పవన్ ఈ ప్రశ్నలకు బదులివ్వగలవా?

కింద పడినా, భూమి మీదే వున్నాననే టైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కులం బలాలు చూసి, ఓ పక్క తనకు కులం పిచ్చి లేదని చెబుతూ, తను తన సోదరుడు ఎంచుకుని మరీ…

కింద పడినా, భూమి మీదే వున్నాననే టైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కులం బలాలు చూసి, ఓ పక్క తనకు కులం పిచ్చి లేదని చెబుతూ, తను తన సోదరుడు ఎంచుకుని మరీ పోటీ చేసినా, జనం ఓడించి ఇంటికి పంపారు. అది ముమ్మాటికీ అంగీకరించాల్సిన వాస్తవం. ఈ సందర్భంగా పవన్ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వుంది.

ఓడిపోయిన తరువాత తనను ఓడించడానికి కోట్లు ఖర్చు చేసారని పవన్ చెప్పిన మాట వాస్తవమా కాదా?

అంటే పవన్ అభిమానులు కూడా డబ్బులకు అమ్ముడుపోయారని పవన్ అనుకుంటున్నారా?

అసలు ఎంత అభద్రతా భావం లేకపోతే పవన్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తారు?

అభ్యర్థులను నిలబెట్టడంతలో పవన్ తెలుగుదేశం పార్టీతో మిలాఖత్ అయింది వాస్తవమా? కాదా?

జగన్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేదని పవన్ జోస్యం చెప్పిన మాటకు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు? ఈ విషయంలో ఆయన ప్రజలను తప్పు పడతారా?

డబ్బులతో ఓడించారని ఓసారి, ఓడిపోయినా తనకేం బాధలేదని మరోసారి, ఓడిపోతానని ముందే తెలుసని ఇంకోసారి, ఇలా చిత్తానికి వచ్చినట్లు పవన్ మాట్లాడుతున్నది వాస్తవమా? కాదా?

నిజాయతీ, నిఖార్సుల గురించి మాట్లాడే పవన్ తను సినిమాలు చేయను అని ప్రకటించి కూడా, నిర్మాతల అడ్వాన్స్ లు వడ్డీలేని అప్పుల్లా తన దగ్గర వుంచుకోవడం ఎంత వరకు సమర్థనీయం?

గెలిచినా ఓడినా గాజువాకలోనే వుంటా అన్న పవన్ ఓడిన తరువాత ఒక్కసారి కూడా అటు ఎందుకు వెళ్లలేదు?

నరసాపురం ప్రజలకు అండగా వుంటా? వారి సమస్యలపై పోరాడతా? అన్న అన్న నాగబాబును అక్కడే వుండేలా పవన్ ఎందుకు ఆదేశించలేకపోయారు?

అసలు గత అయిదేళ్లలో పవన్ ప్రజల్లో వున్న కాలం ఎంత? జగన్ ప్రజల్లో వున్న సమయం ఎంత?

తెలుగుదేశం పార్టీతో పొత్తు లేకుండా 2024 కావచ్చు, 2029 కావచ్చు. ఎన్నికల్లో పోటీ చేస్తానని క్లారిటీగా పవన్ చెప్పగలరా?

జైలుకు వెళ్లి రాలేదు కదా? తనెందుకు సిగ్గుపడాలి? ఓటమి సహజం అని అంటున్న పవన్ కళ్యాణ్ ఓసారి రాహుల్ గాంధీని చూడండి. ఆయన కూడా జైలుకు వెళ్లి రాలేదు. కానీ ఓటమికి బాధ్యత తీసుకుని, పార్టీ అధ్యక్షపదవికి దూరంగా వున్నారు. పవన్ అలా వుండి, ఆ పదవి వేరేవాళ్లకు ఇవ్వగలరా?

ఓడిన వెంటనే కమిటీలు మూడు, నాలుగు అంటూ ప్రకటించిన పవన్, వాటి నిర్మాణంపై ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నారు? 

రాజధాని పనుల మీద, ప్రగతి మీద కమిటీ వేస్తానన్న పవన్, గడచిన అయిదేళ్లలో రాజధాని వ్యవహారాల మీద, టెండర్ల మీద ఎందుకు కమిటీ వేయలేదు? మాట్లాడలేదు?

ఓ రాజకీయ పార్టీ నేతగా సమాంతర అంశాల మీద కానీ, సమస్యల మీద ఒక్క మాట అయినా పవన్ మాట్లాడగలుగుతున్నారా?

ఇలా ప్రశ్నిస్తూ పోవాలే కానీ, ప్రశ్నిస్తామనే పార్టీని ప్రశ్నించడానికి అనేకానేక ప్రశ్నలు. ఎప్పటికయ్యది అనే పద్దతిలో తడవకు ఓ మాట మాట్లాడే పవన్  మాటలకు విలువేముంటుంది? చెప్పే సమాధానాలు ఏముంటాయి?

వికేంద్రీకరణకే వైఎస్ జగన్ మొగ్గు?