ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించి నిన్న చాలా అప్ డేట్స్ బయటకొచ్చాయి. మూవీ లాంఛ్ అవ్వడంతో పాటు ఒకేసారి రెగ్యులర్ షూట్ లోకి కూడా ఎంటరైంది. ఆగస్ట్ 2 వరకు ఫస్ట్ షెడ్యూల్ జరుగుతుంది. తొలి షాట్ బిగ్ బి అమితాబ్ పై తీశారు.
ఇలా ఈ సినిమాకు సంబంధించి చాలా విశేషాలు బయటకొచ్చాయి. అంతేకాదు.. ఈ సినిమాకు ప్రాజెక్ట్-K అనే టైటిల్ కూడా పెట్టారు. ప్రభాస్ పట్టుకున్న క్లాప్ బోర్డ్ పై ఇదే పేరు ఉంది. అయితే ఇది సినిమా టైటిల్ కాదంటోంది యూనిట్. కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అంటోంది.
నిజానికి సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు ప్రాజెక్ట్-K అనే టైటిల్ బాగుంది. అయినప్పటికీ దీన్ని వర్కింగ్ టైటిల్ మాత్రమే అని యూనిట్ చెప్పడం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే ఈ టైటిల్ ను వైరల్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది మరో ఆర్ఆర్ఆర్ గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రామ్ చరణ్, ఎన్టీఆర్ తో సినిమా ప్రకటించినప్పుడు రాజమౌళి ఇలానే ఆర్ఆర్ఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టాడు. రామ్ చరణ్, రాజమౌళి, రామారావు అని అతడి మీనింగ్. కానీ ఆర్ఆర్ఆర్ అనే పదం బాగా పాపులర్ అయిపోవడంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య అదే హ్యాష్ ట్యాగ్ ను తన సినిమా టైటిల్ గా మార్చేశాడు రాజమౌళి. ఏదో ఒక అర్థం చెప్పాలి కాబట్టి.. రౌద్రం, రణం, రుధిరం అనే 3 పదాల్ని తగిలించాడు.
రాబోయే రోజుల్లో ప్రాజెక్ట్-కె వ్యవహారం కూడా ఇలానే మారుతుందంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఒక్క రోజుకే ఈ ''వర్కింగ్ టైటిల్'' బాగా వైరల్ అవ్వడం, మంచి రెస్పాన్స్ కూడా రావడంతో.. రాబోయే రోజుల్లో ఇదే పర్మినెంట్ టైటిల్ గా మారే అవకాశం ఉందంటున్నారు.