ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని నానా బూతులు తిట్టేయడం, పోలీసులు వచ్చేలోగానే.. కోర్టుకు వెళ్లి లీగల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవడం అనేవిషయంలో.. తెలుగుదేశం పార్టీనేత అయ్యన్నపాత్రుడు స్పెషలిస్టు. ఎప్పుడూ ఆయన మీద ఏదో ఒక పోలీసు కేసు ఉంటూనే ఉంటుంది. రభస జరుగుతూనే ఉంటుంది.
అడ్డగోలుగా నానా చండాలమూ మాట్లాడేసి.. అధికార పార్టీ వారి మీద అసభ్యప్రచారాలకు తెగబడడంలో చాలాకాలంగా ఆయన వారసత్వాన్ని ఆయన కొడుకు చింతకాయల విజయ్ కొనసాగిస్తున్నారు. కాకపోతే.. గోరంట్ల మాధవ్ విషయంలో చేసిన అతికి ఇప్పుడు ఆయన సీఐడీ విచారణను ఎదుర్కోనున్నారు.
గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్టుగా చెలామణీలోకి వచ్చిన వీడియో వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ప్రత్యర్థి పార్టీలు వైసీపీ మీద అనేకానేక విమర్శలు చేయడానికి అవకాశం ఇచ్చింది. అయితే ఈ వీడియో అసలో నకిలీనో చెప్పలేకుండా ఉన్నాం అంటూ పోలీసులు సందేహాన్ని వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో తొలినుంచి.. తన జిమ్ వీడియోలను వాడుకుంటూ మార్ఫింగ్ చేసి.. ఈ వీడియో సృష్టించారని చెబుతూ వచ్చిన ఎంపీ గోరంట్ల మాధవ్ మరింత స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. తనపై కక్షతో మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోని సృష్టించారని సీఐడీ పోలీసులకు గోరంట్ల మాధవ్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన తన ఎంపీ లెటర్ హెడ్ మీద సీఐడీ అడిషనల్ డీజీకి లేఖ రాయడం విశేషం. దీనిపై సీఐడీ కేసు కూడా నమోదు చేసింది.
మార్ఫింగ్ వీడియోను ఐటీడీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందనేది గోరంట్ల మాధవ్ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఐటీడీపీ అనేది తెలుగుదేశం పార్టీ వారి అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫారం. దాంతో ఇప్పుడు పార్టీ జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ అధినేత చంద్రబాబు ఆధ్వర్యంలో ఐటీడీపీ పని చేస్తుందని.. దీని నిర్వహణ వెనుక చింతకాయల విజయ్, నారా లోకేష్ లు కూడా ఉన్నారని గోరంట్ల మాధవ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సీఐడీ అధికారులు రంగంలోకి దిగారు.
ఇప్పుడు చింతకాయల విజయ్ ను సీఐడీ పోలీసులు విచారించే అవకాశం ఉంది. గోరంట్ల మాధవ్ వీడియో బయటకు వచ్చినప్పటినుంచి వీరిద్దరి మధ్య హాట్ హాట్ గా వార్ నడుస్తోంది. ఆ వీడియో ప్రచారంలోకి వచ్చాక.. గోరంట్ల మాధవ్.. చాలా దారుణంగా తిట్టిన వారిలో చింతకాయల విజయ్ కూడా ఉన్నారు. తనను తిట్టినందుకు ఆయన సీరియస్ అయ్యారు కూడా. వీడియో వెనుక తాను ఉన్నానని చేసిన ఆరోపణల్ని కూడా ఖండించారు. ఆ మేరకు గోరంట్ల మాధవ్ పై రూ.50 లక్షలకు పరువునష్టం దావా కూడా వేశారు. సమన్లు పంపారు.
చింతకాయల విజయ్ న్యాయపరంగా ప్రొసీడ్ అయి మాధవ్ కు నోటీసులు పంపి.. ముందుకు వెళుతుండగా.. గోరంట్ల మాధవ్ సీఐడీ పోలీసుల రూపేణా కౌంటర్ ఎటాక్ ఇవ్వడం అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతోంది. చిన్న చింతకాయలకు ఇప్పుడు సీఐడీ పోలీసులు పులుసు తీస్తారా.. అని ప్రజలు సెటైరికల్ గా చర్చించుకుంటున్నారు.