cloudfront

Advertisement

Advertisement


Home > Politics - Gossip

సానుభూతి కోసం వ్యూహాలు-మారని చంద్రబాబు తీరు

సానుభూతి కోసం వ్యూహాలు-మారని చంద్రబాబు తీరు

ఏపీలో తెలుగుదేశం పార్టీ సానుభూతి రాజకీయం పనిచేస్తుందా? తెలుగుదేశం పార్టీ గత ఐదేళ్లుగా ఏ తప్పు చేసిందో, అదే తప్పు మళ్లీ ఆరంభించిందా? రెండు నాలుకలతో మాట్లాడడం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కొత్త కాదు. అది తెలంగాణ సమస్య కావచ్చు. ప్రత్యేకహోదా కావచ్చు. మరొకటి కావచ్చు. ఆయన ఎన్ని మాటలు మార్చారో అందరికి తెలుసు. 2019లో ఓటమి తర్వాత అయినా ఆత్మ పరిశీలన చేసుకుని ఒక నిజాయితీ రాజకీయం చేస్తారని అనుకుంటే పాత మూసపోసిన పద్ధతిలోనే ఆయన తన రాజకీయం చేయాలని చూస్తున్నారు.

చూడండి చంద్రబాబు ఏమి ప్రసంగాలు చేస్తున్నారో.. మనమేం తప్పు చేయలేదు.. నీతివంతమైన పాలన ఇచ్చాం.. మరోవైపు మనం ఏమి తప్పులు చేశామో సమీక్షించుకుంటాం.. మళ్లీ ఆ తప్పులు చేయకుండా ఉండడానికి సమీక్షించుకుంటున్నాం. ఈ రెండిటిలో ఏదినమ్మాలి. కచ్చితంగా ఈ రెండిటిలో ఏదో ఒకటి అబద్ధం. 2014లో ఆయన వైఐఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌పై లక్షకోట్లు అంటూ ప్రచారం చేశారు. వివిధ కారణాల వల్ల చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో టీడీపీలో ఎమ్మెల్సీగా ఉన్న చక్రపాణిరెడ్డితో మాట మార్చే విషయం ప్రస్తావనకు వచ్చిందట. అప్పుడు చంద్రబాబు లక్షకోట్లు అని ప్రచారం చేస్తే జనంనమ్మారు కదా.. అందువల్లే అలాగే ముందుకు వెళ్లాలని సలహా ఇచ్చారట.

చంద్రబాబు అప్పట్లో ఏమనుకున్నారంటే అబద్ధాలు చెప్పడం ద్వారా అధికారంలోకి వచ్చాం కనుక వాటిని అలాగే కొనసాగించడం ద్వారా ఎల్లకాలం అధికారంలో ఉండవచ్చని భ్రమించారు. కాని చంద్రబాబు అబద్ధాల కోటలను జగన్మోహన్‌ రెడ్డి బద్దలుకొట్టారు. ఐదేళ్లలో చంద్రబాబు ఎన్ని అసత్యాలు చెప్పారో ఆయనకే తెలియని పరిస్థితి అయింది. వాటిని వినివిని జనానికి విసుగువచ్చింది. దాని ఫలితమే దారుణ పరాభవ పరాజయం. అయినా చంద్రబాబు ఆ సాలెగూడు నుంచి బయటపడలేకపోతున్నారు. అందుకే ఏదో ఒక అంశంపై గొడవచేయడం ద్వారా జనంలోకి వశళ్లాలని వ్యూహం తయారు చేసుకున్నారు.

వాటిలో టీడీపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఆరుగురు హత్యకు గురయ్యారని.. ఇలా ఏవేవో గోబెల్స్‌ ప్రచారం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఎటూ టీడీపీ మీడియా దానిని బాగా ప్రచారం చేస్తుందన్న నమ్మకం కూడా ఆయనకు ఉంది. నిజమే.. ఇక్కడ ఒకటి చెప్పాలి. ఎక్కడైనా అధికారంలోకి వచ్చామన్న అత్యుత్సాహంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు దాడులుచేసి ఉంటే వాటిని ఖండించవలసిందే. చర్యలు తీసుకోవలసిందే. కాని రెండువైపుల ప్రేరేపణతో ఘర్షణలు జరిగినా, వ్యక్తిగత కక్షలతో ఏవైనా ఘటనలు జరిగినా, వాటికి రాజకీయ రంగుపులిమి లబ్ధిపొందాలని ఎవరు ప్రయత్నించినా తప్ప అవుతుంది.

జనంలో దారుణంగా ఓటమిని చవిచూసిన చంద్రబాబుకు తమవాళ్లపైనే హింసా ఘటనలు జరుగుతున్నాయని ప్రచారం చేయడం ద్వారా సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ వచ్చాక శాంతిభద్రతలు క్షీణించాయని జనాన్ని నమ్మించాలని ఆయన వ్యూహం. కాని వాస్తవాలు జనానికి తెలియకుండాపోవు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మా పార్టీ వాళ్లు ఏమిచేసినా చూసిచూడనట్లు వెళ్లండని ఆదేశిస్తే, జగన్‌ ముఖ్యమంత్రి అవ్వగానే ఎవరు తప్పుచేసినా ఉపేక్షించవద్దని, చివరికి తమ ఎమ్మెల్యేలు తప్పుచేసినా వదలిపెట్టవద్దని చెప్పారు.

ఎమ్‌ఆర్‌ఓ.. వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమేనేని ప్రభావకర్‌ అనుచరులు ఇసుకలో పడేసికొడితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏమిచేసింది గుర్తులేదా? ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి తనను గెలిపిస్తే ఆరునెలలు ప్రత్యర్ధులను ఏవైనా చేసుకోవచ్చని చెప్పింది అవాస్తవమా? గుంటూరులో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు చెందినవారు ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం పోలీసులు పట్టించుకోనిది అవాస్తవమా? గోదావరి పుష్కరాలలో ఇరవైతొమ్మిది మంది చనిపోతే కనీసం కేసు కూడా పెట్టకపోవడం, సీసీటీవీ పుటేజీ కూడా కనిపించకుండాపోవడం అవాస్తవమా?

ఇసుక మాఫియాలు, జన్మభూమి కమిటీ మాఫియాలు ఇలా ఒకటేమిటి.. చేయని అరాచకాలు లేవే.. వాటన్నిటిని మర్చిపోయినట్లు నటిస్తూ టీడీపీ హింసా రాజకీయాలకు దూరం అని నీతి శతకాలు చెబితే సరిపోతుందా? నెల్లూరు జిల్లాలో ఒక వ్యక్తి హత్యకు గురైతే వైసీపీ వారు చంపారని చంద్రబాబు ఆరోపిస్తే, అది భార్యభర్తల గొడవ, అక్రమ సంబంధం అని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలలోనే వార్త వచ్చిన విషయాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి ఆధార సహితంగా చూపితే అసెంబ్లీలో కనీసం జవాబు ఇవ్వని టీడీపీ ఇప్పుడు పాత పద్ధతిలో చేసిన ఆరోపణలనే చేసుకుంటూపోతే ఎవరైనా కొందరైనా నమ్మరా అన్న భావనతో వెళుతోంది.

వాస్తవంగా ఏవైనా హత్యలు, మేజర్‌ ఘటనలు జరిగితే ఈపాటికి తెలుగుదేశం నేతలు బృందాలు, బృందాలుగా అక్కడకు వెళ్లి వచ్చేవారు కాదా? చంద్రబాబే అక్కడకు ఈపాటికి  బయల్దేరేవారు కాదా? నిజానికి చంద్రబాబు కాని, టీడీపీ కాని చేయవలసింది ఏమిటి? జరిగిన తప్పులను సమర్ధించుకోవడం కాకుండా.. ఎక్కడ? ఎలా తప్పులు జరిగాయి? పార్టీని ఎవరు భ్రష్టు పట్టించారు? పోలీసు వ్యవస్థను ఎంతగా దుర్వినియోగం చేయడం వల్ల వచ్చిన నష్టం ఏమిటి?

తదితర ఆంశాలపై ఆత్మశోధన చేసుకుని నిజాయితీతో కూడిన వ్యూహాన్ని సిద్ధంచేసుకుని అప్పుడు ప్రతిపక్షంగా నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి తప్ప.. ఇలా అరిగిపోయిన రికార్డు మాధిరి చెప్పిందే, చెబితే జనం నమ్ముతారని, వాళ్ల చెవిలో మళ్లీ పూలు పెట్టవచ్చని చంద్రబాబు భ్రమపడితే.. తెలుగుదేశం పార్టీకి జ్ఞానోదం కాలేదని జనానికి అర్థం అయిపోతుంది. అందువల్ల ఈ దిక్కుమాలిన రాజకీయం వల్ల చంద్రబాబుకు సానుభూతి రాదు.. జనంలో టీడీపీ అంటే మరింత ఏహ్యభావం కలుగుతుందని చెప్పకతప్పదు.
-కొమ్మినేని శ్రీనివాసరావు

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?