రాజకీయంగా ఉనికిలో లేని వారిని కూడా వాడుకోగల సమర్థుడు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. గతంలో సబ్బం హరి వంటి వాళ్లను చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం అనుకూల మీడియా వాడి చూపించింది. అంతకు ముందు, ఆ తర్వాత కూడా ఆ జాబితాలో పలువురు నేతలున్నారు.
కాంగ్రెస్, బీజేపీల్లోని పాత వాళ్లు, ఏ పార్టీకి చెందకుండా ఉన్నామనే వాళ్లు కూడా చంద్రబాబు నాయుడుకు కావాల్సిన స్క్రిప్ట్ ను చదివి వినిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వీళ్లు ఏమవుతారనేది కూడా అందరికీ తెలిసిన సంగతే. అయితే ఇలాంటి పావులు మాత్రం చంద్రబాబుకు ఎప్పటికప్పుడు అంది వస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మైసూరారెడ్డి మాటలు కూడా చంద్రబాబు కు వత్తాసు పలుకుతున్నట్టుగా ఉండటం గమనార్హం.
వాస్తవానికి చంద్రబాబు హయాంలో రాయలసీమకు దక్కిందేమిటో, నీటి విషయంలో జరిగిన అన్యాయం ఏమిటో ఎవరికీ తెలియనిది కాదు. ఎన్టీఆర్ హయాంలో శంకుస్థాపనలు జరిగిన హంద్రీనీవా ప్రాజెక్టు చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు అలాంటి ప్రాజెక్టు ప్రతిపాదన కూడా ఒకటి ఉందని సీమ వాసులకే తెలియనంత స్థాయిలో జరిగింది చంద్రబాబు పాలన.
వైఎస్ సీఎం కావడంతోనే హంద్రీనీవా ప్రాజెక్టుకు ఒక రూపు వచ్చింది. ఒక్క హంద్రీనీవా అనే కాదు.. చంద్రబాబు తన చేతిలో అధికారం కలిగి ఉన్నప్పుడు సీమకు ఒక కప్పు నీళ్లు అందించే ప్రణాళికలు ఏవీ రచించలేదు, అమలు పెట్టలేదు. ఇది చెరిపేస్తే చెరిగిపోయే చరిత్ర కాదు వాస్తవం.
ఇక జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా.. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ సామర్థ్యం పెంచడంతో పాటు, రాయలసీమ ఎత్తిపోతల పథకం, కర్నూలు జిల్లాలో అదనంగా డ్యామ్ లు, హంద్రీనీవా కాలువల విస్తీర్ణం, హంద్రీనీవా కాలువలను రాయలసీమలోని సహజసిద్ధమైన చెరువులకు అనుసంధానం చేయడం వంటి ప్రణాళికలు రెడీ అయ్యాయి. కొన్ని అమలవుతున్నాయి కూడా.
చంద్రబాబు హయాంలో మైసూరాకు రాయలసీమ గుర్తుకు రాలేదు. అప్పుడు కిక్కురమన్న దాఖలాలు లేవు. అయితే ఇప్పుడు మాత్రం మైసూరా స్పందిస్తున్న తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆయన చంద్రబాబు చేతిలో కొత్త పావుగా మారారనే అభిప్రాయాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.