సవరించిన జిపిఎస్ చక్కగా ఉంది కదా

సిపిఎస్ రద్దు కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రులు దఫదఫాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. సిపిఎస్ కంటే మెరుగైన పెన్షన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతగానో నచ్చజెప్పడానికి…

సిపిఎస్ రద్దు కోసం ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో రాష్ట్ర మంత్రులు దఫదఫాలుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. సిపిఎస్ కంటే మెరుగైన పెన్షన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వం ఉద్యోగులకు ఎంతగానో నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే జిపిఎస్ ను తీసుకువచ్చారు. దాని పట్ల కూడా ఉద్యోగులు విముఖత వ్యక్తం చేసిన తర్వాత.. తాజా చర్చల పర్యవసానంగా జిపిఎస్‌కు కొన్ని సవరణలు కూడా చేశారు. 

నిజం చెప్పాలంటే, ఇది ఉభయతారకంగా, ఆమోదయోగ్యంగా ఉన్న పద్ధతి! అయితే దీనికి కూడా ఒప్పుకోకుండా ఉద్యోగులు ససేమిరా అంటున్నారు. మేమేం చేయగలం అనేది ప్రభుత్వం మాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇస్తానంటున్న సవరించిన జిపిఎస్ ఎలా ఉన్నదో గమనిద్దాం..

మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటిస్తున్న ప్రకారం.. ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత కనీసం పదివేల రూపాయలు పింఛను ఉండేలా ఈ పథకాన్ని రూపుదిద్దారు. ఉద్యోగికి వారి భాగస్వామికి కూడా సర్వీసులో ఉన్నప్పుడు వర్తించే విధంగానే ప్రమాద బీమా, హెల్త్ కార్డు సదుపాయాలను కల్పిస్తున్నారు. ఉద్యోగి చనిపోయిన తర్వాత భాగస్వామికి పింఛన్ సదుపాయం ఇస్తామని కూడా చెబుతున్నారు. పాత పింఛను విధానంకంటె డబ్బు తక్కువగా వస్తుంది తప్ప.. తతిమ్మా అంతా అలాగే ఉంది. అయితే దీనికి కూడా ఉద్యోగులు ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వంతో మంతనాలలో మరింత పీటముడి వేసుకుని కూర్చుంటున్నారు!

సిపిఎస్ ద్వారా ఒక ఉద్యోగికి వచ్చే దాని కంటే తాజాగా ప్రకటించిన సవరించిన జిపిఎస్ రూపంలో వచ్చే సొమ్ములు ఎక్కువ! ఉన్న సదుపాయాలు కూడా ఎక్కువ! ఉద్యోగికి పదివేల రూపాయల పెన్షన్ రావడం అంటే జీవనగమనానికి సరిపోయే మొత్తం. పైగా వారు సుదీర్ఘకాల ఉద్యోగ జీవితంలో నిలువ చేసుకున్న సొమ్ము కూడా ఉంటుంది. ప్రభుత్వం 10000 ఇస్తుంది. ఆరోగ్యపరంగా హెల్త్ కార్డు సదుపాయం ఉంటుంది. 

సాధారణంగా పిల్లలు అప్పటికే స్థిరపడి ఉండాలి. మా పిల్లలు అసమర్థులు, వారు స్థిరపడలేదు.. వారికి పూటగడవడానికి కూడా తిండి మేమే పెట్టాలి.. కాబట్టి ఈ పింఛను చాలదు.. అని ఎవరైనా వాదిస్తే అందుకు ప్రభుత్వం చేయగలిగేది ఏమీ ఉండదు. ఇంతకంటే ఎక్కువ ఏం అవసరం అవుతుంది? అనేది సాధారణ ప్రజలకు కలుగుతున్న సందేహం!!

పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నది ఒక్కటే సిపిఎస్ ఉద్యోగుల పట్టుదలగా ఉంది. అయితే ఆ అవకాశం మాత్రం కనిపించడం లేదు. ఆ విధానంలో ప్రభుత్వం మీద పడే ఆర్థిక భారం మామూలుది కాదు. రాష్ట్రంలో మొత్తం ఉద్యోగులకు ఇస్తున్న జీతాల కంటే రిటైర్ అయిన వారికి ఇస్తున్న పెన్షన్లు ఎక్కువగా మారిపోతున్న పరిస్థితి ఉంది. 

ఇలాంటి నేపథ్యంలో ఈ ఆర్థిక భారానికి ఎక్కడో ఒకచోట ఫుల్ స్టాప్ పెట్టకపోతే మొత్తం ప్రభుత్వమే కుదేలైపోయే అవకాశం ఉంటుంది. సిపిఎస్ అనేది ఉద్యోగులకు మరీ తక్కువ మొత్తం పింఛనుగా వచ్చే ఏర్పాటు అయి ఉండవచ్చు గాక.. అప్పట్లో వారి వెతలను చూసి దానిని రద్దు చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి ఉండవచ్చు గాక.. కానీ ఆచరణాత్మక అవకాశాలను బేరీజు వేసుకున్నప్పుడు.. అది అసాధ్యం అని ఆయన గ్రహించి ఉంటారు. 

బొత్స మాటల్లో కూడా అదే కనిపించింది. నిజానికి ఈ వ్యవహారాన్ని గమనిస్తే ప్రభుత్వం ఇప్పుడు ప్రకటించిన ‘సవరించిన జిపిఎస్’ అనేది అందరికీ ఎంతో అనుకూలంగా ఉన్న ప్రతిపాదన. ఉద్యోగులు దీనికి ఒప్పుకోకుంటే వారు నష్టపోయే అవకాశాలే ఎక్కువ!