తెరమీద గ్రాండియర్లు..గ్రాఫిక్స్..ఇవన్నీ ఇండియన్స్ కు బాగా పరిచయం అయిపోయాయి. చరిత్ర కథలు కుప్పులు తెప్పలుగా బాలీవుడ్ లో కథలుగా వచ్చేసాయి. వీటిలో విజయం సాధించనవి తక్కువే. గ్రాండియర్ గా తీసేసినంత మాత్రాన చరిత్ర కథలను జనం అంత గొప్పగా అక్కున చేర్చుకున్న దాఖలాలు తక్కువ.
పుక్కింటి పురాణాలు, కాల్పనిక కథలు, చరిత్ర పాత్రలను తీసుకుని తాము తమ చిత్తానికి మార్చేసుకుని తయారుచేసుకున్న స్క్రిప్ట్ లను ఆదరించినట్లు ఫక్తు చరిత్రకు అంటిపెట్టుకుని తీసిన సినిమాలను దగ్గరకు తీసుకోవడం తక్కువ. పైగా మామూలుగానే మన జనాలకు చరిత్ర అంటే మక్కువ తక్కువ.
ఇలాంటి నేపథ్యంలో దర్శకుడు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ పార్ట్ వన్ రాబోతోంది. అత్యంత భారీ సినిమా. మల్టీ స్టారర్. విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్యరాయ్ లాంటి వాళ్లు ఒకే సినిమాలో వున్నారు. మణిరత్నం టీమ్ అయిన రెహమాన్, శ్రీకరప్రసాద్, తోట తరణి, బృంత లాంటి వాళ్లు ఈ సినిమాకు పని చేస్తున్నారు. లైకా సంస్థ నిర్మాత.
ఈ సినిమా ట్రయిలర్ విడుదల ఫంక్షన్ ను అద్భుతంగా నిర్వహించారు. రజనీ, కమల్ లాంటి హేమా హేమీలు వచ్చారు. ట్రయిలర్ విడుదల చేసారు. ఈ ట్రయిలర్ కు కమల్ వాయిస్ ఓవర్ ఇవ్వడం విశేషం. అయితే ట్రయిలర్స్ జస్ట్ పాత్రల పరిచయం ప్లస్ సినిమా జానర్, గ్రాండియర్ పరిచయం అన్నట్లు సాగింది. అంతకు మించి వుండడానికి కూడా అవకాశం తక్కువ. చోళులు, పాండ్యులు ఆ వైన్ తమిళ జనాలకు తెలిసినంతగా తెలుగు జనాలకు తెలిసింది తక్కువ. ఇక్కడ రెండు సమస్యలు వున్నాయి.
తమిళ జనాలకు తెలిసిన కథనే, తెరమీద రసవత్తరంగా ఆవిష్కరించాల్సి వుంటుంది. తెలుగు జనాలకు తెలియని కథను వివరంగా చెప్పాల్సి వుంటుంది. భారీ తారాగణం, భారీ చిత్రీకరణ కన్నా అదనంగా కంటెంట్ సినిమాలో వుండాలి. దానికి మణిరత్నం మార్క్ భావోద్వేగాలు, కథ..కథనాల తోడవ్వాలి. ఎందుకంటే మణి సినిమాలకు అవే బలం. మణి సినిమాల ఫ్లాప్ అయినా కూడా అప్లాజ్ రావడానికి కాలానికి నిలవడానికి అవే మూలం. ఈ సినిమా విషయంలో కూడా మణిరత్నం అటే వెళ్తారని అశించాలి.