1990 నుంచి అతడు నటుడిగా తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో అతడు పట్టుపదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. నటుడిగా ప్రయత్నాలు సాగించడం మొదలుపెట్టాకా దశాబ్దకాలానికి అతడికో హిట్ లభించింది.
తమిళనాట రాత్రికి రాత్రి అతడిని క్రేజీ స్టార్ ను చేసింది ఆ సినిమా. ఆ సినిమా పేరు సేతు, ఆ నటుడి పేరు విక్రమ్. సేతు కు ముందు విక్రమ్ బోలెడన్ని సినిమాల్లో నటించాడు. చిత్రంగా తెలుగులో కూడా అతడు హీరోగా, నెగిటివ్, సపోర్టింగ్ రోల్స్ లో చాలా సినిమాలు చేశారు. అయితే అవేవీ అతడికి కాస్త గుర్తింపును కూడా ఇవ్వలేదు!
శివపుత్రుడు, అపరిచితుడు సినిమాల సూపర్ సక్సెస్ లతో తెలుగులో విక్రమ్ కు గుర్తింపు లభించింది. అతడు అప్పటికే బోలెడన్ని తెలుగు సినిమాల్లో నటించాడు అనే విషయం కూడా అపరిచితుడు తర్వాతే బాగా గుర్తించారు తెలుగు జనాలు!
తన నటనతో జాతీయ అవార్డును అందుకున్న సత్తా ను చూపించాడు విక్రమ్. తన నటనకు బోలెడంత ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. తమిళంలో కమర్షియల్ సినిమాలోనూ విక్రమ్ ప్రస్థానం ప్రత్యేకమైనదే! ఇదంతా బాగానే ఉంది కానీ, విక్రమ్ కు తదుపరి హిట్ దక్కుతుందనేది మాత్రం పెద్ద మిస్టరీలా కనిపిస్తోంది!
సూటిగా చెప్పాలంటే విక్రమ్ కు తెలుగులో చెప్పుకోదగిన పెద్ద హిట్ 'అపరిచితుడు', ఆ తర్వాత విక్రమ్ విక్రమార్క ప్రయత్నాలు జరిగాయి. అవన్నీ భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యాయి. అయితే విక్రమ్ కు విజయదాహాన్ని మాత్రం తీర్చలేకపోయాయి సదరు సినిమాలు.
భారీ అంచనాల మధ్యన వచ్చిన మ్యూజికల్ హిట్ భీమ తెలుగులో సరిగా విడుదలే కాలేదు! తమిళంలో ఆ సినిమా ఇచ్చిన షాక్ కు తెలుగు వెర్షన్ విడుదల చేయలేకపోయినట్టుగా ఉన్నారు పాపం! ఆడియో అప్పటికే సూపర్ హిట్ , ఆ సినిమా ఎప్పుడొస్తుందో చూసిన ఆ పాటల అభిమానులు చివరకు దాన్ని పట్టించుకోవడం మానేశారు.
ఇక మల్లన్నలో తన గెటప్ తో ముందస్తుగా అంచనాలను భారీ స్థాయికి తీసుకెళ్లాడు. తీరా ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది!
ఆ తర్వాత విక్రమ్ ను తెలుగు వాళ్లు పెద్ద పట్టించుకోలేదు! తమిళంలో అతడు చేసిన పలు సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యి డిజాస్టర్లయ్యాయి.
అయితే శంకర్ దర్శకత్వంలో విక్రమ్ కాంబినేషన్ రిపీట్ కావడం తో ఐ విషయంలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ బడ్జెట్ విక్రమ్ గెటప్పులు ఆ సినిమా అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లాయి. అయితే గెటప్పులు తప్ప అసలు సంగతి లేకపోవడంతో ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఐ ఫెయిల్యూర్ తో విక్రమ్ కు తెలుగునాట మార్కెట్ జీరో రేంజ్ కు వచ్చింది.
తర్వాత గత కొన్నేళ్లలో విక్రమ్ సినిమాలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్లిపోయాయో చెప్పడం కూడా కష్టం! దాదాపు 17 యేళ్ల నుంచి విక్రమ్ కు తెలుగులో సరైన హిట్ లేదు. అయినా అతడి సినిమాలు ప్రతిసారీ విడుదల ముందు ఎంతో కొంత ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. అది విక్రమ్ నటనా పటిమపై ఉన్న ఆసక్తి.
అయితే విక్రమ్ మాత్రం గెటప్పులు మీద చూపిస్తున్న ఆసక్తి, కథల ఎంపికలో చూపిస్తున్నట్టుగా లేరు! అందుకే వరస ఫ్లాప్ లు, డిజాస్టర్లు ఎదురవుతున్నాయి. మరి ఈ గొప్ప నటుడికి హిట్ దక్కేదెన్నడనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకం.