ఏలూరులో ప‌త్తాలేని ప్ర‌తిప‌క్షాలు

గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ త‌న‌కు తిరుగులేద‌ని వైసీపీ నిరూపించుకుంది. తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు కార్పొరేష‌న్‌కు సంబంధించి వెల్ల‌డైన ఫ‌లితాలు ఇదే చెబుతున్నాయి. ఈ కార్పొరేష‌న్‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు…

గ్రామీణ ప్రాంతాల్లోనే కాదు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోనూ త‌న‌కు తిరుగులేద‌ని వైసీపీ నిరూపించుకుంది. తాజాగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఏలూరు కార్పొరేష‌న్‌కు సంబంధించి వెల్ల‌డైన ఫ‌లితాలు ఇదే చెబుతున్నాయి. ఈ కార్పొరేష‌న్‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీతో పాటు బీజేపీ-జ‌న‌సేన కూట‌మి ప‌త్తా లేకుండా పోయాయి. 

ఏలూరు కార్పొరేష‌న్‌లో వైసీపీ తిరుగులేని ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. మొత్తం 50 డివిజ‌న్లు ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు 46 స్థానాల్లో వైసీపీ పాగా వేసింది. ఇంకా ఒక డివిజ‌న్ ఫ‌లితం తెలియాల్సి వుంది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కేవ‌లం మూడే మూడు డివిజ‌న్ల‌తో స‌రి పెట్టుకోవాల్సి వ‌చ్చింది.

ఏలూరు కార్పొరేష‌న్‌కు గ‌త మార్చిలో ఎన్నిక‌లు జ‌రిగాయి. వివిధ కార‌ణాల‌తో న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌డం, ఓట్ల ప్ర‌క్రియ ఆగిపోవ‌డం అంద‌రికీ తెలిసిందే. న్యాయ స్థానం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో నేడు కౌంటింగ్ ప్ర‌క్రియ‌ను ఎస్ఈసీ కోవిడ్ నిబంధ‌న‌ల‌ను పాటిస్తూ చేప‌ట్టింది. 

ఉద‌యం 8 గంట‌ల‌కు మొద‌ట పోస్ట‌ల్ బ్యాలెట్ల కౌంటింగ్ చేప‌ట్టారు. అన్నింటిలోనూ వైసీపీ ఆధిక్య‌త‌నూ ప్ర‌ద‌ర్శిస్తూ వ‌చ్చింది. ఇప్ప‌టికే 3 డివిజ‌న్లు ఏక‌గ్రీవం అయ్యాయి. మిగిలిన 47 డివిజ‌న్ల‌కు మార్చి 10న ఎన్నిక‌లు జ‌రిగాయి.

నాలుగు నెల‌ల త‌ర్వాత వెల్ల‌డ‌వుతున్న ఎన్నిక‌ల ఫ‌లితాలు అంద‌రూ ఊహించిన‌ట్టే అధికార వైసీపీ త‌న హ‌వాను మ‌రోసారి కొన‌సా గించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏక‌గ్రీవాల‌తో క‌లుపుకుని 46 డివిజ‌న్ల‌ను సొంత చేసుకుని ఏలూరు న‌గ‌ర పాల‌క సంస్థ పీఠాన్ని వైసీపీ ద‌క్కించుకుంది. 28, 37, 47 డివిజన్లలో మాత్ర‌మే టీడీపీ అభ్య‌ర్థులు గెలుపొందారు. 2024లో అధికారంలోకి వ‌స్తామంటున్న బీజేపీ-జ‌న‌సేన కూట‌మి ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది.