రాజకీయాల్లో పొత్తుల్ని పెళ్ళితో అభివర్ణించడం.. ఆ తర్వాత ఆ పొత్తులు చెదిరిపోతే, 'పెటాకులు'గా అభివర్ణించడం మామూలే. ఆ లెక్కన, జనసేన పార్టీకి గతంలోనే భారతీయ జనతా పార్టీతో పెళ్ళయిపోయింది. ఒకేసారి టీడీపీతోపాటు జనసేననీ బీజేపీ అప్పట్లో పెళ్ళాడింది. జనసేన కూడా అంతే, టీడీపీతోపాటు బీజేపీని ఒకేసారి పెళ్ళాడింది. కానీ, పెళ్ళి ముచ్చట ఆ తర్వాత పెటాకులయ్యిందనుకోండి.. అది వేరే విషయం.
బీజేపీని కాదని, కాంగ్రెస్‌తో అంటకాగుతోంది తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం. అదే, టీడీపీని ఇటీవలి ఎన్నికల్లో మట్టి కరిపించేసింది. టీడీపీతో సంబంధాలు వదులుకోలేక జనసేన పడ్డ పాట్లు కాస్తా, ఆ పార్టీనీ కోలుకోలేని దెబ్బతీసిన మాట వాస్తవం. బూత్ లెవల్లో పార్టీని బలోపేతం చేస్తామంటున్న జనసేనాని, అమెరికాలో బీజేపీ ముఖ్యనేతల్లో ఒకరైన రామ్ మాధవ్‌తో మంతనాలు జరిపారు. 'అవునా.? మీకు అలా సమాచారం వచ్చిందా.?' అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారుగానీ, జరగాల్సిన తతంగం అయితే తెరవెనుకాల జరిగిపోతోంది.
అన్నయ్య చిరంజీవి, సామాజిక న్యాయమంటూ రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని కలిపేసి, కేంద్ర మంత్రిపదవి దక్కించుకుని, తనకు న్యాయం చేసుకున్న విషయం విదితమే. పవన్‌కళ్యాణ్‌తో పోల్చితే, చిరంజీవే బెటర్. ఎక్కువగా నాన్చకుండా వచ్చిన పని పూర్తి చేసుకున్నారు.. ఇప్పుడాయన, రాజకీయాలకు దూరమైపోయారు. 'మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ (రాజ్యసభ), మాజీ కేంద్రమంత్రి.. అనే పిలుపులు ఆయనకి ఎప్పుడూ వుండిపోతాయ్.
తమ్ముడి పరిస్థితే మరీ దారుణం. కనీసం, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయారు పవన్ కళ్యాణ్. ఏమో, ఎమ్మెల్యేగా గెలిచేందుకే మళ్ళీ బీజేపీతో 'పెళ్ళి'కి.. అదేనండీ పొత్తు కోసం జనసేనాని వెంపర్లాడుతున్నారేమో. జనసేన శ్రేణులేమో ఈ విషయాన్ని ఖండించేస్తున్నాయి. కానీ, పవన్‌కళ్యాణ్ నిర్ణయాలు ఎలా వుంటాయో ఖచ్చితంగా చెప్పగలిగేంత సీన్ జనసేన పార్టీలో ఎవరికీ లేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీతో కలుస్తారో, తిరిగి టీడీపీ పంచన చేరుతారో.. ప్రస్తుతానికైతే జనసేనాని.. రాజకీయంగా 'స్లీపింగ్' మోడ్‌లో మాత్రమే కన్పిస్తున్నారు.