రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ పై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది భారతీయ జనతాపార్టీ. కొరకరాని కొయ్యలా మారిన ఏపీ రాజకీయాల్లో తాము కూడా స్థానం సంపాదించాలని ఉవ్విళ్లూరుతోంది. ఈ మేరకు ఇప్పటికే తెరపై, తెరవెనక చాలా కార్యకలాపాలు మొదలుపెట్టింది ఆ పార్టీ. అయితే అసలు విషయాన్ని వదిలేసి, ఏవేవో చేస్తోంది ఆ పార్టీ. అదే ప్రత్యేక హోదా. ఈ విషయంపై స్పష్టత ఇవ్వకపోతే బీజేపీ ఎన్ని చేసినా వేస్ట్.
అవును.. ఏపీ విభజన పాపంలో బీజేపీది కూడా కీలకపాత్ర. కాంగ్రెస్ ఐదేళ్లు ప్రత్యేకహోదా ఇస్తామంటే, కాదు పదేళ్లు ఇస్తామంటూ బీజేపీ అప్పట్లో సినిమా డైలాగులు చెప్పింది. 2014లో తెలుగుదేశంతో కలిసి ఇదే పాట పాడి అధికారంలోకి కూడా వచ్చింది. ఇప్పుడు 2019లో ఏపీతో సంబంధం లేకుండా కేంద్రంలో మరోసారి అధికారంలోకి వచ్చింది. కానీ ప్రత్యేక హోదాపై మాత్రం ఆ పార్టీ స్పష్టంగా మాట్లాడడం లేదు. ఆ పార్టీకి చెందిన చిన్నాచితకా నేతలు తమకు తోచిన ప్రకటనలు ఇస్తూ గందరగోళానికి గురిచేస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ ఈ పద్ధతి మానుకోవాలి. కేవలం ప్రకటన ఇవ్వడమేకాదు, చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏపీకి హోదాను ఇచ్చితీరాలి. లోక్ సభ మొత్తం బీజేపీదే. రాజ్యసభలో కూడా డామినేషన్ వాళ్లదే. కాబట్టి ఏపీకి హోదా ఇస్తామంటే ఎవరూ అడ్డుచెప్పరు. ఇంకా చెప్పాలంటే గతంలో ఏ విధంగా ఏకపక్షంగా పార్లమెంట్ తలుపులు మూసి రాష్ట్రాన్ని విభజించారో, అదే విధంగా బలవంతంగానైనా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలి.
ఈ పని చేసిన తర్వాతే ఏపీలో రాజకీయాలు చేస్తే ఆ పార్టీకి అంతోఇంతో గుర్తింపు, గౌరవం ఉంటుంది. హోదా ఇవ్వకుండా ఎంతమందిని చేర్చుకున్నా, తెరవెనక కులాలవారీగా మీటింగ్స్ పెట్టినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే.. ఏపీ ప్రజల దృష్టిలో కాంగ్రెస్ ఎంతో, బీజేపీ కూడా అంతే. రాష్ట్రాన్ని ముక్కలుచేసిన కాంగ్రెస్, ఆ పాపానికి పరిహారాన్ని ఇప్పటికే రెండు సార్లు అనుభవించింది. మరో 2 దశాబ్దాల పాటు ఆ పాపం కాంగ్రెస్ ను వెంటాడక తప్పదు.
ఏపీలో మరో 3-4 ఎన్నికల వరకు కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా రావు. బీజేపీది కూడా ఇదే పరిస్థితి. ప్రజలు తమను క్షమించారని అనుకోవడం ఆ పార్టీ మూర్ఖత్వం. ప్రత్యేక హోదా అంశాన్ని మరిచిపోయారని అనుకోవడం అంతకంటే అవివేకం. కాబట్టి ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ హోదా దిశగా ఆలోచించాలి. స్పెషల్ స్టేటస్ అంశాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలి. ప్రత్యేకహోదా ఇచ్చిన తర్వాతే రాష్ట్రంలో రాజకీయాలు చేయడానికి బీజేపీకి అర్హత వస్తుంది. అప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వృధా ప్రయాసే. ఈ విషయాన్ని కమలనాథులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది.