టీడీపీ నుంచి మరో పెద్ద వికెట్ పడబోతోందా..?

అవసరానికి వాడుకోవడం, కష్టకాలంలో వదిలేయడం చంద్రబాబుకి బాగా అలవాటు. ఆ అలవాటుతోనే ఆయన చాలామందిని దూరం చేసుకున్నారు. టీడీపీ లాయలిస్ట్ లు చాలామంది బాబుని వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా ఉత్తరాంధ్ర కీలక నేత, అశోక్…

అవసరానికి వాడుకోవడం, కష్టకాలంలో వదిలేయడం చంద్రబాబుకి బాగా అలవాటు. ఆ అలవాటుతోనే ఆయన చాలామందిని దూరం చేసుకున్నారు. టీడీపీ లాయలిస్ట్ లు చాలామంది బాబుని వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా ఉత్తరాంధ్ర కీలక నేత, అశోక్ గజపతిరాజు కూడా టీడీపీని వీడే రోజులు దగ్గరపడ్డాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్ని గమనిస్తే, అశోక్ ఇక ఎంతకాలం టీడీపీలో ఉండకపోవచ్చని అంటున్నారు.

ప్రస్తుతం వైసీపీ, అశోక్ గజపతిరాజు మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించి అశోక్ గజపతికి, వైసీపీకి మధ్య జరుగుతున్న రచ్చ అందరికీ తెలిసిందే. కోర్టు ద్వారా తన ట్రస్ట్ చైర్మన్ పదవిని తిరిగి దక్కించుకున్నా.. అశోక్ కి ప్రశాంతత దక్కలేదు. ఒకరకంగా ఆ తర్వాతే ఆయనకు తిప్పలు ఎక్కువయ్యాయి కూడా. 

ఓవైపు కూతురు లాంటి అమ్మాయితో నీతులు చెప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సంచైత గజపతి రాజు, అశోక్ ప్రతి చర్యనూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ పేరుతో జరిగే ప్రతి వ్యవహారాన్నీ సునిశితంగా పరిశీలిస్తూ బాబాయ్ చర్యల్ని ఎండగడుతున్నారు.

ఇక వైసీపీ నుంచి దాడి మామూలుగా లేదు. విజయసాయిరెడ్డి అశోక్ గజపతిరాజు తీరుని సోషల్ మీడియా వేదికగా దారుణంగా ఎండగడుతున్నారు. సదరు సామాజిక వర్గం నుంచి ఒత్తిడి ఎక్కువైనా కూడా ఎక్కడా తగ్గడంలేదు. వైసీపీ నేతల మాటల దాడితో పాటు, కేసుల పోటు కూడా అశోక్ గజపతిని ఇబ్బంది పెడుతోంది. మాన్సాస్ ట్రస్ట్ కు సంబంధించి అవకతవకలపై విజయనగరం పోలీస్ స్టేషన్ లో అశోక్ గజపతిపై పోలీసు కేసులు నమోదయ్యాయి.

రాచరికం నుంచి వచ్చిన అశోక్ క్లీన్ ఇమేజ్ కోసం తాపత్రయపడతారు. ఇన్నాళ్లూ వివాదరహితుడిగానే కొనసాగుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఆయనపై విమర్శల జడివాన కురుస్తోంది.

సహజంగా కేసుల్లో ఇరుక్కున్నవారంతా బీజేపీ తీర్థం పుచ్చుకుని పునీతులుగా మారడం ఏపీలో ఆనవాయితీ. దీంతో అశోక్ కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారట. బీజేపీలో చేరి కేంద్ర ప్రభుత్వ అండతో కాస్తో కూస్తో పరపతి పెంచుకోవాలనుకుంటున్నారట. గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం అశోక్ కు ఎలాగూ ఉంది కాబట్టి, ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడం పెద్ద విషయమేం కాదు. అలా రాష్ట్రంలో నడుస్తున్న వివాదాల నుంచి తప్పించుకోవాలనుకుంటున్నారు.

టీడీపీ నుంచి తాను ఆశించిన మద్దతు రాకపోవడంతో ఆయన పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. అశోక్ బయటకు వెళ్తే టీడీపీకి అది పెద్ద నష్టమేనని చెప్పాలి. ఆయన వెళ్లిపోతే ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి ఏంటి..? బీజేపీలో చేరినంత మాత్రాన అశోక్ గజపతి ఫేట్ మారుతుందా..? వీటికి కాలమే సమాధానం చెప్పాలి.