టీఎస్‌ టీడీపీకి ‘మునిసిపల్‌’ మందు పనిచేస్తుందా?

ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు టీడీపీయే ప్రత్యామ్నాయమని చెప్పేవారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు 'తెలంగాణలో ఆట ఎలా ఆడాలో నాకు తెలుసు' అన్నారు. కాని కాలక్రమంలో టీఆర్‌ఎస్‌కు…

ఒకప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు టీడీపీయే ప్రత్యామ్నాయమని చెప్పేవారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగడానికి ముందు 'తెలంగాణలో ఆట ఎలా ఆడాలో నాకు తెలుసు' అన్నారు. కాని కాలక్రమంలో టీఆర్‌ఎస్‌కు టీడీపీ ప్రత్యామ్నాయం కాలేకపోయింది. ఏ ఎన్నికల్లోనూ చంద్రబాబు ఆటలు సాగలేదు. లోక్‌సభ ఎన్నికల్లో అసలు ఆటే ఆడలేదు. తెలంగాణలో చతికిలపడ్డ తరువాత ఏపీలో అదే పరిస్థితి ఎదురైంది. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మనుగడ కోసం పోరాడుతోంది. తెలంగాణలో పట్టిష్టమైన క్యాడర్‌ ఉందని చెప్పుకునే ఆ పార్టీ పూర్తిగా చనిపోయింది. లీడర్లు వెళ్లిపోయినా క్యాడర్‌ ఇంకా బలంగానే ఉందని ఇప్పటికీ కొందరు నాయకులు చెప్పుకుంటూనే ఉంటారు. ఇదో రొటీన్‌ డైలాగ్‌ మాత్రమే. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ మొదటి టర్మ్‌లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ పతనమైంది. ఆ తరువాత అనేక ఎన్నికల్లో ఈ అపజయ పరంపర కొనసాగుతూ వచ్చింది. చివరకు 'ఓటు నోటు' కేసులో ఇరుక్కున్న బాబు ఏపీకి తరలివెళ్లిపోయారు.

అధికారంలో ఉన్న ఐదేళ్లూ అక్కడ ఆయన ఆటలు సాగించారు. ప్రజలకు అమరావతి పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారు. ప్రత్యేక హోదా కావాలన్నారు. అది కుదరదని ప్యాకేజీ ఇస్తామంటే సరేనన్నారు. పరిపాలన చరమాంకంలో బీజేపీతో తెగదెంపులు చేసుకొని మళ్లీ హోదాపై గళమెత్తారు. చాపకింద నీరులా ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను గుర్తించలేకపోయారు. చివరకు ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు. ఓటమి అనే చీకటి నుంచి ఆయన ఇంకా బయటకు రాలేదు. ప్రజలు ఇంత దారుణంగా ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదంటూ కుమిలిపోతున్నారు. ఆయన ఎంతగా కుమిలిపోతున్నా జరగాల్సినవి ఆగవు కదా…! పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి.

ఆ రాష్ట్రంలో పార్టీ నిర్వీర్యమైపోయింది. ఏ చట్టసభల్లోనూ ప్రజాప్రతినిధులు లేరు. పార్టీ తరపున కార్యక్రమాలు లేవు. ప్రజా సమస్యలపై పోరాటాలు లేవు. పార్టీ పుంజుకోవడానికి శక్తిసామర్థ్యాలు లేవు. ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థంకాని తెలంగాణ టీడీపీ నేతలు బాబును సంప్రదించారు. 'అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ పోటీ చేయాల్సిందే' అని బాబు దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో పార్టీ పుంజుకోవాలనేది బాబు కోరిక. నిర్వీర్యమైన పార్టీలో మళ్లీ ఉత్తేజం నింపాలనేది ఆయన ఆకాంక్ష. అందుకు సరైన మందు మున్సిపల్‌ ఎన్నికలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో కొంతమేరకైనా గెలుపు సాధిస్తే జబ్బు కొంత తగ్గుతుందని అనుకుంటున్నారు. గతంలో బాబు ఏపీలో అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణకు ఎక్కువ సమయం కేటాయించలేకపోయారు. ఏ ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా పాత్ర పోషించలేకపోయారు. అందులోనూ బాబు తెలంగాణలో యాక్టవ్‌గా ఉంటే కేసీఆర్‌ సహించలేకపోయేవారు. బూతులు లంకించుకునేవారు. చంద్రబాబు ఏపీలో అధికారంలో ఉన్నంతకాలం ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉన్న పరిస్థితి చూశాం.

ప్రస్తుతం అధికారం లేదు కాబట్టి తీరిక ఎక్కువగా ఉంది. మరి తెలంగాణకు వచ్చి మున్సిపల్‌ ఎన్నికలకు వ్యూహాలు రచిస్తారా? అనేది చూడాలి. అధినేత పక్కనే ఉంటే ఆ జోష్‌ వేరు కదా. బాబు తెలంగాణలో తిష్ట వేస్తే కేసీఆర్‌కు మళ్లీ పూనకం వస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులతో విఫలమైన టీడీపీ మునిసిపల్‌ ఎన్నికల్లో వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో…! అన్ని మునిసిపాలిటీల్లో పోటీ చేయాల్సిందేనని బాబు తెలంగాణ నాయకులకు చెప్పడం సాహసమే. ఈ ఎన్నికల్లో కూడా పోటీ చేయకపోతే పార్టీ పూర్తిగా కనుమరుగైపోయే ప్రమాదముందని బాబు భావించివుండొచ్చు.

ఆయన సాహసం చేస్తున్నందుకు గౌరవప్రదమైన ఫలితాలు సాధిస్తే పరువు దక్కుతుంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ చాలా దూకుడుగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో దుమారం రేపింది. లోకసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెల్చుకొని బీజేపీ ఊపు మీద ఉంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తమ పార్టీయేనని కాషాయ నాయకులు చెలరేగిపోతున్నారు. మరి ఈ రెండు పార్టీలను తట్టుకొని టీడీపీ నెట్టుకురాగలదా? 

ఇప్పుడు కాపీ కొడితే అవతల వాళ్లు తేలికగా వదలరు