వర్గ విబేధాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో కోల్పోయిన సీట్లలో ముఖ్యమైనది హిందూపురం. ఇది తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పేరు. అయితే గతంలో కాంగ్రెస్ లోని విబేధాలు, ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని విబేధాలే అక్కడ టీడీపీని తిరుగులేని శక్తిగా మార్చాయి.
వాస్తవానికి 2004లోనే టీడీపీ అక్కడ ఓటమి పాలు కావాల్సింది. అయితే అప్పట్లోనే నవీన్ నిశ్చల్ తృటిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009లో నవీన్ నిశ్చల్ కు కాంగ్రెస్ టికెట్ దక్కలేదు. దీంతో ఇండిపెండెంట్ గా నిలిచి రెండో స్థానంలో నిలిచారాయన. తొలి స్థానంలో టీడీపీ, రెండో స్థానంలో నవీన్, మూడో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నిలిచారు ఆ ఎన్నికల్లో!
ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయ్యారు నవీన్. అయితే 2014లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బాలకృష్ణ అక్కడ విజయం సాధించారు. కానీ ఆ తర్వాత పరిణామాలు మళ్లీ మారాయి. 2019 ఎన్నికల నాటికి ఇక్బాల్ ను హిందూపురం అభ్యర్థిగా తీసుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. దీంతో నవీన్ కు సహజంగానే అసంతృప్తి కలిగి ఉండొచ్చు. దాన్ని బయటపడనీయలేదు కానీ.. ఫలితం దగ్గర తేడా కొట్టింది.
మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘనీ, నవీన్ లు ఏ మేరకు ఇక్బాల్ కోసం సహకరించారనేది ప్రశ్నార్థకంగా నిలిచింది. ఇక ఎన్నికల తర్వాత కూడా ఇక్బాల్ కు ప్రాధాన్యతను ఇచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఎన్నికలయిన వెంటనే ఇక్బాల్ కు ఎమ్మెల్సీ దక్కింది. దీంతో నవీన్ మరింత వెనుకబడ్డట్టుగా కనిపించారు.
అయితే ఇటీవలి నామినేటేడ్ పోస్టుల భర్తీలో నవీణ్ నిశ్చల్ కు ఏపీ ఆగ్రో డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. ఈ విషయంలో నవీన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. పార్టీ కోసం కష్టపడినందుకు తనకు ఆ పదవి దక్కిందని ఆయన స్పందించారు. మరి ఇంతటితో హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు తగ్గుతాయా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఇక్బాల్ హిందూపురంలోనే ఇల్లు తీసుకున్నా.. ఆయనకు స్థానికేతరుడు అనే ఇమేజ్ ఉంటుంది. నవీన్ వర్గం పూర్తిగ సహకరించనంత వరకూ ఇక్బాల్ అక్కడ నెగ్గుకురావడం తేలిక కాదు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఇక్బాల్ అక్కడ నుంచినే మళ్లీ పోటీ చేస్తాడనే నమ్మకాలు లేనట్టే. ప్రత్యేకించి స్థానికేతరుడు కావడమే అందుకు కారణం.
ఇప్పుడు నవీన్ నిశ్చల్ కు కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా ఆయనను మరిచిపోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పకనే చెప్పింది. మరి ఈ ప్రాధాన్యత ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల నాటికి నవీన్ కే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కినా పెద్ద ఆశ్చర్యం లేనట్టే.
ఏదేమైనా.. తను గెలిచినా, గెలవకపోయినా.. సొంత పార్టీ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తాడనే పేరున్న నవీన్ నిశ్చల్ గనుక వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయితే పోరు రసవత్తరంగా ఉంటుంది. నవీన్ కు చివరాఖరుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే సారి ఆ అవకాశం ఇస్తుందేమో చూడాలి.