తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. తరచుగా జాతీయ రాజకీయాల మాటెత్తుతున్నారు. ప్రస్తుతానికి ఆయన చెబుతున్న మాటల్ని బట్టి.. కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీని స్థాపించడం కూడా తథ్యం,
2024 ఎన్నికల్లో జాతీయ పార్టీ తరఫున దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా పోటీకి దిగడం తథ్యం అనే అభిప్రాయం మనకు కలుగుతుంది. అలాగే.. దేశంలోని అన్ని భాజపాయేతర పార్టీలను పోగేసి.. వారందరితో కలిసి మోడీని గద్దెదించాలనే ప్లాన్ కూడా కేసీఆర్ కు ఉంది.
నిజానికి ఈ ప్లాన్ .. దేశంలో ఇంకా చాలా మంది నాయకులకు ఉంది. ఇందుకోసం వారందరూ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. జాతీయ స్థాయిలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంటే.. థర్డ్ ఫ్రంట్ ప్రయత్నాలు, ఆ రూపంలో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరి అవుతారా? అనే అనుమానం కూడా కలుగుతోంది.
కేసీఆర్ ను ఒంటరి చేయాలనే ఉద్దేశం.. ఇతర పార్టీల వారెవ్వరికీ లేకపోవచ్చు గానీ.. తాను చెప్పిందే వేదం, తాను చేస్తున్నదే కరెక్టు అనే అభిప్రాయాన్ని వీడకపోయినట్లయితే కేసీఆర్ ఒంటరి అయిపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు.
కేసీఆర్ దేశమంతా తిరిగి భాజపా వ్యతిరేక పార్టీలను ఒక తాటిమీదకు తీసుకురావడానికి చాలాకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ, జార్ఖండ్ లో హేమంత్ సొరెన్, తమిళనాడులో స్టాలిన్, కర్నాటకలో దేవెగౌడ, కేరళ వామపక్ష నాయకులు, ఇంకా శరద్ పవార్, ఉద్ధవ్ థాక్రే, కేజ్రీవాల్ తాజాగా నితీశ్ వరకు అందరినీ ఆయన కలిశారు. తన సింగిల్ పాయింట్ ఎజెండా ‘మోడీ ఓటమి’ని వారందరితో చర్చించారు. ఇప్పుడు నితీశ్ కుమార్ కూడా.. అదే ఎజెండాతో ఢిల్లీ వెళ్లి అనేక పార్టీల నాయకులను కలిసి ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించారు.
ఇక్కడే అసలు మతలబు ఉంది. నితీశ్ కుమార్ కాంగ్రెస్ నేత రాహుల్ ను కూడా కలిశారు. పైగా కాంగ్రెస్, వామపక్షాలు సహా అందరూ ఒక్కతాటిపైకి రావాలని అభిలషించారు. కేసీఆర్ ప్రయత్నాల్లో కాంగ్రెస్ లేదు. కాంగ్రెస్, బిజెపి యేతర కూటమి ఏర్పడాలనేది ఆయన కోరిక. ఏది ఏం జరిగినా ఆయనకు రాష్ట్ర రాజకీయాలు మాత్రమే ప్రధానం. రాష్ట్రంలో తాను తన పార్టీ తన కుటుంబం అధికారంలో ఉండడం మాత్రమే ప్రధానం. అలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ తో కలిసి ఉండే జట్టుతో జాతీయ రాజకీయాలు చేస్తూ.. రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ ను తిట్టిపోస్తాను.. అంటే జనం నవ్వుతారు.
కాంగ్రెస్ తో రాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో కేసీఆర్ కు వైరం ఉన్నంత మాత్రాన దేశంలోని ఇతర పార్టీలన్ని కాంగ్రెస్ ను ద్వేషించాలని లేదు. కేసీఆర్ తాను ప్రతిపాదిస్తున్న కూటమికి బలంగా కోరుకుంటున్న వారిలో దేవెగౌడ, స్టాలిన్, నితీశ్, శరద్ పవార్.. వీరందరూ కూడా కాంగ్రెస్ అనుకూలురే. వారికి కాంగ్రెస్ తో పేచీ లేదు. అలాంటి నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారు? ఎవరి మాట నెగ్గుతుంది.
జాతీయస్థాయిలో వచ్చే కూటమిలో కాంగ్రెస్ ఉండడానికి వీల్లేదని కేసీఆర్ పట్టుబడితే.. ఆయనను అసలు పట్టించుకునేది ఎందరు? అదే జరిగితే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరి అయ్యే ప్రమాదం ఉంటుంది. లేదా, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ తోజట్టు కట్టాలి. అది ఆయనకు ఆత్మహత్యా సదృశం. ఆల్రెడీ జాతీయ రాజకీయాల గురించి అనేక ప్రకటనలు చేసిన కేసీఆర్ ఇప్పుడు వెనుకడుగు వేసినా కూడా పరువు పోతుంది. మరి ఏం చేస్తారో చూడాలి.