ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈ నెల 11 నుంచి నిర్వహించబోతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్ ను ప్రవేశ పెట్టబోతున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల పదకొండు నుంచి సమావేశాలు ప్రారంభం అవుతుండగా, ఆ మరుసటి రోజున బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్టుగా తెలుస్తోంది.
ఈ నెల పన్నెండున మధ్యాహ్నం 11 గంటలకు బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్టుగా ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు అన్ని శాఖలతోనూ ఇప్పటికే ఆర్థిక శాఖా మంత్రి సమన్వయ భేటీలు నిర్వహిస్తూ ఉన్నారు.
ఇక అదే రోజున వ్యవసాయ శాఖా మంత్రి వ్యవసాయ బడ్జెట్ ను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు ఏర్పాట్ల గురించి స్పీకర్ తమ్మినేని సీతారాం మంగళవారం అధికారులతో సమావేశం కానున్నారు.
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతూ ఉంది. గతంలోని సంక్షేమ పథకాలకు తోడు జగన్ నూతన సంక్షేమ పథకాలను కూడా తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కేటాయింపులు ఎలా ఉంటాయనేది సర్వత్రా ఆసక్తిని రేపుతూ ఉంది.