ఇటు బీసీలు.. అటు కాపులు.. మధ్యలో టీడీపీ..!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలకమైన కొన్ని కులాల ఓటు బ్యాంకు విషయంలో అనుసరించిన వ్యూహం బెడిసికొట్టడంతో చేజారిన కులాలను ఇపుడు ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్ధంకాక తల పట్టుకుంటున్నారు. ఒకప్పుడు తమకు వెన్నుదన్నుగా నిలచిన…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు కీలకమైన కొన్ని కులాల ఓటు బ్యాంకు విషయంలో అనుసరించిన వ్యూహం బెడిసికొట్టడంతో చేజారిన కులాలను ఇపుడు ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్ధంకాక తల పట్టుకుంటున్నారు. ఒకప్పుడు తమకు వెన్నుదన్నుగా నిలచిన బీసీలను దూరం చేసుకోవడంతో పాటు ఇంకోవైపు కీలకమైన కాపు ఓటు బ్యాంకునూ ప్రసన్నం చేసుకోలేని దుస్థితి టీడీపీ చవి చూసింది. ఈ రెండు సామాజిక వర్గాలూ చెరోవైపు చెదిరిపోవడంతో చంద్రబాబుకు ఘోర పరాజయం తప్పలేదన్నది విశ్లేషకుల మాట! 2019 సార్వత్రిక ఎన్నికల్లో 40శాతం ఓట్లు లభించినట్టు దేశం అధినేత చంద్రబాబు చెబుతున్నప్పటికీ అసెంబ్లీ సంఖ్యా బలాన్ని పరిశీలస్తే మరీ ఇంత ఘోర పరాజయమా? అని ఆయావర్గాలు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

గోదావరి జిల్లాల్లో కాపు, బీసీ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. ఈ రెండు జిల్లాల్లో ఏ రాజకీయ పార్టీకి ఎక్కువ సీట్లు లభిస్తే ఆ పార్టీనే అధికారాన్ని హస్తగతం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. కీలకమైన ఇక్కడి బీసీ, కాపు ఓటు బ్యాంకుపై తెలుగుదేశం పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించేది! దివంగత నేత ఎన్టీ రామారావు బీసీలకు ప్రభుత్వంలో పెద్దపీట వేస్తూవచ్చారు. కాలక్రమంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు ఈ రెండు సామాజికవర్గాలనూ ఆకట్టుకోలేకపోగా, దురదృష్టవశాత్తూ ఆయావర్గాల ఆదరణకు దూరం కావాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఒకప్పుడు బీసీల్లో తిరుగులేని ఇమేజ్‌ సాధించిన టీడీపీ 2019 ఎన్నికల నాటికి వారిపై పట్టు కోల్పోయింది. అలాగని ఇటు కాపులకూ దగ్గర కాలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణం కాపులకు బీసీ రిజర్వేషన్‌ విషయంలో వైఫల్యమేనని స్పష్టమయ్యింది. 2014 ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే కాపులను బేషరుతుగా బీసీలుగా మార్చుతానని చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీల పేరుతో కాలయాపన చేసి చివరకు అసెంబ్లీలో ఓ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపడం కాపులకు మింగుడుపోని విధంగా మారింది.

కాపులకు రిజర్వేషన్లు కల్పించలేకపోయినా కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు, ఏడాదికి వెయ్యి కోట్ల కేటాయింపు, విదేశాల్లో ఉన్న విద్య వంటి మంచి అవకాశాలను చంద్రబాబు ప్రభుత్వం కల్పించింది. రాజకీయంగా కాపు సామాజికవర్గానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. ప్రభుత్వం ఇవన్నీ చేసినా బీసీ రిజర్వేషన్లను ఇవ్వకపోవడాన్ని కాపులు తీరని లోటుగా భావించారు. ఇదే సమయంలో బీసీలకు సకాలంలో తగిన ఆదరణ ప్రభుత్వం నుండి లభించకపోవడం, కాపులకే అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నారన్న ప్రచారం పెద్దఎత్తున జరగడం వంటి కారణాలతో టీడీపీకి గోదావరి జిల్లాల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురయ్యింది.

ఇంకోవైపు జనసేన ప్రత్యక్ష ఎన్నికల్లో దిగింది. జనసేనకు సీట్లు రాకపోయినా కాపుల ఓట్లు మాత్రం ఆశించిన స్థాయిలో పోల్‌ అయ్యాయి. ఇదిలావుంటే ప్రజాసంకల్ప యాత్ర సమయంలో జగన్మోహన్‌రెడ్డి బీసీలకు అనుకూలంగా గోదావరి జిల్లాల్లో చేసిన ప్రకటనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉండగా రాజమహేంద్రవరం ఎంపీ స్థానాన్ని బీసీకి కేటాయిస్తామని జగన్‌ స్పష్టం చేశారు. జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి మరింత కలకలం సృష్టించారు.

బీసీ సామాజికవర్గంపై వైకాపా పట్టు సాధించే ప్రయత్నాల్లో ఉండటంతో తెలుగుదేశం అప్రమత్తమయ్యింది. దీంతో ఎన్నికలకు కొద్దిరోజుల ముందు రాజమహేంద్రవరంలో చంద్రబాబు ఆధ్వర్యంలో జయహో బీసీ సదస్సు నిర్వహించారు. 2019లో అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అప్పటి సభలో చంద్రబాబు హమీనిచ్చారు. అయితే బాబు తీరుపై అప్పట్లో వెనుకబడిన వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఓటు బ్యాంకు రాజకీయానికి తెర తీశారంటూ చంద్రబాబుపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశేషం ఏమిటంటే తెలుగుదేశానికి చెందిన పలువురు బీసీ నేతలు సైతం అప్పట్లో బీసీలపై అణచివేత చర్యల పట్ల తీవ్ర నిరసనతో రగిలిపోయారు. న్యాయమూర్తుల పదవులు చేపట్టేందుకు బీసీలు అర్హులు కారంటూ వత్తాసు పలికిన చంద్రబాబు నేటి బీసీలను ఉద్ధరిస్తానంటూ బీరాలు పలకడం బాధాకరమని బీసీ నేతలు మండిపడ్డారు. 

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?