పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తనను ఎవరూ చూడలేదనుకుంటుందట. ఎల్లో మీడియా వారి అజ్ఞానం ఆ స్థాయిలో ఉంది. జనాన్ని మభ్యపెట్టడం తమకు వెన్నతో పెట్టిన విద్య అని నరనారాన నమ్మే ఈ వర్గం తాజాగా ఒక ఎన్నికల సర్వేకు తెర లేపింది. ఆ సర్వే పేరులోనే పెద్ద మతలబుంది. ఎన్.డి.టి సర్వే అట. అంటే ఎన్.డీ.టీ.వి కి ఒక్క అక్షరం తక్కువన్నమాట. ఆ నోట ఈ నోట అది జాతీయ మీడియా ఎన్.డి.టి.వి సర్వేగా వినపడాలని అతితెలివి ప్రదర్శన కాకపోతే ఏంటి!
ఈ ప్రహసనం పక్కన పెట్టి అసలు సర్వేలో ఏం చెప్పారో చూస్తే నవ్వాగదు.
ఎలా చూసుకున్నా 2024 ఎన్నికల్లో చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని మొదలుపెట్టిన ఈ కుహనా సర్వేలో తెదేపా-జనసేన కూటమికి 146, వైకాపాకి 29 వస్తాయని చెప్పేసారు.
అదే కనుక తెదేపా జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఇద్దరికీ వరుసగా 98, 5 సీట్లొస్తాయట. ఈ నేపథ్యంలో వైకాపాకి 72 వస్తాయని లెక్కతేల్చారు.
ఇక్కడ సందేశమెవరికి ఇస్తున్నారో చూడండి. జనసేనకి తెదేపాతో పొత్తు తప్ప వేరే దిక్కులేదని, జనసేన ప్రమేయం లేకపోయినా తెదేపా సింగిల్ హ్యాండెడ్ గా 98 గెలిచేసి ప్రభుత్వం ఏర్పాటు చేసేయగలదని కదా! అంటే పవన్ కళ్యాణ్ గాలిని నిలువెల్లా తీసేసిన సర్వే ఇది.
విడిగా పోటీ చేయడం వల్ల యాంటీ-వైకాపా ఓట్లు ఎంత భయంకరంగా చీలినా కూడా తెదేపాకీ 98 వచ్చేస్తున్నప్పుడు ఇక ఆ పార్టీకి జనసేనతో పొత్తెందుకు?
మొన్నటికి మొన్న మహానాడుకి కాస్త రెస్పాన్స్ రాగానే జనసేనని దూరం పెట్టి, మళ్లీ వైకాపా ప్లీనరీ కూడా హిట్టవ్వగానే తోక ముడిచి జనసేనని ఒళ్ళో కూర్చోపెట్టుకున్న తెదేపా ఈ సర్వేని నమ్మితే పవన్ కళ్యాణ్ మొహమైనా చూస్తుందా? చూసే అవసరముందా?
ఇంతోటి డ్రాయింగ్ రూం సర్వేకి చర్చాగోష్టులు పెట్టి స్వయంతృప్తి చెందారు పచ్చ చానల్ వారు.
ఈ చర్చలో ఒకతను మాట్లాడుతూ..”రోజుకో సర్వే వస్తోంది… దేనినీ నమ్మలేని నేపథ్యంలో ఈ ఎన్.డి.టి సర్వే మాత్రం నిఖార్సుగా ఉంద”ని చెప్పాడు.
వీళ్లకి సత్యం అక్కర్లేదు…నచ్చిందే సత్యం అనుకుంటారు. పిల్లి-పాలు సామెత చెప్పింది ఈ విషయంలోనే.
వీళ్లల్లో పాపం చాలామంది విశ్లేషణాసక్తిని ఎప్పుడో కోల్పోయారు. ఎల్లో మీడియా నీడలో అవే వార్తల్ని చూస్తూ కూపస్థమండూకాల్లా బతికే వాళ్లు అలానే తరయారవుతారు మరి.
ఎందుకంటే జాతీయ సర్వేలైన “మూడ్ ఆఫ్ ది నేషన్”, “టైంస్ నౌ” మొదలైన వాటిల్లో పూర్తి భిన్నమైన సర్వేలొచ్చాయి. తెదేపాకి మళ్లీ ఓటమి ఖాయమన్నాయి. కానీ ఆ వివరాలేవీ ఈ పచ్చ ఛానల్ ప్రేక్షకులకి తెలియవు. ఎందుకంటే వీటిల్లో ఆ వార్తలు రావు.
తెదేపా వెంటిలేటర్ మీదున్నా దానికి బాహుబలంత బిల్డప్ ఇచ్చి నమ్మించే ప్రయత్నం చెస్తుంది ఎల్లో మీడియా. ఈ ఎన్.డి.టి సర్వే కూడా ఆ బాపతే.
ఇంతకీ ఎన్.డి.టి అంటే ఏమయ్యుండొచ్చు?… అనడిగితే ఒక విలేకరి “నారావారి-దిక్కుమాలిన-తిప్పలు” అయ్యుండాలి అని అన్నాడు.
లేకపోతే మరీ ఇంత దయనీయమా? ఈ సర్వేలు వినేసి జనం తెదేపాకి ఓట్లేసేస్తార?
…ఎందుకిదంతా అనడిగితే..
“జనం కోసం కంటే కేడర్ కి, పార్టీ వర్కర్లకి ఉత్సాహం అందించడానికి” అని చెప్పారు కొందరు.
ఆ లెక్కన తెదేపా కేడర్, పార్టీ వర్కర్లు ఆ స్థాయి పప్పుసుద్దాలా? నిజానిజాలు వాళ్లకి మాత్రం తెలియవా? అంతా భ్రమ..తెచ్చిపెంటుకుంటున్న దొంగ ధీమా.
– హరగోపాల్ సూరపనేని