కొత్త కేసుల నమోదు మాత్రం ఆగడం లేదు. రెండు మూడు వేల స్థాయిలోనే అయినా రోజువారీగా తప్పనిసరిగా ఆ స్థాయిలో కేసులు వస్తున్నాయి.
ఏతావాతా చూస్తే.. కరోనా ఇప్పుడు రాష్ట్రానికి ఒక విధంగా ప్రవర్తిస్తున్నట్టుగా ఉంది! జనాభా, జనసాంద్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనేమో కేసుల నంబర్లు అత్యంత పరిమితంగా నమోదవుతున్నాయి. విద్యాధికులు ఎక్కువగా ఉండి, జాగ్రత్తగా ఉంటారనుకున్న రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదవ్వడం లేదా, కేసుల నంబర్ స్టడీగా ఉండటం కొనసాగుతోంది. ఇది పరస్పర విరుద్ధ అంశంగా ఉంది.
పక్క పక్క రాష్ట్రాల్లో కూడా పరిస్థితి ఒకేలా ఉందనుకోవడానికి వీల్లేదు. అలాగే కేరళ వంటి రాష్ట్రంలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉండటం, మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య పది వేల స్థాయిలో స్టడీగా కొనసాగుతూ ఉండటం వంటి అంశాలను పరిశోధకులు కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.
మూడో వేవ్ కు ఇవే సంకేతాలు కాదా? అనే అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పరిగణనలోకి తీసుకుని ముందు జాగ్రత్త చర్యలతో సమాయత్తం కావాల్సిన అవసరం కనిపిస్తోంది.