అక్రమార్కులకు బీజేపీ అండ!

నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉండి బోలెడన్ని అక్రమాలకు పాల్పడ్డారు. వారి తీరుతోనే ప్రజలు తెలుగుదేశం పార్టీని దారుణంగా తిరస్కరించారు. కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లకు పరిమితం చేశారు. ప్రత్యేకించి రాయలసీమలో…

నిన్న మొన్నటి వరకూ తెలుగుదేశం పార్టీలో ఉండి బోలెడన్ని అక్రమాలకు పాల్పడ్డారు. వారి తీరుతోనే ప్రజలు తెలుగుదేశం పార్టీని దారుణంగా తిరస్కరించారు. కేవలం ఇరవై మూడు ఎమ్మెల్యే సీట్లకు పరిమితం చేశారు. ప్రత్యేకించి రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అవస్థను వేరే చెప్పనక్కర్లేదు. తమకు కంచుకోట అనుకున్న ప్రాంతాల్లోనే తెలుగుదేశం పార్టీకి దారుణమైన పరాజయాలు ఎదురయ్యాయి. తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి ఓటమి అన్నదే ఎరుగని నేతలు కూడా ఇటీవలి ఎన్నికల్లో చిత్తు అయ్యారు.

అందుకంతా కారణం.. అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలోని వారు చేసిన అక్రమాలే. ఆ అక్రమాలతో విరక్తిచెందే తెలుగుదేశం పార్టీని ప్రజలు అంతలా తిరస్కరించారు. తెలుగుదేశం పార్టీ వాళ్లు దోచుకోని అంశం అంటూ ఏదీ లేదు. నీరు- చెట్లు, గాలి, మట్టి, ఇసుక.. ఇలా ప్రతిదాంట్లోనూ దోపిడీ చేశారు. నీరు-చెట్టు కార్యక్రమం పేరుతోనే పెద్ద దోపిడీ జరిగింది. రాయలసీమ ప్రాంతంలో గాలిమరల ఏర్పాటు చేసే వారందరితోనూ తెలుగుదేశం పార్టీ దోపిడీ పర్వం కొనసాగింది. సీమలో పవన విద్యుత్‌పై వివిధ కంపెనీలు పెట్టుబడులు పెడుతూ ఉండగా.. వారి నుంచి తెలుగుదేశం వాళ్ల వసూళ్ల దందాసాగింది.

ఇక వాగులు, వంకల నుంచి ఇసుకను తోడి తోడి వాటిని గుల్లచేశారు. ఐదేళ్లలో రాయలసీమ ప్రాంతంలోని వివిధ వాగులూ వంక రూపు రేఖలే చెదిరిపోయాయి. అలా దోపిడీ సాగించిన వారు దానికి అలవాటు పడిపోయారు. వారిని ప్రజలు తిరస్కరించినా ఎలాగోలో దోపిడీ సాగించాలని ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు. అలాంటి వారికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు గట్టిగా అండగా నిలబడుతూ ఉండటం గమనార్హం.

రాజకీయంగా తాము బలోపేతం కావాలనే ప్రయత్నంలో కమలనాథులు అక్రమార్కులకు కాషాయ కండువాలు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరి వంటి వాళ్లను బీజేపీ చేర్చుకుంది. సూరి దందా ఏమిటో అనంతపురం జిల్లా ప్రజలందరికీ బాగా తెలిసినదే. అధికారాన్ని అడ్డంపెట్టుకుని అన్ని రకాలుగానూ దోచేసి, ఆపై కాంట్రాక్టులతో కూడా అక్రమాలకు పాల్పడిన వ్యక్తిగా ఆయన పేరు పొందారు.

రోడ్డు కాంట్రాక్టులు చేపట్టి.. అందుకు సంబంధించిన ముడిసరుకులో ముఖ్యమైనది అయిన కంకర కోసం అక్రమ క్వారీలను నిర్వహించడంలో వరదాపురం సూరి వార్తల్లోకి ఎక్కాడు. అనుమతులే లేకుండా కొండలను పిండిచేసి.. వరదాపురం సూరి కంకరను తరలించాడనే అభియోగాలు బలంగా ఉన్నాయి. కొండలకు కొండలనే కరిగించాడు. అలాంటి పనులకు అనుమతులు లేవు. అందుకు సంబంధించి ఇప్పుడు చర్యలు మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంతలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకున్నాడు.

ఇక నుంచి దేశభక్తి, నరేంద్రమోడీ అంటూ నీతులు చెబుతాడు. ఐదేళ్లపాటు తెలుగుదేశం పార్టీలో ఉండి అక్రమాలకు పాల్పడి ఇప్పుడు షెల్టర్‌ కోసం బీజేపీలోకి చేరారు. వచ్చే ఎన్నికల వరకూ కమలం పార్టీలో ఉండొచ్చు.. మళ్లీ ఎన్నికల సమయానికి తెలుగుదేశంలోకే వచ్చి చేరొచ్చు! మొత్తానికి తెలుగుదేశం పార్టీలో ఉండి దోచుకున్న వాళ్లకు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు బాగా ఉపయోగపడుతూ ఉందని సామాన్య ప్రజానీకం అనుకుంటూ ఉంది.

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?