తను ఏ సినిమా చేసినా, ఏ దర్శకుడితో చేసినా.. ఒకే ఒక్క విషయంలో మాత్రం చాలా పక్కాగా ఉంటాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. తన సినిమాల్లో క్రేజీ హీరోయిన్లను తీసుకుంటాడు. ఈ విషయంలో అవసరమైతే పారితోషికం పెంచి మరీ స్టార్ హీరోయిన్లను తీసుకోవడం బెల్లంకొండ స్టయిల్. గతంలో సమంతకు ఇలానే బ్లాంక్ చెక్ ఇచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి.
అయితే ఈసారి మాత్రం బెల్లంకొండకు ఈ విషయంలో నిరాశ ఎదురుకాక తప్పదు. అతడు చేయబోయే బాలీవుడ్ సినిమాకు స్టార్ హీరోయిన్ దొరకడం లేదు. ఛత్రపతి రీమేక్ పై బాలీవుడ్ బడా హీరోయిన్లు ఎవరూ ఆసక్తి చూపించడం లేదనేది ఓపెన్ సీక్రెట్.
నిజానికి ఈ విషయంలో స్టార్ హీరోయిన్ల కంటే బెల్లంకొండనే వెనక్కి తగ్గాడని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే, టాలీవుడ్ స్టార్ హీరోయిన్లకు పాతిక లక్షలు అదనంగా ఇచ్చి కాల్షీట్లు సంపాదించుకోవచ్చు. కానీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను తెచ్చుకోవాలంటే కోట్లలో ఖర్చుపెట్టాలి. కత్రినాకైఫ్, అలియాభట్ లాంటి హీరోయిన్లు కావాలంటే కోట్లు ఖర్చుపెట్టాలి.
ఒక్కో సినిమాకు అటుఇటుగా అలియాభట్ 10 కోట్లు, కత్రినాకైఫ్ 12 కోట్లు తీసుకుంటున్నారు. ఇక దీపిక పదుకోన్ లాంటి స్టార్ హీరోయిన్ కావాలంటే 25 కోట్లు సమర్పించుకోవాలి. పోనీ కుర్ర హీరోయిన్లను తీసుకుందామంటే.. శ్రద్ధాకపూర్ 8 కోట్లు, అనన్య పాండే 4 కోట్లు, జాన్వి కపూర్ 4 కోట్లు, దిశా పటానీ 6 కోట్లు తీసుకుంటున్నారు. చివరికి నిన్నగాక మొన్నొచ్చిన సారా అలీఖాన్ కూడా 4 కోట్ల రూపాయలు తీసుకుంటోంది.
సో.. బెల్లంకొండకు ఈసారి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దొరకాలంటే చాలా కష్టం. తప్పనిసరిగా స్టార్ కావాలంటే మాత్రం మూవీ బడ్జెట్ పెంచాల్సిందే. డైరక్టర్, హీరో కంటే ఎక్కువగా హీరోయిన్ కు ఇచ్చుకోవాల్సి ఉంటుంది. గతంలో రామ్ చరణ్ విషయంలో ఇదే జరిగింది. ఈసారి బెల్లంకొండ ఏం చేస్తాడో చూడాలి.