'జగనన్నా..' అంటూ భజన పార్టీలుగా మారిపోయారు రాయలసీమలోని కొంతమంది రాజకీయ నేతలు. అధికారం జగన్ వద్ద ఉంది కాబట్టి.. ఇప్పుడు ఆయనను కీర్తించడానికి వీరు మొహమాట పడటంలేదు. మొన్నటి వరకూ జగన్‌ను అనరాని మాటలు అన్న వాళ్లు, జగన్ దగ్గర అధికారం లేదని ఆయన పార్టీని వదిలి బయటకు వచ్చినవాళ్లు.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డిని కీర్తిస్తూ ఉన్నారు. ప్రజలు వీళ్లను తిరస్కరించి, జగన్ మోహన్ రెడ్డిని అందలం ఎక్కించేసరికి వీళ్లలో చాలామార్పే కనిపిస్తూ ఉంది.
జగన్ మోహన్‌రెడ్డి ఒక అవకాశం ఇస్తే చాలు… వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి దూకడానికి చాలామంది నేతలు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ వారు జగన్ మోహన్ రెడ్డిని పొడిగేస్తూ ఉండటం గమనార్హం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతిలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్లు.. తాము తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోలేదని, జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఓడిపోయినట్టుగా చెప్పుకున్నారు. జగన్ మోహన్ రెడ్డే తమ మీద వచ్చి పోటీ చేసినట్టుగా ప్రజలు తీర్పు ఇచ్చారని.. జగన్ మోహన్ రెడ్డి అంతటి వ్యక్తి చేతిలో ఓడిపోవడం కూడా గౌరవమే అని వీళ్లంతా చెబుతూ ఉన్నారు.
గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ తర్వాత ఫిరాయించి.. ఇప్పుడు మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి సీమ ప్రాంతానికి చెందిన ఒక మహిళా నేత చాలా ప్రయత్నాలే సాగిస్తూ ఉంది. అందుకోసం జగన్ మోహన్ రెడ్డిని 'జగనన్నా' అంటూ కీర్తిస్తూ ఉంది. ఇక 'జగన్ మావాడే..' అంటూ అనంతపురం జిల్లాకు చెందిన ఒక ముసలాయన చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.
మొన్నటి వరకూ తమ సామాజికవర్గం వాళ్లంతా చంద్రబాబుకు రుణపడాలని అనుచిత వ్యాఖ్యలు చేసి… సొంత నియోజకవర్గంలో పరపతి కోల్పోయిన ఆ పెద్దమనిషి ఇప్పుడు జగన్‌ను కీర్తిస్తూ ఉన్నారు. తమ సంతానానికి అయినా జగన్ అవకాశం ఇస్తాడేమో అని ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు. కొన్ని జీవితాలు ఇంతేనేమో! ఎవరు అధికారంలో ఉంటే వాళ్ల భజన చేస్తూ గడిపేయడమే వాటి తీరేమో!