''సారీ చిన్నాన్న.. మీరు పంపిన ఉద్యోగి కోరుకున్న స్థానానికి ఇప్పటికే మరొకరికి మాట ఇచ్చాం. అక్కడికి పంపేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు. బదిలీలను నాన్న పారదర్శకంగా సమన్వయంతో చేస్తున్నారు. వ్యక్తిగతంగా మనకంటే కూడా జగనన్న ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకూడదని, తేకూడదని నాన్న తపిస్తున్నారు. అలాంటిది సిఫార్సు చేసినవారు చిన్నాన్నో లేదా పెదనాన్నో అని రాజీపడితే అసలుకే ఎసరు వస్తుంది'' అని ఆ యువకుడు నిర్మోహమాటంగా చెప్పాడు. దీంతో అటువైపు స్వయాన చిన్నాన్న అయిన వ్యక్తి కంగుతినాల్సిన పరిస్థితి. బదిలీల్లో పారదర్శకత గురించి చెప్పడమే కాదు త్రికరణ శుద్ధిగా ఆచరిస్తున్న ఆ యువనేత భూమన అభినయ్‌రెడ్డి.
తిరుపతిలో వైసీపీ సీనియర్ నేత భూమన కరుణాకర్రెడ్డి, ఆయన తనయుడు అభినయ్‌రెడ్డి ఆడంబరాలకు, ప్రచారాలకు దూరంగా, ప్రజలకు దగ్గరగా రాజకీయ ప్రయాణం చేస్తున్నారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమల పాదాల చెంత ఉన్న తిరుపతికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ జీవితాన్ని గడపాలని ప్రతిఒక్కరూ ఒక కలగా భావిస్తారు. అందులోనూ ప్రభుత్వ ఉద్యోగుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ పోస్టింగ్ తెచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలకు లక్షలాది రూపాయలు ముట్ట చెప్పేందుకు వెనుకాడరు. ఇది నిన్నటిమాట.
ప్రస్తుతం అధికార మార్పిడి జరిగిన తరుణంలో వారంక్రితం బదిలీల పర్వం మొదలైంది. ఇంకేముంది అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల ఇళ్లు, కార్యాలయాల ఎదుట ఉద్యోగుల రాక జాతరను తలపిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుపతి బదిలీల గురించి మాట్లాడుకొందాం. నిన్నమొన్నటి వరకు తిరుపతిలో పోస్టింగ్ తెచ్చుకున్న ఒక్కో ఉద్యోగి తాము ఎలా వచ్చామో కథలుకథలుగా చెప్పేవారు. అధికార పార్టీకి చెందిన ఏ నాయకుడి వద్దకెళితే పని అవుతుందో, ఏ పనికి ఎంత రేటో పూసగుచ్చినట్టు చెప్పేవారు. దీంతో అధికారం మారిన నేపథ్యంలో కొత్త ప్రజాప్రతినిధి కూడా అదే పంథా అనుసరిస్తారా లేక సీఎం జగన్ చెబుతున్నట్టు నీతి నిజాయతీలకు పట్టంకడుతారా అనే చర్చ సర్వత్రా సాగింది.
ఈ నేపథ్యంలో కరుణాకరరెడ్డి నేతత్వంలో ఆయన కుమారుడు అభినయ్‌రెడ్డి బదిలీల వ్యవహారాన్ని స్వయంగా పర్యవేక్షించి… ఇటు తండ్రికి, అటు తల్లి లాంటి పార్టీకి మంచి పేరు తీసుకొచ్చారనే ప్రశంస ఉద్యోగుల నుంచి వ్యక్తిమైంది. లండన్లో ఎంఎస్ (మాస్టర్ ఆఫ్ సైన్స్) కోర్సును అభినయ్ పూర్తిచేశారు. కోర్సులో భాగంగా బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ సిస్టమ్ మేనేజ్మెంట్ (బీఐఎస్‌ఎం) అభ్యసించాడు.
''సహజంగా మేము ఫలానా చోటికి బదిలీ కావాలని రాజకీయ నేతల దళారులను సంప్రదిస్తాం. మేము అడిగిన ప్రాంతం, హోదాను బట్టి ఇంత ఇవ్వండి అని ఆ దళారులు బేరాలు ఆడడం మా అనుభవంలో ఎన్నోచూశాం. కాని తమ సమస్యలపై వచ్చే ప్రజలతో ప్రేమగా మాట్లాడి పరిష్కరించండి అన్నా. అదే మాకు మీరు చేసే ఉపకారం అని అభినయ్ ప్రతి ఒక్క ఉద్యోగితో చెబుతున్నాడు. అతని రాజకీయ పరిణతి, ప్రజా సమస్యల పరిష్కారానికి అతని చిత్తశుద్ధి చూస్తుంటే మాకు గర్వంగా ఉంది'' అని ఓ ఉద్యోగి అభివర్ణించాడు. దీన్నిబట్టి తిరుపతిలో అభినయ్ రాజకీయాలపై ఎలాంటి పాజిటివ్ ధోరణి ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అభినయ్ ఎంతో పారదర్శకంగా సమన్వయపరిచారని చెప్పొచ్చు. ఎవరైనా ఉద్యోగి బదిలీ కోసం ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి దగ్గరికి వస్తే… వారి వివరాలను అభినయ్ ఓ నోట్‌బుక్లో పూర్తి వివరాలతో నోట్ చేసుకున్నాడు. ఇలా ప్రతి ఉద్యోగి వివరాలు నోట్ చేసుకోవడంతో గందరగోళానికి ఆస్కారం లేకుండా పోయింది. ఉద్యోగి అడిగిన ప్లేస్కు సంబంధించి మరెవరికైనా మాట ఇచ్చామా లేక ఖాళీగా ఉందా అనే విషయాలకు సంబంధించి ఎలాంటి రహస్యాలకు, లోపాయికారి వ్యవహారాలకు తావులేకుంగా ఉద్యోగుల ఎదుటే నోట్ బుక్ను చూపుతుండటం గమనార్హం.
దీంతో కరుణాకరరెడ్డి లేదా ఆయన తనయుడు చెబుతున్న మాటలపై ఇటు ఉద్యోగుల్లోనూ, అటు ప్రజల్లోనూ నమ్మకం పెరిగింది. తిరుపతిలో ఎంతో పారదర్శకంగా బదిలీలు జరుగుతున్న విషయం చిత్తూరుజిల్లా వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారమవుతోంది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలకు ఒకింత ఇబ్బందికరంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా బదిలీల వ్యవహారం అభినయ్ నూతన రాజకీయాలకు ఒక పరీక్షగా నిలిచింది.